Hardik Pandya: హార్దిక్‌ను అహ్మదాబాద్‌లో ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి?: భారత మాజీ క్రికెటర్

అహ్మదాబాద్‌లో ముంబయి కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌ ఆడే సమయంలో అభిమానుల రియాక్షన్ ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. దీనిపై భారత మాజీ క్రికెటర్ స్పందించాడు.

Published : 23 Feb 2024 23:04 IST

ఇంటర్నెట్ డెస్క్‌: గుజరాత్‌ టైటాన్స్‌ను (Gujarat Titans) తొలిసారే ఐపీఎల్‌ ఛాంపియన్‌గా నిలిపాడు. వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేర్చిన ఘనత కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య. ఇప్పుడు ముంబయి ఇండియన్స్‌ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. మార్చి 22 నుంచి ఐపీఎల్-2024 సీజన్ ప్రారంభం కానుంది. మరో రెండు రోజులకే (మార్చి 24న) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ X ముంబయి మధ్య జరగనుంది. గుజరాత్‌కు శుభ్‌మన్‌ గిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్‌ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాండ్య అహ్మదాబాద్‌లో మ్యాచ్‌ ఆడే సమయంలో అభిమానుల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలని ఉందని వ్యాఖ్యానించాడు. 

‘‘ హార్దిక్‌ పాండ్య తన సొంతమైదానంలో ముంబయి కెప్టెన్‌గా ఎలా ఆడతాడో చూడాలి. ఆ సమయంలో అభిమానులు అతడిని ఎలా రిసీవ్‌ చేసుకుంటారో ఆసక్తికరంగా ఉంది. ఫ్యాన్స్‌ అరుపులతో హోరెత్తించాలి. ఐపీఎల్‌ తొలి సీజన్‌లో ముంబయి-కోల్‌కతా మధ్య మ్యాచ్‌ సందర్భంగానూ ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ప్రస్తుత చీఫ్‌ సెలక్టర్ అజిత్ అగార్కర్ మా జట్టు (కోల్‌కతా) తరఫున బరిలోకి దిగాడు. అతడిని బౌండరీ లైన్‌ వద్ద ఉంచాం. దీంతో ముంబయి అభిమానులు నినాదాలతో హోరెత్తించారు. వెంటనే అతడిని సర్కిల్‌లోకి తీసుకొచ్చాం. ఎందుకంటే ఆ నినాదాలు దారుణంగా ఉన్నాయి. ఇప్పుడు హార్దిక్‌ ముంబయి తరఫున అహ్మదాబాద్‌ మైదానంలో ఆడబోతున్నాడు. అతడు ఫీల్డింగ్‌ లేదా బ్యాటింగ్‌, బౌలింగ్‌ సమయాల్లో అభిమానులు ఎలా రియాక్ట్‌ అవుతారో చూడాలి. అరుపులతో హోరెత్తించాలని కోరుకుంటున్నా. ఒకవేళ అలా చేయకపోతే ఐపీఎల్‌లో మజా ఏముంటుంది? కానీ, అది కూడా సహేతుకంగా ఉంటేనే బెటర్’’ అని చోప్రా అభిప్రాయపడ్డాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని