David Warner: చివరి టెస్టులో హాఫ్ సెంచరీ.. అభిమానుల్లో చిరునవ్వులు నింపానని భావిస్తున్నా: వార్నర్

డేవిడ్‌ వార్నర్ (David Warner) తన కెరీర్‌లో చివరి టెస్టు మ్యాచ్ ఆడేశాడు. హాఫ్ సెంచరీ సాధించి ఘనమైన వీడ్కోలు పలికాడు.

Published : 06 Jan 2024 13:08 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాటర్ డేవిడ్ వార్నర్ (David Warner) తన కెరీర్‌లో చివరి టెస్టు మ్యాచ్‌ ఆడేశాడు. సిడ్నీ వేదికగా పాకిస్థాన్‌తో (AUS vs PAK) జరిగిన మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్‌ సెంచరీ (57) సాధించి జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో మూడు టెస్టుల సిరీస్‌ను ఆసీస్ క్లీన్‌స్వీప్‌ చేసింది. వీడ్కోలు టెస్టు సందర్భంగా వార్నర్‌ కాస్త భావోద్వేగానికి గురయ్యాడు. ఆసీస్‌, పాకిస్థాన్ ఆటగాళ్లు అతడికి అభినందనలు తెలిపారు.

‘‘కెరీర్‌లో చివరి టెస్టు సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకోవడం అద్భుతంగా ఉంది. ఏడాదిన్నర నుంచి ఆసీస్‌ క్రికెట్‌కు అంతా మంచే జరుగుతోంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ విజేతగా నిలవడం, యాషెస్‌ సిరీస్‌ను డ్రా చేయడం, వన్డే ప్రపంచకప్‌ను సాధించడం.. ఇలా అన్ని మెగా ఈవెంట్లలో భాగమయ్యా. ఇప్పుడు పాక్‌తో మూడు టెస్టుల సిరీస్ దక్కింది. ఇలాంటి జట్టుతో ప్రయాణం సాగించడం గర్వంగా ఉంది. మైదానంలోనే కాకుండా.. వెలుపలా జట్టు సభ్యులు శ్రమించే తీరు అభినందనీయం. ఇవాళ మైదానంలోకి అడుగు పెట్టే ముందు టెస్టుల్లో నా చివరి రోజు అని భావించలేదు. సొంత ప్రేక్షకుల మధ్య చివరి మ్యాచ్‌ ఆడటం ఎప్పుడూ ప్రత్యేకమే. గత దశాబ్ద కాలానికిపైగా ఆస్ట్రేలియా కోసం ఆడిన ప్రతిక్షణం అభిమానులు మద్దతుగా నిలిచారు. వారికి కేవలం కృతజ్ఞతలు మాత్రమే సరిపోవు.

అభిమానులను అలరించడానికే ఇక్కడికి వచ్చాం. చివరి టెస్టులోనూ మంచి ఇన్నింగ్స్‌ ఆడటం మరింత సంతృప్తినిచ్చింది. టీ20లతో కెరీర్‌ను ప్రారంభించా. ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటూ ఇక్కడి దాకా వచ్చా. నా విజయంలో కుటుంబం పాత్ర చాలా కీలకం. ప్రతి క్షణం వారితో పంచుకున్నా. కాండిస్ (వార్నర్ భార్య)కు థ్యాంక్యూ. కెరీర్‌లోచాలా మంది క్రికెటర్లతో కలిసి ఆడాను. వారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటూ అభిమానులను అలరించడానికి ప్రయత్నించా. నా ఆటతో ప్రతి ఒక్క అభిమాని ముఖంలో చిరునవ్వులు వచ్చేలా చేశానని భావిస్తున్నా. టెస్టు క్రికెట్‌ మున్ముందు మరింత ఉన్నతంగా మారాలని ఆశిస్తున్నా. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని వార్నర్ వెల్లడించాడు. 

డేవిడ్ వార్నర్‌ ఇప్పటికే వన్డేలకూ వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అయితే, వచ్చే ఏడాది ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఓపెనర్‌గా తన అవసరం ఉందనుకుంటే మాత్రం వస్తానని చిన్న మెలిక పెట్టాడు. వార్నర్ తన కెరీర్‌లో మొత్తం 112 టెస్టుల్లో 8,786 పరుగులు చేశాడు. ఇందులో 26 సెంచరీలు, 37 అర్ధశతకాలు ఉన్నాయి. ఇక 161 వన్డేల్లో 22 సెంచరీలతో 6,932 పరుగులు సాధించాడు. ఇప్పటి వరకు కెరీర్‌లో నాలుగు వికెట్లు కూడా పడగొట్టడం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని