PKL: దిల్లీ ధమాకా

Eenadu icon
By Sports News Desk Published : 01 Nov 2025 02:30 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ప్రొకబడ్డీ ట్రోఫీ కైవసం 
ఫైనల్లో పుణెరిపై గెలుపు

ప్రొ కబడ్డీ సీజన్‌-12 ఆసాంతం ఆధిపత్యం ప్రదర్శించి.. లీగ్‌ దశలో టాప్‌-2లో నిలిచిన.. దబంగ్‌ దిల్లీ టైటిల్‌నూ పట్టేసింది. ఒత్తిడిలోనూ నిలిచి.. డిఫెన్స్‌తో అదరగొట్టిన అషు మలిక్‌ సారథ్యంలోని జట్టు ఈ సీజన్‌ విజేతగా ఆవిర్భవించింది. ఉత్కంఠభరిత ఫైనల్లో ఆ జట్టు పుణెరి పల్టాన్‌ను ఓడించింది. దిల్లీకి ఇది రెండో టైటిల్‌. రెండోసారి ఛాంపియన్‌ కావాలనుకున్న పుణెరికి నిరాశే.

దిల్లీ: సొంతగడ్డపై దిల్లీ అదరగొట్టింది. అదిరే ఆటతో ప్రొ కబడ్డీ టైటిల్‌ను గెలుచుకుంది. శుక్రవారం నువ్వానేనా అన్నట్లు సాగిన తుది పోరులో దిల్లీ 31-28తో పుణెరిని ఓడించింది. త్యాగరాజ్‌ స్టేడియంలో జరిగిన ఈ పోరులో ఆరంభం నుంచి రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. మొదట దిల్లీ కాస్త ఆధిపత్యం చూపిస్తే.. తర్వాత పుణెరి పుంజుకుంది. గౌరవ్‌ సూపర్‌ ట్యాకిల్‌తో 6-7తో దిల్లీని సమీపించింది. రైడింగ్‌లో సత్తా చాటిన దిల్లీ.. నెమ్మదిగా పాయింట్ల అంతరాన్ని పెంచింది. ఆజింక్య పవార్‌ రాణించడంతో ఇంకో అయిదు నిమిషాల్లో తొలి అర్ధం ముగుస్తుందనగా పుణెరిని ఆలౌట్‌ చేసి 14-8తో నిలిచింది. దిల్లీ 20-14తో బ్రేక్‌కు వెళ్లింది. 

విరామం తర్వాత పుణెరి దూకుడు పెంచింది. పంకజ్‌ మోహిత్‌ సూపర్‌ ట్యాకిల్‌.. ఆదిత్య షిండే రెండు పాయింట్ల రెయిడ్‌తో రేసులోకి వచ్చింది. అయినా దిల్లీ దాడులు ఆపలేదు. ఆధిక్యాన్ని కొనసాగిస్తూనే వచ్చింది. చివరి క్వార్టర్‌ ఉందనగా ఆ జట్టు 24-18తో విజయం దిశగా సాగింది. కానీ పుణెరి వదల్లేదు. మహ్మద్‌ అమాన్, ఆదిత్య షిండే మెరుపులతో బలంగా పుంజుకుంది. దిల్లీని ఆలౌట్‌ చేసి 25-25తో ప్రత్యర్థిని అందుకుంది. అక్కడ నుంచి దిల్లీ డిఫెన్స్‌లో అదరగొట్టింది. కొన్ని సెకన్లలో మ్యాచ్‌ ముగుస్తుందనగా 30-28తో నిలిచిన దిల్లీ.. అదే జోరుతో ఓ పాయింట్‌ను సాధించి ట్రోఫీని ఎగరేసుకుపోయింది. నీరజ్‌ నర్వాల్‌ (9), ఆదిత్య పవార్‌ (6) దిల్లీ విజయంలో కీలకపాత్ర పోషించారు. పుణెరి తరఫున ఆదిత్య షిండే (10), పంకజ్‌ (4), అభి (4), గౌరవ్‌ (3) రాణించినా గెలిపించలేకపోయారు. 

  • దిల్లీకి ఇది రెండో పీకేఎల్‌ టైటిల్‌. 2021లో తొలిసారి టైటిల్‌ గెలిచింది.
  • 12 సీజన్లలో పట్నా పైరేట్స్‌ అత్యధికంగా మూడుసార్లు నెగ్గింది. దిల్లీ, జైపుర్, రెండేసి టైటిళ్లు సాధించగా.. యు ముంబా, పుణెరి పల్టాన్, హరియాణా స్టీలర్స్, బెంగళూరు బుల్స్, బెంగాల్‌ వారియర్స్‌ ఒక్కో ట్రోఫీ నెగ్గాయి. 

ప్రైజ్‌మనీ: విజేత దిల్లీకి రూ.3 కోట్లు, రన్నరప్‌ పుణెరికి  రూ.1.8 కోట్లు దక్కాయి.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని