Rishabh Pant: సింగిల్ హ్యాండ్‌తో సిక్స్‌.. ఇలాంటి గేమ్‌ కోసమే ఏడాదిన్నర వేచి చూశా: పంత్

దిల్లీ అదిరిపోయే విజయంతో ఐపీఎల్ 17వ సీజన్‌లో ఖాతా తెరిచింది. రిషభ్‌ పంత్‌ కెప్టెన్ ఇన్నింగ్స్‌తోపాటు బౌలర్లు రాణించడతో చెన్నైని ఓడించింది.

Updated : 01 Apr 2024 09:51 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్ 17వ సీజన్‌లో దిల్లీ బోణీ కొట్టింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నైను ఓడించింది. హాఫ్‌ సెంచరీతో (51) దిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాదాపు ఏడాదిన్నర తర్వాత మైదానంలోకి అడుగు పెట్టి అదరగొట్టాడు. ఒంటి చేత్తో సిక్స్‌ కొట్టడంతో మునుపటి పంత్‌ను గుర్తుకు తెచ్చాడు. మ్యాచ్‌ అనంతరం ఇదే విషయంపై అతడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

‘‘చెన్నైతో మ్యాచ్‌లో మా బౌలర్లు అద్భుతం చేశారు. గత మ్యాచుల్లో చేసిన పొరపాట్ల నుంచి పాఠాలను నేర్చుకుని బరిలోకి దిగాం. పృథ్వీ షా తీవ్రంగా శ్రమించాడు. అందుకే, అతడికి అవకాశం ఇచ్చాం. ముకేశ్ కుమార్‌ కీలక సమయాల్లో వికెట్లు తీశాడు. పరిస్థితులను బట్టి అతడితో బౌలింగ్‌ వేయించాలని అనుకున్నాం. డెత్‌ ఓవర్లలో అద్భుతంగా బంతులు సంధించాడు. ఈ మ్యాచ్‌లో మేం పుంజుకున్న తీరు బాగుంది. నేను కూడా ఆరంభంలో కాస్త సమయం తీసుకున్నా. చాలా రోజుల తర్వాత క్రికెట్‌ ఆడుతున్నా. తప్పకుండా నా నుంచి మంచి ఇన్నింగ్స్‌ వస్తుందని భావించా. ఒంటి చేత్తో సిక్స్‌ కొట్టడంపై స్పందించడానికేమీ ఉండదు. ఇలాంటి ఆట కోసం దాదాపు ఏడాదిన్నరపాటు వేచి చూశా. ఇప్పటికీ క్రికెటర్‌గా నేర్చుకుంటూనే ఉన్నా’’ అని పంత్ అన్నాడు. ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా రిషభ్​ పంత్‌కు రూ.12 లక్షలు జరిమానా పడింది.

నా బలమేంటో తెలుసు: ఖలీల్ అహ్మద్

‘‘బంతితో నేనేం చేయాలని అనుకున్నానో అదే చేసి చూపించా. దేశవాళీ క్రికెట్‌లో చాలా కష్టపడ్డా. గత ఆరు నెలల్లో చాలా మ్యాచులు ఆడా. ఇదే ఇప్పుడు నా ఆటతీరు మెరుగు పడేందుకు సాయం చేసింది. బంతి స్వింగ్‌ అవుతున్నప్పుడు బౌలింగ్‌ వేయడం చాలా సరదాగా ఉంటుంది. బ్యాటర్లు ఇబ్బంది పడతారు. ఫిట్‌నెస్‌పైనా దృష్టిసారించా. రెడ్‌ బాల్ క్రికెట్‌ ఆడటం వల్ల చాలా విషయాలను నేర్చుకొనేందుకు అవకాశం ఉంటుంది. ఎప్పటికైనా మళ్లీ భారత జట్టులోకి అడుగు పెట్టడమే నా లక్ష్యం’’ అని ఖలీల్ అహ్మద్‌ తెలిపాడు. చెన్నైపై నాలుగు ఓవర్లు వేసిన ఖలీల్‌ 21 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. అతడిక ‘ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

మా బౌలర్లు రాణించినా..: రుతురాజ్‌

‘‘మా బౌలింగ్‌ తీరు చూశాక కాస్త హ్యాపీగానే ఉన్నా. పవర్‌ ప్లేలో భారీగా పరుగులు ఇచ్చినా.. కుదురుకొని దిల్లీని చివరికి 191 పరుగులకే కట్టడి చేయగలిగాం. తొలి ఇన్నింగ్స్‌లో పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా అనిపించింది. ఆ తర్వాత బంతి అదనంగా సీమ్‌ కావడంతో ఎదుర్కోవడం కష్టమైంది. తొలి మూడు ఓవర్లలో మేం వికెట్లను కోల్పోవడంతోపాటు ఎక్కువ పరుగులు చేయలేకపోయాం. ఇదే మా ఓటమికి కారణం. వరుసగా రెండు విజయాలు నమోదు చేసిన తర్వాత ఇలాంటి ఫలితం ఎదురైంది. అయితే, మేం ఎలాంటి కంగారు పడటం లేదు. తప్పకుండా మున్ముందు మ్యాచుల్లో విజయం సాధించేందుకు ప్రయత్నిస్తాం. దీపక్‌ చాహర్‌ భారీగా పరుగులు ఇచ్చాడు. పవర్‌ప్లేలోనే అతడు మూడు ఓవర్లు వేస్తాడు. అప్పుడప్పుడు బ్యాటర్లు ఎదురు దాడి చేసినప్పుడు ఇలాంటి పరిస్థితి తప్పదు. కానీ, దీపక్ అద్భుతమైన బౌలర్ అనడంలో సందేహమే లేదు’’ అని చెన్నై కెప్టెన్ రుతురాజ్‌ గైక్వాడ్ అన్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని