IND vs ENG: భారత్‌తో నాలుగో టెస్టు.. ఫాస్టెస్ట్ పేసర్‌ను పక్కన పెట్టిన ఇంగ్లాండ్‌

రాంచీ వేదికగా (IND vs ENG) జరగనున్న నాలుగో టెస్టు కోసం ఇంగ్లాండ్‌ తన తుది జట్టును ప్రకటించింది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ఆడని పేసర్ మళ్లీ జట్టులోకి వచ్చాడు.

Published : 22 Feb 2024 15:30 IST

ఇంటర్నెట్ డెస్క్‌: రాంచీ వేదికగా శుక్రవారం నుంచి భారత్ - ఇంగ్లాండ్ (IND vs ENG) జట్ల మధ్య నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ టెస్టులో గెలిచి సిరీస్‌ సమం చేయాలనే లక్ష్యంతో ఇంగ్లాండ్‌ జట్టు బరిలోకి దిగనుంది. రాంచీ టెస్టుకు తుది జట్టును ప్రకటించింది. రెండు మార్పులతో ఆడనుంది. ఫాస్టెస్ట్‌ పేసర్‌ మార్క్‌వుడ్‌ను పక్కన పెట్టిన ఇంగ్లాండ్‌ బోర్డు ఓలీ రాబిన్‌సన్‌ను జట్టులోకి తీసుకుంది. నిలకడగా 145 నుంచి 150 కి.మీ. వేగంతో బంతులు విసిరే మార్క్‌వుడ్‌ భారత బ్యాటర్లను మాత్రం పెద్దగా ఇబ్బంది పెట్టలేకపోయాడు. 

సీనియర్‌ జేమ్స్‌ అండర్సన్‌కు మరోసారి అవకాశం దక్కింది. మూడో టెస్టులో బెంచ్‌కే పరిమితమైన షోయబ్‌ బషీర్‌ తుది జట్టులోకి వచ్చాడు. స్పిన్‌ పిచ్‌లపై రాణించలేకపోయిన   రెహాన్‌ అహ్మద్‌ను పక్కన పెట్టారు. రాంచీ పిచ్‌ స్పిన్‌కు అనుకూలంగా ఉంటుందనే విశ్లేషణల నేపథ్యంలో.. ఇంగ్లాండ్‌ మాత్రం ఇద్దరు స్పెషలిస్ట్‌ స్పిన్నర్లతోనే బరిలోకి దిగడం గమనార్హం. జో రూట్‌ పార్ట్‌ స్పిన్నర్‌గా రాణిస్తుండటంతో ఈమేరకు నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. ఈ సిరీస్‌లో విఫలమవుతూ వస్తున్న జానీ బెయిర్‌స్టోపై ఇంగ్లాండ్‌ మేనేజ్‌మెంట్ నమ్మకం ఉంచింది. అందుకే బ్యాటర్ల విషయంలో మార్పులేమీ చేయలేదు. 

తుది జట్టు ఇదే:

జాక్‌ క్రాలే, బెన్‌ డకెట్‌, ఓలీ పోప్, జో రూట్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జానీ బెయిర్‌ స్టో, బెన్‌ ఫోక్స్ (వికెట్ కీపర్), టామ్‌ హార్ట్‌లీ, ఓలీ రాబిన్‌సన్, షోయబ్‌ బషీర్‌, జేమ్స్‌ అండర్సన్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని