Chess World Cup: చదరంగ సమరం

Eenadu icon
By Sports News Desk Published : 01 Nov 2025 02:24 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

నేటి నుంచి ప్రపంచకప్‌ 

ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమంలో గోవా సీఎం ప్రమోద్‌ సావంత్, ఫిడే అధ్యక్షుడు డ్వార్కోవిచ్,
కేంద్ర క్రీడల మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తదితరులు

పంజిమ్‌ (గోవా): ఫిడే చెస్‌ ప్రపంచకప్‌నకు వేళైంది. 80 దేశాల నుంచి 206 మంది టాప్‌ ప్లేయర్లు తలపడబోతున్న ఈ మెగా టోర్నీ ఆరంభమయ్యేది శనివారమే. సొంతగడ్డపై జరుగుతున్న ఈ పోరులో ప్రపంచ ఛాంపియన్‌ దొమ్మరాజు గుకేశ్, యువ కెరటాలు అర్జున్‌ ఇరిగేశి, ప్రజ్ఞానందపైనే అందరి దృష్టి ఉంది. నాకౌట్‌ ఫార్మాట్లో జరిగే ఈ సమరంలో పోటీలను క్లాసికల్‌ పద్ధతిలో నిర్వహిస్తారు. ప్రతి రౌండ్‌కు రెండు గేమ్‌లు ఉంటాయి. ఈ కప్‌లో తొలి మూడు స్థానాల్లో నిలిచే ప్లేయర్లు 2026 క్యాండిడేట్‌ టోర్నీకి అర్హత సాధిస్తారు. ప్రపంచ ఛాంపియన్‌ కావడంతో గుకేశ్‌కు ఈ అర్హతతో పని లేదు. అతడు టైటిల్‌ సాధించడంపై దృష్టి సారించాడు. గత కొన్ని నెలలుగా ఫామ్‌లో లేని ఈ యువ ఆటగాడు.. ఈ కప్‌ ద్వారానైనా సత్తా చాటాలని కోరుకుంటున్నాడు. 

ప్రజ్ఞానంద, అర్జున్‌తో పాటు సీనియర్‌ ప్లేయర్లు పెంటేల హరికృష్ణ, విదిత్‌ గుజరాతి క్యాండిడేట్‌ టోర్నీ అర్హత కోసం పోటీపడనున్నారు. మహిళల ప్రపంచకప్‌ విజేత దివ్య దేశ్‌ముఖ్‌ కూడా ఈ టోర్నీ బరిలో ఉంది.మొత్తంగా భారత్‌ నుంచి 24 మంది క్రీడాకారులు బరిలో ఉండడం విశేషం. వీరిలో తెలంగాణ యువ ఆటగాడు రాజా రిత్విక్‌ కూడా పోటీలో ఉన్నాడు. ఈ ఏడాది ఆసియా ఛాంపియన్‌షిప్‌లో ఆకట్టుకున్న రిత్విక్‌.. ఈ టోర్నీలో ఎలా ఆడతాడో చూడాలి. ప్రపంచ నంబర్‌వన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్, అమెరికా గ్రాండ్‌మాస్టర్లు ఫాబియానో కరువానా, నకముర ఈ కప్‌లో ఆడట్లేదు. ఈ కప్‌లో టాప్‌-50 ర్యాంకు ప్లేయర్లు నేరుగా రెండో రౌండ్‌ ఆడనున్నారు. 


ట్రోఫీ.. ఆనంద్‌ పేరిట 

భారత్‌లో జరుగుతున్న చెస్‌ ప్రపంచకప్‌నకు విశ్వనాథన్‌ ఆనంద్‌ ట్రోఫీ అని నామకరణం చేరారు. శుక్రవారం ఈ టోర్నీ ఆరంభోత్సవంలో కేంద్ర క్రీడల మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ ఈ కప్‌ను ఆవిష్కరించారు. ‘‘చెస్‌ ప్రపంచకప్‌నకు దిగ్గజ ఆటగాడు విశ్వనాథన్‌ పేరు పెడుతున్నందుకు ఎంతో గర్విస్తున్నాం’’ అని అఖిల భారత చెస్‌ సమాఖ్య వెల్లడించింది. ఆనంద్‌ అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు