Dhruv Jurel: అర్ధశతకం తర్వాత ధ్రువ్‌ అలా ఎందుకు చేశాడంటే..!

ఇంగ్లాండ్‌పై నాలుగో టెస్ట్‌లో మెరిసిన ధ్రువ్‌.. అర్ధశతకం పూర్తయ్యాక సెల్యూట్‌ చేసి అందరినీ ఆకట్టుకొన్నాడు. దీనికో కారణం ఉంది.

Updated : 25 Feb 2024 15:44 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రాజ్‌కోట్‌ 90 పరుగులతో టీమ్‌ ఇండియాను ఆదుకొన్న ధ్రువ్‌ జురెల్‌ (Dhruv Jurel) అర్ధశతకం సంబరాలు మాత్రం తొలుత అభిమానులకు అర్థం కాలేదు. అతడు అలా ఎందుకు చేశాడో తెలిశాక మాత్రం నెటిజన్లు ‘నీకు హ్యాట్సాఫ్‌’ అంటున్నారు. నేడు 30 పరుగుల ఓవర్‌ నైట్‌ స్కోర్‌తో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఈ కుర్రాడు మెల్లగా గేర్లు మారుస్తూ స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించాడు. టెయిలెండర్లతో కలిసి ఇంగ్లాండ్‌ ఆధిక్యాన్ని కేవలం 46 పరుగులకు కుదించేశాడు. 

నేడు తొలి అర్ధశతకాన్ని పూర్తి చేసుకొన్నాక ధ్రువ్‌ ‘సెల్యూట్‌’ చేయడం అందర్ని ఆశ్చర్యపర్చింది. మాజీ సైనికుడైన తన తండ్రి గౌరవార్థం అతడు అలా చేశాడు. 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధంలో అతడి తండ్రి నేమ్‌ చంద్‌ జురెల్‌ దేశానికి సేవలు అందించారు. హవాల్దార్‌ హోదాలో ఆయన సైన్యం నుంచి పదవీ విరమణ చేశారు. ధ్రువ్‌ను కూడా ఆయన ఓ సైనికాధికారిగా చూడాలనుకున్నారు. కానీ, చిన్నతనం నుంచి క్రికెట్‌పై మక్కువ ఉండటంతో ఆ దిశగా ప్రోత్సహించారు.

‘మరో ధోనీ కనిపిస్తున్నాడు’.. ధ్రువ్‌ జురెల్‌పై గావస్కర్‌ ప్రశంసలు

ఇటీవల టెస్ట్‌ క్యాప్‌ అందుకొంటున్న సమయంలో ఆ క్షణాలను తన తండ్రికి అంకితం చేస్తున్నట్లు ధ్రువ్‌ ప్రకటించాడు. ‘‘ఏదైనా విషయాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితి ఏర్పడితే.. నాన్నను సంప్రదిస్తాను.  సరైన మార్గదర్శకత్వం చేస్తారు’’ అని నాడు వెల్లడించాడు.  2020లో అండర్‌-19 ప్రపంచకప్‌ వైస్‌కెప్ట్‌న్‌గా ధ్రువ్‌ బాధ్యతలు నిర్వర్తించాడు. 2022లో తొలిసారి లీగ్‌ క్రికెట్‌లో రాజస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించాడు.  

రింకూ సింగ్‌ అభినందనలు..

ధ్రువ్‌ ఇన్నింగ్స్‌ను పలువురు ఆటగాళ్లు అభినందిస్తున్నారు. టీమ్‌ ఇండియా హిట్టర్‌ రింకూ సింగ్‌ కూడా ఆ జాబితాలో చేరాడు. తన ఇన్‌స్టాలో ఓ సందేశం ఉంచాడు. ‘‘నా సోదరా.. కలలను సాకారం చేసుకొనే సమయం ఆసన్నమైంది’’ అని ఇద్దరూ కలిసున్న ఫొటోను పోస్టు చేశాడు. రింకూతో తనకు మంచి అనుబంధం ఉందని ఇటీవల ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధ్రువ్‌ వెల్లడించాడు. అతడు తన రూమ్మేట్‌ అని పేర్కొన్నాడు. గుజరాత్‌పై గత ఐపీఎల్‌లో వరుసగా ఐదు సిక్స్‌లు కొట్టిన రింకూ ఆ తర్వాత తనకు ఫోన్‌ చేసి.. ‘‘ఎలా ఉంది.. చెప్పు ఎలా ఉంది’’ అని అడిగాడని గుర్తు చేసుకొన్నాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని