Ishan: ఒకే ఇన్నింగ్స్‌లో 1000 పరుగులు చేసినా.. ఇషాన్‌ రెండో ఆప్షనే: సల్మాన్ భట్

భారత బ్యాటర్ ఇషాన్‌ కిషన్‌ (Ishan Kishan) బ్యాటింగ్‌ ఆర్డర్‌ విషయంలో టీమ్‌ఇండియా ప్రయోగాలను పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ తప్పుబట్టాడు.

Published : 04 Aug 2023 09:17 IST

ఇంటర్నెట్ డెస్క్: యువ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను (Ishan Kishan) వినియోగించుకోవడంలో టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌ సరిగా వ్యవహరించడం లేదని పాక్‌ మాజీ కెప్టెన్ సల్మాన్‌ భట్‌ వ్యాఖ్యానించాడు. వెస్టిండీస్‌తో సిరీస్‌లో అతడిని ఓపెనర్‌గా పంపించిన విషయం తెలిసిందే. మూడు ఇన్నింగ్స్‌ల్లోనూ హాఫ్ సెంచరీలు సాధించాడు. అయితే, వన్డే ప్రపంచకప్‌లో అతడిని మిడిలార్డర్‌లోనే ఆడించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానికి కారణం కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడు. విండీస్‌ సిరీస్‌లో అతడు విశ్రాంతి తీసుకోవడంతో ఇషాన్‌కు అవకాశం లభించింది. గతేడాది రోడ్డు ప్రమాదానికి గురై విశ్రాంతి తీసుకుంటున్న రిషభ్‌ పంత్‌ స్థానాన్ని ఎడమచేతి వాటం అయిన ఇషాన్‌ కిషన్‌ రిప్లేస్‌ చేస్తాడని అంతా భావిస్తున్న వేళ అతడిని ఓపెనర్‌గా పంపించారు. ఇదే విషయంపై సల్మాన్‌ భట్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

టీ20ల్లో అంతే.. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం

‘‘ఇషాన్‌ కిషన్‌ విషయంలో ప్రయోగాలు అయోమయానికి గురి చేస్తున్నాయి. వన్డేల్లో డబుల్‌ సెంచరీ సాధించిన బ్యాటర్‌ను ఆ తర్వాత కొన్ని మ్యాచ్‌లు ఆడించలేదు. ఎందుకు అలా చేశారు? వారికి అతడు ఎప్పుడూ రెండో ఆప్షన్‌గానే ఉన్నాడు. ఒకవేళ ఒకే ఇన్నింగ్స్‌లో 1000 పరుగులు చేసినా ఇషాన్‌ పరిస్థితి అదే. ఎప్పటికీ అత్యుత్తమ ఆటగాడు అని వారికి అనిపించదు. ప్రదర్శనకు తగినంత ప్రతిఫలం దక్కదు. ఇప్పుడు విండీస్‌ సిరీస్‌లోనూ అద్భుతంగా ఆడాడు. అయినా రెండో ఆప్షన్‌గానే చూడటం జరుగుతోంది’’ అని భట్‌ వ్యాఖ్యానించాడు. 

రెండో జట్టుగా భారత్‌

అంతర్జాతీయ స్థాయిలో 200 లేదా అంతకంటే ఎక్కువ టీ20 మ్యాచ్‌లు ఆడిన రెండో జట్టుగా భారత్‌ అవతరించింది. అందరి కంటే పాకిస్థాన్‌ 223 మ్యాచ్‌లతో అగ్రస్థానంలో ఉంది. అయితే పాక్‌ కంటే భారత్‌ విజయాల శాతం ఎక్కువగా ఉండటం  విశేషం. పాక్‌ 223 మ్యాచుల్లో 135 మ్యాచుల్లో విజయం సాధించగా.. మరో 82 టీ20ల్లో ఓడింది. దీంతో విజయాల శాతం 62గా ఉంది. ఇక భారత్‌ 200 టీ20ల్లో 130 మ్యాచుల్లో గెలిచి.. 64 మ్యాచుల్లో ఓడింది. మరో ఆరు మ్యాచుల్లో ఫలితం తేలలేదు. దీంతో భారత్‌ విజయాల శాతం 65గా నమోదైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని