Gujarat vs Bengaluru: జాక్స్‌, కోహ్లీ విధ్వంసం.. బెంగళూరు ఘన విజయం

బెంగళూరు మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో గెలుపొందింది.

Updated : 28 Apr 2024 19:46 IST

అహ్మదాబాద్‌: బెంగళూరు మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. 201 పరుగుల లక్ష్యాన్ని మరో 4 ఓవర్లు మిగిలుండగానే ఛేదించింది. జాక్స్‌ (100*; 41 బంతుల్లో 5×4, 10×6), కోహ్లీ (70*, 44 బంతుల్లో 6×4, 3×6) చెలరేగారు. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించారు. బంతి పడితే చాలు.. బౌండరీ అన్నట్లుగా ఆడారు. వీరి బాదుడుకు 201 పరుగుల భారీ లక్ష్యం కూడా చిన్నబోయింది. డుప్లెసిస్‌ (24; 12 బంతుల్లో 1×4, 3×6) మెరిపించాడు. గుజరాత్‌ బౌలర్లలో రవి శ్రీనివాసన్‌ ఒక వికెట్‌ రాబట్టుకున్నాడు.

31 బంతుల్లో హాఫ్‌ సెంచరీ.. 10 బంతుల్లో మరో 50

31 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసిన విల్‌ జాక్స్‌.. మరో 10 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. ఇది చాలు అతడి విధ్వంసం ఎలా సాగిందో చెప్పడానికి. వీల్ జాక్స్‌ ఆరంభంలో నెమ్మదిగానే ఆడాడు. మోహిత్ శర్మ వేసిన 11 ఓవర్‌ నుంచి దూకుడు మొదలెట్టాడు. ఆ ఓవర్లో ఓ సిక్స్, ఫోర్ రాబట్టిన అతడు.. సాయి కిశోర్, నూర్ అహ్మద్‌ బౌలింగ్‌లో ఒక్కో సిక్స్ కొట్టాడు. మోహిత్ శర్మ వేసిన 15 ఓవర్‌లో జాక్స్‌ మొదటి రెండు బంతులకు ఫోర్, సిక్స్ బాది హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తర్వాత ఇదే ఓవర్‌లో రెండు సిక్స్‌లు, ఓ ఫోర్ బాదేశాడు. ఇక రషీద్‌ ఖాన్‌ వేసిన 16 ఓవర్‌లో విల్ జాక్స్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వరుసగా 6, 6, 4, 6, 6 దంచేసి సెంచరీ పూర్తి చేసుకోవడంతోపాటు బెంగళూరుకు భారీ విజయాన్ని అందించాడు.

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఓపెనర్లు వృద్ధిమాన్‌ సాహా (5), శుభ్‌మన్‌ గిల్‌ (16) నిరాశపరిచినప్పటికీ.. ఫస్ట్‌ డౌన్‌లో వచ్చిన సాయి సుదర్శన్‌ (84*; 49 బంతుల్లో 8×4, 4×6) చెలరేగిపోయాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో బెంగళూరు బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. అగ్నికి వాయువు తోడైనట్లు రెండో డౌన్‌లో వచ్చిన షారూఖ్‌ ఖాన్‌ (58; 30 బంతుల్లో 3×4, 5×6) మరింత విజృంభించాడు. 

ఇద్దరూ కలిసి బెంగళూరును ఎడాపెడా బాదేశారు. భయంకరంగా మారిన ఈ జోడీని సిరాజ్‌ విడగొట్టాడు. 14.1వ బంతికి షారూఖ్‌ బౌల్డయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన డేవిడ్‌ మిల్లర్‌ (26*, 19 బంతుల్లో 2×4, 1×6) కూడా ఏమాత్రం తగ్గలేదు. దీంతో గుజరాత్‌ భారీ స్కోరే చేసింది. బెంగళూరు బౌలర్లలో స్వప్నిల్‌ సింగ్‌, సిరాజ్‌, మాక్స్‌వెల్‌ తలో వికెట్‌ తీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని