న్యూయార్క్‌ పిచ్‌పై మైకెల్ వాన్‌ కామెంట్.. జాఫర్‌ కౌంటర్

తొలి మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. కానీ, పిచ్‌ను చూస్తే మాత్రం క్రికెట్ అభిమానులతోపాటు విశ్లేషకులూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.

Published : 06 Jun 2024 08:24 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 ప్రపంచ కప్‌లో (T20 World Cup 2024) భారత్ బోణీ కొట్టింది. ఐర్లాండ్‌ను చిత్తు చేసి ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో బౌలర్లకు సహకారం అందించిన పిచ్‌పై భారత స్టార్లు చెలరేగిపోయారు. అనూహ్యంగా బౌన్స్‌ అవుతూ బ్యాటర్లను ఇబ్బందికి గురి చేసింది. డ్రాప్‌ ఇన్ పిచ్‌లు కావడంతో ఎలా స్పందిస్తుందో అర్థం చేసుకోవడం కష్టమేనని భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో న్యూయార్క్ పిచ్‌పై ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ కామెంట్‌ చేయగా.. భారత మాజీ ఆటగాడు వసీమ్‌ జాఫర్ అద్భుతమైన కౌంటర్ ఇచ్చాడు. 

‘‘యూఎస్‌ఏలో క్రికెట్ వ్యాప్తి కోసం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయి. అయితే, పెద్దగా ప్రమాణాలు లేని ఇలాంటి పిచ్‌లపై ఆటగాళ్లు క్రికెట్‌ ఆటడం ఆమోదయోగ్యం కాదు. వరల్డ్‌ కప్‌లో మరీ కష్టం. దీని కోసం ప్లేయర్లు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది’’ అని వాన్ పోస్టు పెట్టాడు. 

‘‘న్యూయార్క్‌లో తయారు చేసిన ఈ పిచ్‌ అద్భుతమైందే. అమెరికన్‌ ప్రేక్షకులకు టీ20లతోపాటు టెస్టు క్రికెట్‌పై ఆసక్తి కలిగించేందుకు ఇదొక చక్కటి ఆలోచనగా ఉంది’’ అని జాఫర్‌ కామెంట్ పెట్టాడు. 

ఇదే పిచ్‌పై దాయాదుల పోరు

జూన్ 9న (ఆదివారం) ప్రపంచంలోని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూసే భారత్ - పాక్‌ మ్యాచ్‌ జరగనుంది. దీనికి వేదిక కూడా న్యూయార్క్‌ పిచ్. అయితే, ఇప్పుడు ఐర్లాండ్‌తో మ్యాచ్‌ను గమనిస్తే.. దాయాదుల పోరు ఫలితం ఎలా ఉంటుందోనని అభిమానుల్లో ఆందోళన నెలకొంది. దీనిపై ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే స్పందిస్తూ.. ‘‘పిచ్‌లకు ఏమైనా చేయండి. ఇలాంటి దానిపై భారత్ - పాక్ మ్యాచ్‌ను ఊహించుకోవడం కూడా కష్టమే’’ అని పోస్టు చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని