T20 World Cup 2024: అప్పుడు వర్కౌట్‌ కాలేదు.. ఈసారైనా సీనియర్లు ముందుండాలి: మంజ్రేకర్

సీనియర్లపై ఉంచిన నమ్మకాన్ని ఈసారి వమ్ము కానివ్వకుండా కప్‌ను అందించాలని భారత మాజీ క్రికెటర్ సూచించాడు. అలాగే పాక్‌తో ఇద్దరిని అడ్డుకోగలిగితే మరోసారి ఆధిపత్యం ప్రదర్శించవచ్చని పేర్కొన్నాడు.

Published : 01 Jun 2024 10:17 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2024) కోసం సన్నాహకంలో భాగంగా భారత్‌ ఇవాళ వార్మప్‌ మ్యాచ్‌ ఆడనుంది. బంగ్లాదేశ్‌తో తలపడనుంది. న్యూయార్క్‌ పిచ్‌లను అర్థం చేసుకోవడానికి ఈ మ్యాచ్‌ అత్యంత కీలకమని భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. విరాట్, హార్దిక్, సూర్యకుమార్‌ తదితరులు తమ ఫామ్‌ను పరీక్షించుకోవడానికి ఇదొక అవకాశం. ఈ క్రమంలో సీనియర్లు మరింత బాధ్యతగా ఈ టోర్నీలో ఆడాల్సిన అవసరం ఉందని మాజీ క్రికెటర్ సంజయ్‌ మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు. 

‘‘భారత సెలక్టర్లు మరోసారి సీనియర్లపై నమ్మకంతో జట్టులోకి ఎంపిక చేశారు. నేను కుర్రాళ్లకే ఎక్కువ ఛాన్స్‌ ఇచ్చేవాడిని. ఇప్పటికే జట్టును ప్రకటించేశారు. దీంతో మెగా సమరంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ముందుండి జట్టును నడిపించాలి. నాకు తెలిసి ఓపెనర్లుగా వీరిద్దరే వస్తారని అనుకుంటున్నా. కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు చేయడం అసాధ్యమే. మొదటి ఓవర్‌ నుంచి అతడు బ్యాటింగ్‌ చేస్తే ఆ దూకుడు అలానే కొనసాగే అవకాశం ఉంటుంది. తుది జట్టులో యశస్వి జైస్వాల్‌ ఉండకపోవచ్చు. దురదృష్టవశాత్తూ ఈసారి బెంచ్‌కే పరిమితమైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. భారత సెలక్టర్లు సీనియర్లపై నమ్మకం ఉంచారు. గత కొన్ని ఎడిషన్లలో వర్కౌట్‌ కాలేదు. ఈసారి తప్పకుండా ఛాంపియన్‌గా నిలుపుతారని ఆశిద్దాం. హార్దిక్‌ పాండ్య పేస్‌ ఆల్‌రౌండర్‌గా ఈ సారి కీలక పాత్ర పోషిస్తాడు’’ అని తెలిపాడు. 

వారిద్దరిని అడ్డుకుంటే చాలు..

జూన్ 9న భారత్ - పాకిస్థాన్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ పోరులో ఇద్దరు పాక్‌ బౌలర్ల నుంచి టీమ్‌ఇండియా బ్యాటర్లకు ఇబ్బందులు తప్పవని మంజ్రేకర్ హెచ్చరించాడు. ‘‘దాదాపు ఏడేళ్ల తర్వాత మహమ్మద్ ఆమిర్ అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ ఆడుతున్నాడు. అతడి ఫామ్‌, లయ ఎలా ఉందో తెలియదు. ఇక షహీన్ అఫ్రిది కూడా ఇప్పుడు చాలా మారిపోయాడు. వీరిద్దరిని భారత్ హ్యాండిల్‌ చేయాలి. గత ఆసియా కప్, వన్డే ప్రపంచ కప్‌లో వన్‌సైడెడ్‌ మ్యాచ్‌లతో మనం గెలిచాం. ఈసారి వారిద్దరిని అడ్డుకోగలిగితే భారత్‌కు పెద్ద కష్టమేం కాదు’’ అని మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని