Team India: ఇంగ్లండ్‌ టూర్‌కు ఆ స్టార్‌ పేసర్‌ దూరం..?

Eenadu icon
By Sports News Team Published : 23 May 2025 12:21 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంగ్లండ్‌తో జరిగే ఐదు టెస్టుల (ENG vs IND) సిరీస్‌కు టీమ్‌ఇండియా జట్టును శనివారం ప్రకటించనున్నారు. రోహిత్‌ శర్మ టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించిన నేపథ్యంలో.. ఎవరికి సారథ్య బాధ్యతలు అప్పగిస్తారన్న విషయం ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఈ సిరీస్‌కు స్టార్‌ పేసర్‌ మహమ్మద్‌ షమీ (Mohammed Shami) దూరమయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తుండటం టీమ్‌ఇండియా (Team India) అభిమానులను కలవరానికి గురిచేస్తోంది.

షమీ టెస్టుల్లో సుదీర్ఘ స్పెల్స్‌ వేయలేడని బీసీసీఐ (BCCI) వైద్యబృందం యాజమాన్యానికి చెప్పినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అతడిని జట్టులోకి తీసుకుంటే.. ఐదు టెస్టులూ ఆడే అవకాశాలు చాలా తక్కువని ఆ కథనాల్లో పేర్కొన్నారు. ఇంగ్లండ్‌ సిరీస్‌కు మరో 20 రోజులే సమయం ఉన్న నేపథ్యంలో ఈ వార్త టీమ్‌ఇండియాను ఇబ్బందికి గురిచేసేదే. మరోవైపు టెస్టు కెప్టెన్సీ రేసులో ఉన్న బుమ్రా కూడా.. వర్క్‌లోడ్‌ మేనేజ్‌మెంట్‌ వల్ల అన్ని టెస్టులు ఆడే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో టీమ్‌ఇండియా జట్టును ఎంపిక చేయనున్న సెలక్షన్‌ కమిటీ ఈ విషయంలో సందిగ్ధంలో పడినట్లు సమాచారం. భారత జట్టు ప్రణాళికలపై కూడా ఇది ప్రభావం చూపించే అవకాశం ఉంది.

‘‘షమీ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ తరఫున నాలుగు ఓవర్లు వేశాడు. అయితే.. అతడు ఒక రోజులో పది ఓవర్ల కంటే ఎక్కువ ఓవర్లు వేస్తాడా.. అన్న విషయం బోర్డుకు, సెలెక్టర్లకు తెలియదు. ఇంగ్లండ్‌లో టెస్టుల్లో పేసర్లు ఎక్కువ స్పెల్స్‌ వేసే అవసరం ఉండొచ్చు. మేం ఎలాంటి ఛాన్స్‌లు తీసుకోలేం’’ అని ఓ బీసీసీఐ అధికారి ఆంగ్ల మీడియాకు తెలిపినట్లు సమాచారం.

ఒకవేళ షమీని పక్కనపెడితే అతడి స్థానంలో అర్ష్‌దీప్‌ సింగ్‌కు లేదా హరియాణా పేసర్‌ అన్షుల్‌ కాంబోజ్‌కు అవకాశం లభించవచ్చు. ఇక షమీ 2023 WTC Finalలో ఓవల్‌లో ఆస్ట్రేలియాపై చివరిసారిగా టెస్టు ఆడాడు.

ఇక టెస్టు కెప్టెన్సీ రేసులో శుభ్‌మన్‌ గిల్, జస్‌ప్రీత్‌ బుమ్రా పోటీలో ఉన్నారు. సాయి సుదర్శన్, అర్ష్‌దీప్‌ సింగ్‌లకు తొలిసారి టెస్టు జట్టులో చోటు దక్కడం ఖాయం. కోహ్లి, రోహిత్‌ల రిటైర్మెంట్‌ తర్వాత తొలిసారి భారత జట్టు ఎంపిక జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు