India vs Pakistan: భారత్‌ - పాక్‌ ద్వైపాక్షిక సిరీస్‌ల నిర్వహణకు ఆసీస్‌ ఆసక్తి!

భారత్‌, పాక్‌ల మధ్య 2012-13 నుంచి ఇప్పటివరకూ ఎటువంటి ద్వైపాక్షిక సిరీస్‌లు జరగలేదు. ఈ తరుణంలో క్రికెట్‌ ఆస్ట్రేలియా మరోసారి తన ఆసక్తిని బయటపెట్టింది.

Published : 27 Mar 2024 18:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌ - పాక్‌ల (India vs Pakistan) మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ను తమ దేశంలో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని క్రికెట్‌ ఆస్ట్రేలియా (Cricket Australia - CA) మరోసారి వెల్లడించింది. ఐసీసీ వరల్డ్‌ కప్‌, ఛాంపియన్స్‌ ట్రోఫీలు మినహా దాయాది దేశాల మధ్య 2012-13 నుంచి ఇప్పటివరకూ ఎటువంటి మ్యాచ్‌లు (bilateral series) జరగలేదు. ఈ తరుణంలో భవిష్యత్తులో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడేందుకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI), పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB)లు అంగీకరిస్తే వాటి నిర్వహణకు తాము సిద్ధమని ఆసీస్‌ తన ఆసక్తిని బయటపెట్టింది.

ఆతిథ్య ఆస్ట్రేలియా, టీమ్‌ఇండియాల మధ్య అయిదు టెస్టుల బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌ నవంబరు 22న పెర్త్‌లో ఆరంభం కానుంది. అంతకంటే ముందు పాక్‌తో ఆసీస్‌ మూడు వన్డేలు, టీ20లు ఆడనుంది. ఇరుదేశాలు ఒకే నెలలో తమ దేశంలో పర్యటించనున్న నేపథ్యంలో.. క్రికెట్‌ ఆస్ట్రేలియా ఆపరేషన్స్‌ మేనేజర్ పీటర్ రోచ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘క్రికెట్‌ అభిమానులకు వినోదాన్ని పంచే మ్యాచ్‌లు, కంటెంట్ కోసం మేం ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటాం. ప్రపంచంలోని ప్రతీ దేశమూ.. భారత్‌, పాక్‌లు తమ దేశంలో పోటీపడాలని కోరుకుంటాయి’’ అని చెప్పారు.

భారత్‌, పాక్‌ జట్లకు ఆతిథ్యం ఇవ్వడం తమకు సంతోషంగా ఉందని చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ నిక్ హాక్లీ తెలిపారు. ‘‘ఈ ఇరు జట్ల పోటీని ప్రజలు చూడాలనుకుంటున్నారు. అవకాశం వస్తే ఆతిథ్యమివ్వడానికి మేం సిద్ధం. అవసరమైతే మా పాత్రనూ పోషిస్తాం’’ అని ఆయన పేర్కొన్నాడు. 2022 టీ20 వరల్డ్‌ కప్‌ సందర్భంగా మెల్‌బోర్న్‌ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన భారత్, పాక్‌ మ్యాచ్‌కు భారీగా అభిమానులు (90,293) తరలివచ్చారు. ఈ మ్యాచ్‌ విజయవంతమైన తర్వాత సీఏ, మెల్‌బోర్న్‌ క్రికెట్‌ క్లబ్‌, విక్టోరియా ప్రభుత్వం కలిసి దైపాక్షిక మ్యాచ్‌లను నిర్వహించడానికి ఆసక్తిగా ఉన్నామని గతంలో తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు