Ravichandran Ashwin: ఇంగ్లాండ్‌పై అశ్విన్‌ వికెట్ల ‘సెంచరీ’.. తొలి భారత బౌలర్‌గా రికార్డ్‌

Ravichandran Ashwin: టీమ్‌ఇండియా స్పిన్నర్‌ అశ్విన్‌.. ఇంగ్లాండ్‌పై వికెట్ల ‘సెంచరీ’తో అదరగొట్టాడు. టెస్టుల్లో ఒక దేశంపై వేయి పరుగులు+100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు.

Updated : 23 Feb 2024 12:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు (IND vs ENG Fourth Test)లో స్పిన్‌ చాణక్యుడు రవిచంద్రన్‌ అశ్విన్‌ (Ravichandran Ashwin) అరుదైన రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ జట్టుపై టెస్టుల్లో 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. రాంచీ వేదికగా భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో ఈ ఘనత సాధించాడు.

ఇంగ్లాండ్‌పై తొలి ఇన్నింగ్స్‌ 21వ ఓవర్‌లో అశ్విన్‌ వేసిన రెండో బంతికి బెయిర్‌ స్టో ఔటయ్యాడు. దీంతో ఈ జట్టుపై టెస్టుల్లో 100 వికెట్ల మార్క్‌ (23 మ్యాచ్‌ల్లో)ను అందుకున్నాడు. అంతేకాదు.. భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య టెస్టుల్లో 100 వికెట్లు తీసిన రెండో బౌలర్‌ కూడా ఇతడే. జేమ్స్‌ అండర్సన్‌ టీమ్‌ఇండియాపై టెస్టుల్లో 139 వికెట్లు (35 మ్యాచ్‌ల్లో) తీసి ముందంజలో ఉన్నాడు.

డబుల్ రికార్డ్‌..

అంతేకాదు.. టెస్టుల్లో ఒక దేశంపై వేయి పరుగులు + 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గానూ అశ్విన్‌ మరో రికార్డ్‌ సాధించాడు. క్రికెట్ చరిత్రలో ఈ ఘనత అందుకున్న ఏడో బౌలర్‌గా నిలిచాడు. అతడి కంటే ముందు జార్జ్‌ గిఫెన్‌, మోనీ నోబెల్‌, విల్‌ఫ్రెడ్‌ రోడ్స్‌, గార్‌ఫీల్డ్‌ సోబెర్స్‌, ఇయాన్‌ బోథమ్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌ ఈ ఫీట్‌ సాధించారు.

బీసీసీఐ అల్టిమేటం వేళ.. హార్దిక్‌తో ఇషాన్‌ జిమ్‌ వీడియో వైరల్‌

కుంబ్లే రికార్డ్‌కు రెండు వికెట్ల దూరంలో..

మరోవైపు స్వదేశంలో జరిగిన టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా అశ్విన్‌ కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో అనిల్ కుంబ్లే 350 వికెట్లతో (63 మ్యాచ్‌ల్లో) ముందున్నాడు. ప్రస్తుతం 349 వికెట్లతో (58 టెస్టుల్లో) ఉన్న అశ్విన్‌.. మరో రెండు పడగొడితే కుంబ్లేను దాటేస్తాడు.

ఇక టెస్టుల్లో కుంబ్లే 35 సార్లు ‘ఐదు వికెట్ల’ ఘనత అందుకోగా.. అశ్విన్‌ ఇప్పటి వరకు 34 సార్లు ఆ ఫీట్‌ను సాధించాడు. తాజాగా జరుగుతున్న నాలుగో టెస్టులో చెలరేగితే.. ఈ రికార్డులు కూడా తన ఖాతాలో పడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయిని దాటి కుంబ్లే తర్వాత రెండో భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు