IND vs ENG: మా జట్టు ఓటమికి నిర్లక్ష్యం.. అతివిశ్వాసమే కారణం: ఇంగ్లాండ్‌ క్రికెట్ దిగ్గజం

దూకుడైన ఆట తీరుతో ప్రత్యర్థులను భయపెడదామని భావించిన ఇంగ్లాండ్‌కు ఇప్పుడు అదే శాపంగా మారింది. భారత్‌ చేతిలో (IND vs ENG) టెస్టు సిరీస్‌ను కూడా కోల్పోయింది.

Published : 28 Feb 2024 18:10 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌ చేతిలో ఐదు టెస్టు సిరీస్‌లను (IND vs ENG) మరో మ్యాచ్‌ ఉండగానే ఓడిపోవడంపై ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మెక్‌కల్లమ్‌ - బెన్‌ స్టోక్స్‌ జోడీ తీసుకొచ్చిన ‘బజ్‌బాల్’ (Bazball) వల్ల బ్యాటింగ్ దెబ్బతిందని ఇంగ్లాండ్‌ క్రికెట్ దిగ్గజం జెఫ్రీ బాయ్‌కాట్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

‘‘బజ్‌బాల్ క్రికెట్ వల్ల టెస్టు క్రికెట్‌కు ఊపు వచ్చింది. అందుకోసం ఇంగ్లాండ్‌ జట్టును అభినందించాల్సిందే. నేనూ ఇష్టపడ్డా. కానీ, విజయం సాధించడం చాలా ముఖ్యం. కానీ, ఇంగ్లాండ్‌ మాత్రం ప్రపంచంలోనే అత్యుత్తమ రెండు టెస్టు జట్లను ఓడించడంలో విఫలమైంది. ఆసీస్‌ చేతిలో ఓటమిపాలు కాగా.. ఇప్పుడు భారత్‌ మనల్ని ఓడించింది. ఇరు జట్లనూ ఓడించే అవకాశం వచ్చి కూడా వదులుకోవడంపైనే ఎక్కువ బాధ పడాలి. గతంలో ఇంగ్లాండ్‌ యాషెస్‌ను గెలిచినప్పుడు బ్యాటింగ్‌ కీలకంగా మారింది. 

ఇప్పుడు భారత్‌ చేతిలో సిరీస్‌ను కోల్పోయినప్పుడు బ్యాటింగ్‌దే లోపం. ఒకరిద్దరు సెంచరీలు సాధించినప్పుడు కూడా మిగతావారు ఆ జోరును కొనసాగించలేకపోయారు. నిలకడైన ఆటతీరును ప్రదర్శించలేకపోయారు. భయం లేకుండా ఆడటం మంచిదే. కానీ, నిర్లక్ష్యంతోపాటు అతివిశ్వాసంతో ప్రత్యర్థిపై ఆధిపత్యం చూపిస్తామంటే కుదరదు. మ్యాచ్‌లో ఔట్‌ కావడం సహజమే. కానీ, సెల్ఫ్‌ఔట్‌ క్షమించరానిది’’ అని బాయ్‌కాట్ వెల్లడించాడు.

100వ టెస్టులో బెయిర్‌స్టో రాణిస్తాడు: మెక్‌కల్లమ్‌

భారత్‌ టెస్టు సిరీస్‌లో గొప్పగా రాణించలేకపోతున్న జానీ బెయిర్‌స్టోకు (Jonny Bairstow) ఇంగ్లాండ్‌ కోచ్‌ బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ మద్దతుగా నిలిచాడు. ‘‘ప్రతిఒక్కరికీ బెయిర్‌ స్టో గురించి తెలిసిందే. మైదానంలో కొన్నిసార్లు తీవ్రంగా భావోద్వేగానికి గురవుతాడు. తన జీవితంలో అత్యుత్తమ మైలురాయిని చేరుకోనున్నాడు. ధర్మశాల టెస్టు అతడికి 100వ మ్యాచ్‌. తప్పకుండా దానిని చిరస్మరణీయం చేసుకుంటాడని భావిస్తున్నా. ఈ సిరీస్‌లో ఒక మ్యాచ్‌ మాత్రమే ఆడిన ఓలీ రాబిన్‌సన్‌ మున్ముందు రాణిస్తాడు. ఏదో కారణం చెప్పి అతడిని పక్కన పెట్టలేదు. అత్యుత్తమ బౌలింగ్‌ దాడితోనే మేం బరిలోకి దిగాలని అనుకున్నాం’’ అని మెక్‌కల్లమ్‌ వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని