ODI WC 2023: ఉప్పల్‌ మ్యాచ్‌ను రీ షెడ్యూల్‌ చేస్తారా.? స్పందించిన బీసీసీఐ!

వన్డే వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ (ODI World Cup 2023) రీషెడ్యూల్‌పై హైదరాబాద్‌ క్రికెట్ సంఘం (HCA), హైదరాబాద్‌ పోలీస్ విభాగం చేసిన విజ్ఞప్తిపై బీసీసీఐ స్పందించింది. అయితే, నిర్ణయం మాత్రం సానుకూలంగా రావడం కష్టమేనన్నట్లుగా తెలుస్తోంది.

Updated : 21 Aug 2023 10:33 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వరుసగా రెండు రోజుల్లో మ్యాచ్‌లను నిర్వహిస్తే సెక్యూరిటీపరంగా ఇబ్బందులు వస్తాయని హైదరాబాద్‌ పోలీసుల ఆందోళనను బీసీసీఐ దృష్టికి హెచ్‌సీఏ తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) న్యూజిలాండ్ - నెదర్లాండ్స్ మ్యాచ్‌ అక్టోబర్ 9న జరగనుండగా.. పాకిస్థాన్ - శ్రీలంక మ్యాచ్‌ ఆ మరుసటి రోజునే (అక్టోబర్ 10న) ఉంది. దీంతో భద్రత కల్పించడం కష్టంగా మారుతుందని హైదరాబాద్‌ పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. మ్యాచ్‌ను రీషెడ్యూల్‌ చేయాలని హైదరాబాద్ క్రికెట్‌ సంఘం (HCA) కూడా బీసీసీఐకి విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలో బీసీసీఐ (BCCI) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మాత్రం షెడ్యూలింగ్‌లో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేశారు. గత జూన్‌లో తొలి షెడ్యూల్‌ను ప్రకటించిన ఐసీసీ, బీసీసీఐ.. ఆ తర్వాత వివిధ దేశాలు, రాష్ట్ర క్రికెట్ సంఘాల విజ్ఞప్తుల మేరకు తొమ్మిది మ్యాచ్‌లను రీషెడ్యూల్‌ చేస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మరోసారి హెచ్‌సీఏ విజ్ఞప్తి చేసినా రీషెడ్యూల్‌కు అవకాశం ఉండటం కష్టమేనని రాజీవ్ శుక్లా వ్యాఖ్యలను బట్టి తేలిపోయింది.

రుతురాజ్‌ క్లాస్.. రింకు సింగ్‌ ఊరమాస్‌.. వీడియోలు అదుర్స్‌

‘‘వరల్డ్‌ కప్‌ (ODI World Cup 2023) మ్యాచ్‌లు జరగనున్న హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియం (Uppal Stadium) ఇన్‌ఛార్జ్‌గా ఉన్నా. ఏదైనా సమస్య ఉంటే తప్పకుండా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తా. అయితే, వరల్డ్ కప్‌ మ్యాచ్‌ షెడ్యూల్‌ను మార్చడం అంత తేలిక కాదు. కేవలం బీసీసీఐ మాత్రమే షెడ్యూల్‌ను మార్చలేదు. మిగతా జట్లు, ఐసీసీ. క్రికెట్‌ సంఘాలు కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది’’ అని రాజీవ్ శుక్లా తెలిపారు. పాకిస్థాన్‌ మ్యాచ్‌ కావడంతో భద్రత మరింత కట్టుదిట్టంగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే హైదరాబాద్‌ పోలీస్‌, క్రికెట్‌ సంఘం ఆందోళన వ్యక్తం చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. 

షెడ్యూల్‌ ప్రకారం హైదరాబాద్‌ వేదికగానే పాకిస్థాన్‌ రెండు మ్యాచ్‌లు ఆడనుంది. అక్టోబర్ 6న నెదర్లాండ్స్‌తో, అక్టోబర్ 10న శ్రీలంకతో తలపడనుంది. అలాగే రెండు వార్మప్‌ మ్యాచ్‌లను కూడా ఉప్పల్‌లోనే పాక్‌ ఆడనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని