Jasprit Bumrah: పాక్‌పై బుమ్రా అదుర్స్‌.. హార్దిక్‌ పాండ్య రికార్డు బద్దలు

టీమ్‌ఇండియా పేస్ స్టార్ జస్‌ప్రీత్ బుమ్రా అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. పాక్‌ను చిత్తు చేయడంలో కీలక పాత్ర పోషించాడు.

Updated : 10 Jun 2024 11:59 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌ను ఓడించడంలో భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా కీలక పాత్ర పోషించాడు. మూడు వికెట్లు తీసి పాక్‌ను దెబ్బ కొట్టాడు. పొదునైన బౌలింగ్‌తో అదరగొట్టాడు. కేవలం 120 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన పాక్‌ 113/7 స్కోరుకే పరిమితమైంది. ఈ క్రమంలో బుమ్రా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గా నిలిచాడు. బుమ్రా 64 మ్యాచుల్లో 79 వికెట్లు తీయగా.. హార్దిక్‌ 78 వికెట్లతో కొనసాగుతున్నాడు. వీరిద్దరూ ఈ మ్యాచ్‌కు ముందు చెరో 76 వికెట్లు తీసి సమంగా ఉన్నారు. పాక్‌పై బుమ్రా 3, హార్దిక్‌ 2 వికెట్లు పడగొట్టిన సంగతి తెలిసిందే. ఇక భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌ మాత్రం యుజ్వేంద్ర చాహల్‌. మొత్తం 80 మ్యాచుల్లో 96 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. 

పాకిస్థాన్‌పై అద్భుతమైన ప్రదర్శన అనంతరం బుమ్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘తక్కువ స్కోరును కాపాడుకోవడం చాలా ఆనందంగా ఉంది. వర్షం పడటంతో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం కాలేదు. ఎండ రావడంతో పిచ్‌ నుంచి మరింత సహకారం లభించింది. క్రమశిక్షణతో బౌలింగ్‌ చేశాం. పేస్‌తోపాటు వైవిధ్యంగా బంతులేస్తే ఫలితం అనుకూలంగా ఉంటుంది. భారత్‌కు మద్దతు ఇచ్చేందుకు వచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. అదే మాకు స్ఫూర్తినిచ్చింది. ఇప్పటికే రెండు మ్యాచుల్లో విజయం సాధించాం. రాబోయే మ్యాచుల్లోనూ గెలిచి తదుపరి దశకు చేరుకుంటాం. మా ప్రణాళికలను పక్కగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాం. ఎప్పుడైనా సరే బ్యాట్ vs బంతి పోటీ చూడటానికి చాలా బాగుంటుంది. ఎప్పుడైతే బ్యాటింగ్‌దే పైచేయి అవుతుందో.. ఇక నేను టీవీ కట్టేసివాడిని. చిన్నప్పటి నుంచి బౌలింగ్‌ జట్టుకే అభిమానిని’’ అని బుమ్రా తెలిపాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని