BCCI: అలాంటి ప్రకటనలపై తస్మాత్‌ జాగ్రత్త.. NCA అందరికీ కాదు: బీసీసీఐ హెచ్చరిక

దేశవాళీ క్రికెటర్లు, అభిమానులు ఎవరూ మోసపూరిత ప్రకటనల ఉచ్చులో పడొద్దని బీసీసీఐ హెచ్చరించింది. ఈ మేరకు కీలక ప్రకటన జారీ చేసింది.

Published : 16 Feb 2024 18:49 IST

ఇంటర్నెట్ డెస్క్: జాతీయ క్రికెట్‌ అకాడమీలో (NCA) అడ్మిషన్లు ఇప్పిస్తామని చేసే ప్రకటనలన్నీ మోసపూరితమైనవేనని బీసీసీఐ స్పష్టం చేసింది. అక్రమార్జన కోసం కొందరు ఇలాంటి తప్పుడు మార్గాలకు వెళ్తున్నారని పేర్కొంది. బెంగళూరులోని ఎన్‌సీఏలోకి ప్రవేశం మెరిట్ ఆధారంగానే జరుగుతుందని వెల్లడించింది. ఈ మేరకు కీలక ప్రకటన జారీ చేసింది. 

‘‘ఎన్‌సీఏలోకి ప్రవేశం ఇప్పిస్తామని మోసపూరిత ప్రకటనలు ఇస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. అక్కడి సదుపాయాలను వినియోగించుకునేందుకు క్రికెటర్ల నుంచి మేం ఎలాంటి సొమ్ము వసూలు చేయం. అందుకు సంబంధించిన ప్రోటోకాల్స్‌ను ఇప్పటికే అమలుచేస్తున్నాం. ఎన్‌సీఏలో అందరికీ ప్రవేశం ఉండదు. బీసీసీఐ కాంట్రాక్ట్‌ ఆటగాళ్లు, రాష్ట్ర క్రికెట్‌ సంఘాల నుంచి వచ్చే విజ్ఞప్తుల మేరకు  క్రికెటర్లకు ఎన్‌సీఏలో అవకాశం కల్పిస్తాం. అంతేకానీ, ఇతర ఏజెన్సీల ద్వారా ఏమాత్రం అవకాశం ఉండదు. క్రికెటర్లు, కోచ్‌లు, అభిమానులు ఎవరైనా ఇలాంటి మోసపూరిత ప్రకటనలను నమ్మొద్దు. ఎలాంటి సూచనలు కావాలన్నా రాష్ట్ర క్రికెట్‌ సంఘాలను సంప్రదించాలి’’ అని బీసీసీఐ తెలిపింది. 

బీసీసీఐ చెప్పినా.. రంజీల్లో ఆడని ఇషాన్‌

జాతీయ జట్టుకు ఎంపిక కాని.. ఫిట్‌గా ఉన్న ప్రతీ క్రికెటర్‌ దేశవాళీలో ఆడాల్సిందేనని ఇటీవల బీసీసీఐ తేల్చి చెప్పింది. అయితే, ఇషాన్‌ కిషన్‌ మాత్రం రంజీల్లో ఆడకుండా ఉండిపోయాడు. దీంతో అతడిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే, అతడు ఆడకపోవడానికి కారణాలు ఉన్నాయని కొన్ని వార్తలు వస్తున్నాయి. ‘‘సాంకేతికపరమైన అంశాలపై ఇషాన్‌ దృష్టిపెట్టాడు. ప్రస్తుతం అతడు రెడ్‌ బాల్‌ క్రికెట్‌ ఆడేందుకు సిద్ధంగా లేడు. డీవై పాటిల్‌ టీ20 టోర్నీలో ఆడి ఫామ్‌ అందుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది’’ అని బీసీసీఐ అధికారులు వెల్లడించినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని