Dhoni- Ashwin: నేనూ అతడి నాయకత్వంలో ఆడా.. కెప్టెన్‌గా ధోనీ సక్సెస్‌ సీక్రెట్ అదే: అశ్విన్‌

ధోనీ నాయకత్వంలో (MS Dhoni) ఒక్కసారి ఆడినా చాలు జీవితాంతం గుర్తుండిపోతుంది. టీమ్‌ఇండియా సీనియర్‌ బౌలర్‌ రవిచంద్రన్ అశ్విన్‌ (Ashwin) కూడా మరోసారి ఈ విషయాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు.

Published : 23 Jun 2023 16:52 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో (WTC Final 2023) భారత్‌ ఓడిపోవడానికి ప్రధాన కారణం తుది జట్టులో అశ్విన్‌ లేకపోవడమేనని మాజీలు చెబుతుంటారు. అలాగే తొలుత బౌలింగ్‌ ఎంచుకోవడం కూడా తప్పిదమేనని విమర్శలు వచ్చాయి. సరిగ్గా పదేళ్ల కిందట ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని టీమ్‌ఇండియా ఛాంపియన్స్‌ ట్రోఫీని నెగ్గింది. ఆ తర్వాత ఇప్పటి వరకు ఒక్క ఐసీసీ టైటిల్‌ కూడా భారత్‌ ఖాతాలో పడలేదు. ఈ క్రమంలో సోషల్‌మీడియా వేదికగా టీమ్‌ఇండియాపై విపరీతంగా ట్రోలింగ్‌ జరిగింది. వాటన్నింటిపై భారత సీనియర్‌ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ తన యూట్యూబ్ ఛానల్‌లో స్పందించాడు. 

వారికి అర్హత ఉంది..

డబ్ల్యూటీసీ ఫైనల్‌ గదను సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా జట్టుకు శుభాకాంక్షలు. ఫైనల్‌లో విజేతగా నిలవడానికి వారికి అర్హత ఉంది. మార్నస్‌ లబుషేన్ ఇక్కడే కౌంటీ క్రికెట్‌ ఆడిన అనుభవం అక్కరకొచ్చింది. అయితే, కేవలం ఒక్క టెస్టుతోనే తేలిపోవడం వల్ల ఎవరు ఎలా ఆడారనేది చెప్పడం కష్టమే. కానీ, విజేతగా నిలవడానికి మాత్రం ఆసీస్‌కు అర్హత ఉంది. గత డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకోవడంలో ఆసీస్‌ విఫలమైంది. టీమ్‌ఇండియా మాదిరిగా ఆస్ట్రేలియా కూడా నిలకడగా టెస్టు క్రికెట్‌ ఆడుతుంది.

పదేళ్ల నుంచి..

గత పదేళ్ల నుంచి మేం ఒక్క ఐసీసీ ట్రోఫీని నెగ్గలేదనే బాధ, ఆవేశం అభిమానుల్లో ఉండటం అర్థం చేసుకోదగినదే. ఫ్యాన్స్‌కు నా సానుభూతి తెలుపుతున్నా.  ప్రతి కీలక మ్యాచ్‌కు ఫలానా ఆటగాడిని తుది జట్టులోకి తీసుకోండి. మరో ఆటగాడిని తీసేయండంటూ సోషల్‌ మీడియా వేదికగా కామెంట్లు పెడుతుంటారు. ఎంతటి నాణ్యమైన ఆటగాడైనా సరే రాత్రికి రాత్రే పెను మార్పులు తీసుకురాలేడు. చాలా మంది ఎంఎస్ ధోనీ నాయకత్వం గురించి మాట్లాడుతూ ఉంటారు. అతడు ఏం  చేశాడు? క్లిష్టమైన విషయాలను కూడా చాలా సాధారణంగా మార్చేసేవాడు. అతడి నాయకత్వంలో నేనూ ఆడా. ఏదైనా సిరీస్‌కు లేదా టోర్నీకి 15 మంది స్క్వాడ్‌ను తీసుకుంటే తుది జట్టులోకి వచ్చే 11 మందితోనే మొత్తం ఆడిస్తాడు. దాని వల్ల జట్టులో తమ స్థానం భద్రంగా ఉంటుందనే భరోసా వస్తుంది. మరింత రాణించేందుకు ఆస్కారం ఉంటుంది’’ అని అశ్విన్‌ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని