Bhuvneshwar Kumar: 4 వికెట్ల దూరంలో భువనేశ్వర్‌.. చరిత్ర సృష్టిస్తాడా?

Bhuvneshwar Kumar: సీనియర్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. మరో నాలుగు వికెట్లు సాధిస్తే ఐపీఎల్‌లో అతడు చరిత్ర సృష్టించినట్లే..!

Published : 23 Mar 2024 18:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐపీఎల్‌ 17వ సీజన్‌ సందడి మొదలైంది. కొత్త కెప్టెన్‌ కమిన్స్‌ నేతృత్వంలోని హైదరాబాద్‌ జట్టు నేడు కోల్‌కతాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ (Bhuvneshwar Kumar) అరుదైన రికార్డు నెలకొల్పే అవకాశముంది. మరో నాలుగు వికెట్లు తీస్తే ఈ లీగ్‌లో ఒక ఫ్రాంచైజీ తరఫున 150 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించనున్నాడు.

ఇప్పటివరకు ఈ లీగ్‌ చరిత్రలో కేవలం లసిత్‌ మలింగ (ముంబయి), సునిల్‌ నరైన్‌ (కోల్‌కతా) మాత్రమే ఒకే ఫ్రాంచైజీ తరఫున 150కి పైగా వికెట్లు తీసి అరుదైన ఘనత సాధించారు. 2014 నుంచి హైదరాబాద్‌కు ఆడుతున్న భువి.. ఇప్పటివరకు 129 మ్యాచ్‌లలో 146 వికెట్లు పడగొట్టాడు. మరో నాలుగు వికెట్లు తీస్తే.. ఒకే ఫ్రాంచైజీ తరఫున 150 వికెట్లు తీసిన మూడో ఆటగాడిగా నిలుస్తాడు. ఈ ఫీట్‌ అందుకున్న తొలి భారత బౌలర్‌గానూ అరుదైన ఘనత సాధిస్తాడు.

కెప్టెన్‌ మారాడు.. హైదరాబాద్‌ కథ మారేనా?

ఇప్పటివరకు కేవలం ముంబయికి మాత్రమే ప్రాతినిధ్యం వహించిన మలింగ ఈ లీగ్‌లో 122 మ్యాచ్‌ల్లో 170 వికెట్లు పడగొట్టాడు. ఇక, కోల్‌కతా తరఫున నరైన్‌ 161 మ్యాచ్‌ల్లో 162 వికెట్లు తీశాడు. భారత పేసర్‌ బుమ్రా కూడా ఈ రికార్డుకు చేరువలోనే ఉన్నాడు. ముంబయి తరఫున అతడు ఇప్పటివరకు 145 వికెట్లు తీశాడు.

ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా హైదరాబాద్‌, కోల్‌కతా మధ్య నేడు మ్యాచ్‌ జరగనుంది. మరి భువి ఈ మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టిస్తాడా?లేదా? అనేది చూడాలి..!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని