IND vs PAK: ‘కెప్టెన్ కూల్‌’ ధోనీ వల్ల.. ఆ గొడవకు అక్కడితో తెర: కమ్రాన్‌ అక్మల్

ప్రపంచ క్రికెట్‌లో హైఓల్టేజీ మ్యాచుల్లో దాయాదుల పోరు (IND vs PAK) తప్పక ఉంటుంది. ఆటగాళ్లూ దూకుడుగా బరిలోకి దిగుతారు. గతంలో జరిగిన ఓ సంఘటనను పాక్‌ మాజీ కెప్టెన్ కమ్రాన్ అక్మల్ గుర్తు చేశాడు.

Published : 20 Aug 2023 14:41 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత్ - పాకిస్థాన్‌ (IND vs PAK) మ్యాచ్‌ అంటే అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి. ఆటగాళ్ల మధ్య తీవ్ర పోటీ. ఒక్కోసారి సహనం కోల్పోయి మాటల యుద్ధం కూడా జరుగుతుంటుంది. అలాంటి సంఘటన 2012/13 సీజన్‌లో బెంగళూరు వేదికగా జరిగిన టీ20 మ్యాచ్‌లో చోటు చేసుకుంది. భారత వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ (Ishant Sharma), పాక్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ (Kamran Akmal) మధ్య వాగ్వాదం తీవ్ర స్థాయికి వెళ్లింది. అయితే, ‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీతోపాటు సురేశ్‌ రైనా కలగజేసుకుని ఇరువురిని శాంతింపజేయడంతో అక్కడితో వివాదం ముగిసింది. ఇదే విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూ సందర్భంగా కమ్రాన్‌ అక్మల్ గుర్తు చేశాడు.

బుమ్రా.. నీకు నాదొక సలహా: చాపెల్‌

‘‘ఇషాంత్ శర్మ అసభ్య పదం వాడాడు. తిరిగి పదాలు అనిపించుకోవాల్సి వచ్చింది. బెంగళూరు నుంచి తర్వాతి రోజు మరో టీ20 మ్యాచ్‌ కోసం మేం (పాక్‌ జట్టు) అహ్మదాబాద్‌కు వెళ్లాం. నాతోపాటు విరాట్,  షోయబ్ మాలిక్, హఫీజ్‌ కూర్చొని ఉన్నాం. బెంగళూరు మ్యాచ్‌ సందర్భంగా ఏం జరిగిందని వారిలో ఎవరో అడిగారు. ఇషాంత్‌ బౌలింగ్‌ చేసిన తర్వాత ఏదో అన్నాడు. నేను కూడా ఓ అసభ్య పదం వాడానని చెప్పా. అయితే, మ్యాచ్‌ సందర్భంగా పరిస్థితి సీరియస్‌గా మారుతుందన్నప్పుడు ‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ, సురేశ్‌ రైనా వచ్చి సర్ది చెప్పారు. దీంతో అక్కడితో వివాదానికి ముగింపు పలకాలని భావించారు. లేకపోతే పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యేది. అయితే, దాని వల్ల నేను రెండు మ్యాచ్‌ల నిషేధంతోపాటు భారీగా మ్యాచ్‌ ఫీజును జరిమానాగా ఎదుర్కొన్నా’’ అని కమ్రాన్ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని