Asian games 2022: ఆసియా క్రీడల్లో భారత్‌ vs పాక్‌ తలపడతాయా?

భారత్ -పాకిస్థాన్‌ (IND vs PAK) మధ్య క్రికెట్ మ్యాచ్ అనగానే సర్వత్రా ఆసక్తి నెలకొంటుంది. దాయాదుల పోరు తిలకించేందుకు క్రికెట్ అభిమానులు ఉత్కంఠతో ఎదురు చూస్తారు. ఇప్పటికే ఆసియా క్రీడల్లో ఫైనల్‌కు చేరిన భారత్‌తో.. చిరకాల ప్రత్యర్థి తలపడే అవకాశం ఉందా..?

Published : 06 Oct 2023 12:19 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత్ -పాకిస్థాన్‌ (IND vs PAK) మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే చాలు.. ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులు ఎదురుచూస్తుంటారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగకపోయినా.. ఆసియాకప్, ప్రపంచకప్ వంటి టోర్నీల్లో అప్పుడప్పుడు భారత్ -పాక్ మధ్య పోరు వీక్షించే అవకాశం అభిమానులకు దక్కుతోంది. అయితే, వన్డే ప్రపంచకప్‌ కంటే ముందుగానే ఆసియా క్రీడల పుణ్యమా అని మరోసారి చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్‌ జరిగే అవకాశముంది. అది కూడా ఏకంగా ఫైనల్‌లో. ఇప్పటికే భారత్ ఫైనల్‌కు చేరుకుంది. ఇక పాకిస్థాన్‌ వంతే మిగిలి ఉంది. 

బంగ్లాపై భారత్‌ ఘన విజయం

ఆసియా క్రీడల్లో తొలిసారి పోటీ పడుతున్న భారత పురుషుల క్రికెట్ జట్టు మెరుగైన ర్యాంకింగ్‌ ఉండటంతో నేరుగా క్వార్టర్‌ ఫైనల్స్‌ నుంచి మ్యాచ్‌లు ఆడుతోంది. ఇప్పటికే క్వార్టర్స్‌లో నేపాల్‌పై విజయం సాధించి సెమీస్‌కు దూసుకెళ్లింది. అక్కడ బంగ్లాదేశ్‌తో తలపడింది. అలవోకగా చిత్తు చేసి ఫైనల్‌కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లా 96/9 స్కోరుకే పరిమితం కాగా.. టీమ్‌ఇండియా కేవలం ఒక్క వికెట్‌ను మాత్రమే నష్టపోయి 9.2 ఓవర్లలో 97 పరుగులు చేసి విజయం సాధించింది. 

ఫైనల్‌కు పాక్‌ రావాలంటే..?

ప్రస్తుతం ఫైనల్‌ బెర్తు కోసం పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌ తలపడుతున్నాయి. క్వార్టర్ ఫైనల్స్‌లో తనకంటే మెరుగైన శ్రీలంక జట్టును అఫ్గానిస్థాన్‌ ఎనిమిది పరుగుల తేడాతో ఓడించి సెమీస్‌కు వచ్చింది. ఒకవేళ సెమీస్‌లోనూ అఫ్గాన్‌ సర్వశక్తులు ఒడ్డి పాకిస్థాన్‌కు షాకిస్తే సంచలనమవుతుంది. అలా జరిగితే భారత్, పాక్ ఫైనల్‌ అవకాశాలు దెబ్బతింటాయి. అందుకే రెండో సెమీస్‌లో అఫ్గాన్‌పై పాకిస్థాన్ విజయం సాధించి ఫైనల్‌కు చేరితే.. వరల్డ్‌ కప్‌ ముందు కంటే మరోసారి దాయాదుల పోరును వీక్షించే అవకాశం క్రికెట్‌ అభిమానులకు లభిస్తుంది. 

భారత్, పాక్‌ మధ్య ఫైనల్‌ ఉంటే? 

ఒకవేళ సమీకరణాలు కలిసొచ్చి దాయాదులు టైటిల్‌ పోరులో తలపడితే టీమ్‌ఇండియాకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మన జట్టులో యశస్వి జైస్వాల్‌, రింకు సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివమ్‌ దూబె వంటి హిట్టర్లు ఉన్నారు. పైగా వీరంతా ఐపీఎల్‌లో దంచికొట్టారు. క్వార్టర్‌ ఫైనల్లో యశస్వి సెంచరీ బాదిన విషయం తెలిసిందే. కానీ, పాక్‌తో పోలిస్తే భారత్ బౌలింగ్ విభాగం కాస్త బలహీనంగా కనిపిస్తోంది. హంకాంగ్‌తో జరిగిన క్వార్టర్స్‌లో పాక్‌ 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించడంలో ఆ జట్టు బౌలర్ల పాత్ర కీలకం. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌట్ అయింది. లక్ష్యఛేదనలో పాక్‌ బౌలర్ల ధాటికి హాంకాంగ్‌ 92పరుగులకే కుప్పకూలింది.

నేపాల్‌తో మ్యాచ్‌లో భారత బౌలర్లు తొమ్మిది వికెట్లు పడగొట్టినా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. పేసర్లు అర్ష్‌దీప్ (4/43), అవేశ్‌ ఖాన్‌ (3/32) పరుగులు ఇవ్వగా.. స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ మాత్రం (3/24) పొదుపుగా బౌలింగ్ చేశాడు. బౌలింగ్ మెరుగుపడితే పాక్‌ను ఓడించడం భారత్‌కు పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. ఫైనల్‌లో గెలిచే జట్టుకు స్వర్ణం, ఓడిన జట్టుకు రజత పతకాలు దక్కుతాయి. సెమీ ఫైనల్స్‌లో ఓడిన జట్లు కాంస్య పతకం కోసం మరో మ్యచ్‌లో తలపడతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని