AB de Villiers - Head Coach: నేను కోచింగ్‌ను ఆస్వాదిస్తా.. కానీ ఇప్పుడే కాదు: ప్రధాన కోచ్‌ పదవిపై ఏబీడీ

భారత జట్టు కోచింగ్‌ పదవి కోసం దేశ, విదేశీ మాజీ క్రికెటర్లు ఆసక్తిగా ఉంటారు. అయితే, బీసీసీఐ నిర్దేశించిన నిబంధనల మేరకే ఈ ప్రక్రియ కొనసాగుతుంది.

Published : 25 May 2024 12:51 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్ స్థానంలో కొత్తగా వచ్చేదెవరా? అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఆసీస్‌ మాజీ క్రికెటర్లను సంప్రదించలేదని ఇప్పటికే బీసీసీఐ కార్యదర్శి జైషా తెలిపిన సంగతి తెలిసిందే. స్టీఫెన్ ఫ్లెమింగ్‌, గౌతమ్‌ గంభీర్‌ ఆసక్తి చూపితే.. వీరిద్దరిలో ఒకరు రావడం ఖాయమనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో రాహుల్‌ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం వస్తే ఎలా ఉంటుందనే ప్రశ్నకు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్‌ సమాధానం ఇచ్చాడు. 

‘‘ఇప్పటి వరకు దాని గురించి ఏం ఆలోచించలేదు. నేను కోచింగ్‌ను ఆస్వాదిస్తానని అనుకుంటున్నా. చాలా అంశాలు ప్రభావితం చేస్తాయి. నేను ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. కాలక్రమేణా ఏదైనా సాధ్యమే. సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలను. అలాగే ముందుకు సాగుతున్న కొద్దీ నేర్చుకోవాలనే తపన నాకు ఉంది. కొన్ని జట్లతో, కొందరి ఆటగాళ్లతో పనిచేసేందుకు ఎప్పుడూ ఇష్టపడతా. ఈ పదవిని తీసుకోవడానికి ఇదే సరైన సమయం అవునా? కాదా? అనేది ఇప్పుడే చెప్పలేను. ఏమైనా మార్పులు జరగొచ్చు’’ అని తెలిపాడు. మే 27లోపు ప్రధాన కోచ్‌ పదవికి దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. జూన్‌ చివరితో రాహుల్‌ ద్రవిడ్‌ కోచ్‌ పదవీకాలం ముగియనుంది.

భారత్‌లో పేసర్ల గురించి..: గావస్కర్

భారత్‌లో 145 కి.మీ వేగంతో బంతులేసి పేసర్లను చూసి అద్భుతమని కొనియాడతారని.. నిలకడగా వేసినా పెద్దగా పట్టించుకోరని క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ వ్యాఖ్యానించాడు. దానికి ఉమ్రాన్‌ మాలిక్, సందీప్ శర్మను ఉదాహరించారు. ‘‘ఎవరైనా ఎక్కువ వేగంతో బౌలింగ్‌ చేస్తే వారిని పొగడటం చేస్తాం. ఉమ్రాన్‌ మాలిక్‌, మయాంక్‌ యాదవ్‌ 150 కి.మీ వేగంతో బంతులేస్తారు. అయితే, సందీప్ శర్మలా తెలివిగా బంతులేసేవారిని మాత్రం పట్టించుకోను. ఎలాంటి బౌలర్‌కైనా అలాంటి నైపుణ్యం ఉండాలి. నిలకడగా బౌలింగ్‌ చేసే వారిని ప్రోత్సహించాలి. టీ20 లేదా ఇతర ఫార్మాట్‌ అయినా సరే బ్యాటర్లను ఇబ్బంది పెట్టేలా బౌలింగ్‌ వేస్తే ఫలితం అనుకున్నట్లుగా వస్తుంది’’ అని తెలిపాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని