Shardul Thakur: ఒకే ఒక్క వీక్‌ లింక్‌.. ఆందోళన రేకెత్తిస్తున్న శార్దూల్‌ ఫామ్‌!

వరల్డ్‌ కప్ కోసం (ODI World Cup 2023) బరిలోకి దిగిన భారత జట్టులో యువకులతోపాటు సీనియర్లకూ చోటు దక్కింది. అయితే, శార్దూల్ ఠాకూర్ విషయంలోనే మేనేజ్‌మెంట్‌తోపాటు క్రికెట్ అభిమానులకు ఆందోళన కలుగుతోంది. 

Published : 30 Sep 2023 14:42 IST

వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023) ముంగిట టీమ్‌ఇండియా సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం అయిపోతూ వచ్చాయి. జస్‌ప్రీత్‌ బుమ్రా, కేఎల్‌ రాహుల్, శ్రేయస్‌ అయ్యర్‌ ఫిట్‌నెస్, ఫామ్‌ను చాటుకున్నారు. గాయపడ్డ అక్షర్‌ పటేల్‌ స్థానంలోకి రవిచంద్రన్‌ అశ్విన్‌ వచ్చాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో చాలా వరకు ఇబ్బందులు తొలగిపోయాయి. కానీ ఒక్క శార్దూల్‌ ఠాకూర్‌ ఫామ్‌ మాత్రం ఆందోళన రేకెత్తిస్తోంది. కీలక మ్యాచ్‌ల్లో అతనెక్కడ టీమ్‌ఇండియా (Team India) కొంప ముంచుతాడో అని అభిమానులు కంగారు పడుతున్నారు.

మూడు వారాల కిందట వన్డే ప్రపంచకప్‌నకు భారత జట్టును ప్రకటించిన సమయంలో సెలక్టర్లు సరైన నిర్ణయాలే తీసుకున్నారా అనే ప్రశ్న తలెత్తింది. ఎందుకంటే అప్పటికి కొందరు ఆటగాళ్ల ఫామ్, ఫిట్‌నెస్‌ మీద సందేహాలు నెలకొన్నాయి. ముఖ్యంగా గాయాల కారణంగా కొన్ని నెలల పాటు మైదానానికి దూరమై.. అప్పుడే జట్టులోకి వచ్చిన కేఎల్‌ రాహుల్, శ్రేయస్‌ అయ్యర్‌ల ఎంపికపై చాలా చర్చ జరిగింది. అయితే రాహుల్‌ ఆసియా కప్‌లో సత్తా చాటుకున్నాడు. పాకిస్థాన్‌పై అద్భుత శతకంతో తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. ఆ తర్వాత కూడా నిలకడను కొనసాగించాడు. శ్రేయస్‌ కొంచెం ఆలస్యంగా.. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో గాడిన పడ్డాడు. ఆ జట్టుపై శతకం సాధించాడు.

Rohit Sharma: సిక్సర్లందు రోహిత్‌ సిక్సర్లు వేరయా!

మరోవైపు వన్డేల్లో తనేంటో నిరూపించుకోలేక ఇబ్బంది పడుతున్న సూర్యకుమార్‌ యాదవ్‌ సైతం ఇదే సిరీస్‌లో వరుసగా రెండు అర్ధశతకాలతో ఆకట్టుకున్నాడు. ఇంకోవైపు బౌలింగ్‌లో బుమ్రా, సిరాజ్, షమి, కుల్‌దీప్‌ నిలకడగా రాణిస్తుండటం కూడా జట్టుకు ఆనందాన్నిచ్చింది. అక్షర్‌ పటేల్‌ ఎంపిక మీద ప్రశ్నలు తలెత్తగా అతను ఆసియా కప్‌లో గాయపడ్డాడు. ఆ తర్వాత ప్రపంచకప్‌ జట్టుకూ దూరమయ్యాడు. అతడి స్థానంలో అశ్విన్‌ జట్టులోకి వచ్చాడు. అతను ఇటీవల ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో చక్కటి ప్రదర్శన చేశాడు. అశ్విన్‌ రాకతో బౌలింగ్‌లోనూ వైవిధ్యం వచ్చింది.

అదే భయం

జట్టులో మిగతా ఆటగాళ్లందరూ ప్రపంచకప్‌ ఆడటానికి వంద శాతం అర్హులు. దాదాపుగా అందరూ మంచి లయతో ఉన్నారు. కానీ ఒక్క శార్దూల్‌ ఠాకూర్‌ మాత్రమే జట్టులో వీక్‌ లింక్‌ లాగా కనిపిస్తున్నాడు. ప్రపంచకప్‌ సంగతి అటుంచితే.. శార్దూల్‌ ఫామ్‌ చూస్తే అతను మామూలుగా కూడా వన్డే జట్టులో ఉండటానికి అర్హుడేనా అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఇప్పటిదాకా 44 వన్డేలాడిన అతను.. 30.34 సగటుతో 63 వికెట్లే తీశాడు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పోలిస్తే శార్దూల్‌ ప్రదర్శన సాధారణం. ఇటీవల ఆస్ట్రేలియాతో రెండు వన్డేల్లో అతణ్ని ఆడిస్తే.. ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. తొలి మ్యాచ్‌లో బౌలర్లకు అనుకూలించిన పిచ్‌పై 10 ఓవర్లలో 78 పరుగులు సమర్పించుకున్న అతను.. రెండో మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్‌ చేసి 35 పరుగులు ఇచ్చుకున్నాడు. గతంలో, అది కూడా కొన్ని టెస్టు మ్యాచ్‌ల్లో ఆల్‌రౌండ్‌ మెరుపులతో ఆకట్టుకున్నాడు శార్దూల్‌. అతడికి వికెట్‌ టేకింగ్‌ బౌలర్‌గా పేరుంది. లోయరార్డర్లో అప్పుడప్పుడూ బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపిస్తాడు. కానీ శార్దూల్‌ నిలకడగా రాణించిన దాఖలాలు తక్కువ. ఇటీవల బౌలింగ్, బ్యాటింగ్‌ రెండింట్లోనూ విఫలమవుతున్నాడు.

శార్దూల్‌తో ఉన్న అతి పెద్ద సమస్య ఏంటంటే.. అతను ధారాళంగా పరుగులు ఇచ్చేస్తాడు. బౌలింగ్‌ అనుకూల పరిస్థితుల్లో కూడా ప్రత్యర్థులు లక్ష్యంగా చేసుకునేది అతణ్నే. శార్దూల్‌ వస్తే ప్రత్యర్థులకు పండగే అన్నట్లు తయారవుతోంది పరిస్థితి. అప్పుడప్పుడూ వికెట్లు తీస్తాడని.. బ్యాటింగ్‌లో ఉపయోగపడతాడని చూస్తే.. ఉత్కంఠభరిత మ్యాచ్‌ల్లో బాగా పరుగులిచ్చి జట్టు కొంప ముంచుతాడనే భయం పెరుగుతోంది. శార్దూల్‌తో పోలిస్తే ప్రసిద్ధ్‌ కృష్ణ ఎంతో మెరుగని ఇటీవల ఆసీస్‌ సిరీస్‌లో తన బౌలింగ్‌ చూస్తే అర్థమైంది. అక్షర్‌ బదులు అశ్విన్‌ వచ్చినట్లు.. ప్రపంచకప్‌ మొదలయ్యేలోపు శార్దూల్‌ స్థానంలోకి ప్రసిద్ధ్‌ వస్తే జట్టుకు మంచిదనే అభిప్రాయాలు సామాజిక మాధ్యమాల్లో అభిమానులు వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

-ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు