Virat Kohli: ఇకనుంచి నన్ను అలా పిలవొద్దు.. చాలా ఇబ్బంది పడతా: విరాట్ కోహ్లీ

ఐపీఎల్‌లో (IPL) భారీ క్రేజ్ కలిగిన జట్టు ఆర్సీబీ. పెద్ద స్టార్లు ఉన్నప్పటికీ ఛాంపియన్‌గా నిలవడంలో మాత్రం విఫలమైంది. ఈ సారి ఎలాగైనా టైటిల్‌ను కొడతామని విరాట్ కోహ్లీ (Virat Kohli) వెల్లడించాడు.

Published : 20 Mar 2024 13:10 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఐపీఎల్‌ కోసం ప్రాక్టీస్ ముమ్మరం చేశాడు. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతోపాటు చేరిన కోహ్లీ.. డబ్ల్యూపీఎల్‌ విజేతగా నిలిచిన మహిళా జట్టుకు శుభాకాంక్షలు తెలిపాడు. ఆర్సీబీ కెప్టెన్లు ఫాఫ్‌ డుప్లెసిస్‌, స్మృతి మంధానతో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న విరాట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ ఫ్రాంచైజీ సాధించిన సింగిల్ టైటిల్‌ను డబుల్ చేస్తామనే నమ్మకం ఉందని తెలిపాడు.

‘‘మా తొలి మ్యాచ్‌లో సీఎస్కేను ఢీకొట్టనున్నాం. చెన్నైకి బయల్దేరి వెళ్తాం. మాకు ఎక్కువ సమయం లేదు. ఛార్టర్‌ ఫ్లైట్‌లో అక్కడికి చేరుకుంటాం. ఆర్సీబీ మహిళల జట్టు ఛాంపియన్‌గా నిలవడం ఆనందంగా ఉంది. మేం కూడా విజేతగా నిలుస్తామనే నమ్మకంతో ఉన్నాం. సింగిల్ టైటిల్‌ను డబుల్‌ చేస్తే మరెంతో ప్రత్యేకమవుతుంది. ఈ సందర్భంగా అభిమానులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా. మొదట నన్ను ‘కింగ్‌’ అనే పదంతో పిలవడం ఆపేయండి. ఇలాంటి పదంతో పిలిస్తుంటే చాలా అసౌకర్యంగా అనిపిస్తోంది. నన్ను విరాట్ అని మాత్రమే పిలిస్తే చాలు. ఇప్పటికే మా కెప్టెన్ ఫాఫ్‌ డుప్లెసిస్‌కు ఇదే మాట చెప్పా. ప్రతి ఏడాది సీజన్‌ సమయంలో అలాంటి పిలుపుతో ఇబ్బంది పడ్డా. విరాట్ కోహ్లీగానే పిలవండి. 

ఐపీఎల్ టైటిల్‌ సాధించాలనేది నా కల. ఈసారి ఎలాగైనా సాధించేందుకు ప్రయత్నిస్తాం. ఆర్సీబీ తొలిసారి టైటిల్‌ను (డబ్ల్యూపీఎల్) గెలిచింది. అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శిస్తాం. జట్టు విజయం కోసం, అభిమానుల కోసం నా అనుభవాన్ని ఉపయోగిస్తా. గత 16 సీజన్లలోనూ కప్‌ కోసం చాలా కష్టపడ్డాం. ప్రతి ఛాన్స్‌ను వినియోగించుకొనేందుకు ప్రయత్నించి ముందుకు సాగాం. నిబద్ధత విషయంలో రాజీ పడేది లేదు. ఇప్పుడూ మా టార్గెట్‌ కప్‌ను సాధించడమే’’ అని విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. మార్చి 22న ఐపీఎల్‌ (IPL) 17వ సీజన్‌ తొలి మ్యాచ్‌లోనే చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆర్సీబీ (CSK vs RCB) తలపడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని