WTC Final: వివాదాస్పద క్యాచ్‌.. స్పందించిన కామెరూన్ గ్రీన్‌

తాను పట్టిన క్యాచ్‌ వివాదాస్పదం కావడంతో ఆసీస్ ఆటగాడు కామెరూన్ గ్రీన్‌ స్పందించాడు. సోషల్‌ మీడియాలో థర్డ్‌ అంపైర్‌ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.

Updated : 11 Jun 2023 12:50 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో (WTC Final) ఆస్ట్రేలియా ఆటగాడు కామెరూన్ గ్రీన్‌ పట్టిన క్యాచ్‌ సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపింది. దీనిపై కామెరూన్ గ్రీన్‌ స్పందించాడు.  ‘‘ఆ సమయంలో నేను సరిగానే క్యాచ్‌ను పట్టినట్లు భావించా. క్లియర్‌ క్యాచ్‌ను అందుకుని పైకి విసిరాను. ఇందులో నాకెలాంటి అనుమానం కలగలేదు. అయితే, నిర్ణయం థర్డ్‌ అంపైర్‌కు వెళ్లింది. మూడో అంపైర్‌ కెటిల్‌బోరో సరైన క్యాచ్‌గా అంగీకరిస్తూ నిర్ణయం వెల్లడించాడు. స్లిప్స్‌లో క్యాచ్‌లను పట్టేందుకు చాలా శ్రమించా. దాని కోసం నిరంతరం మెరుగుపర్చుకుంటూ ముందుకు సాగా’’ అని గ్రీన్‌ తెలిపాడు. 

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లోని 8వ ఓవర్‌ను బోలాండ్‌ వేశాడు. ఆ ఓవర్‌ మొదటి బంతిని ఆడబోయిన టీమ్‌ఇండియా బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్ (18) ఇచ్చిన క్యాచ్‌ను గల్లీలో ఉన్న గ్రీన్‌ అందుకున్నాడు. అయితే, క్యాచ్‌ పట్టిన తీరు అనుమానాస్పదంగా ఉండటంతో నిర్ణయం మూడో అంపైర్‌కు చేరింది. కానీ, థర్డ్‌ అంపైర్‌ కూడా ఔట్‌గా ప్రకటించడంతో గిల్ నిరాశగా పెవిలియన్‌కు చేరాడు. భారత  అభిమానులు మాత్రం థర్డ్‌ అంపైర్‌ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కామెరూన్ గ్రీన్‌ ఉద్దేశించి ‘మోసం మోసం మోసం’ అంటూ స్టేడియంలోనే అరిచారు.

ప్రస్తుతం భారత్‌ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి (లండన్‌ కాలమానం ప్రకారం) రెండో ఇన్నింగ్స్‌లో 164/3తో కొనసాగుతోంది. క్రీజ్‌లో అజింక్య రహానె (20*), విరాట్ కోహ్లీ (44*) ఉన్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 71 పరుగులు జోడించారు. టీమ్‌ఇండియా విజయానికి చివరి రోజు 280 పరుగులు అవసరం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని