Tilak varma: కుర్రాడు రేసులోకొచ్చాడు!

వన్డే ప్రపంచకప్‌ మొదలవడానికి ఇంకో రెండు నెలలే సమయం ఉంది. ఈ మెగా టోర్నీలో ఆడే జట్టుపై సెలక్టర్లు, టీమ్‌మేనేజ్‌మెంట్‌ ఇప్పటికే ఒక అంచనాకు వచ్చి ఉండొచ్చు! ఇలాంటి సమయంలో ఓ కుర్రాడు భారత క్రికెట్‌ వర్గాల్లో, అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాడు.

Updated : 10 Aug 2023 10:06 IST

వన్డే ప్రపంచకప్‌ మొదలవడానికి ఇంకో రెండు నెలలే సమయం ఉంది. ఈ మెగా టోర్నీలో ఆడే జట్టుపై సెలక్టర్లు, టీమ్‌మేనేజ్‌మెంట్‌ ఇప్పటికే ఒక అంచనాకు వచ్చి ఉండొచ్చు! ఇలాంటి సమయంలో ఓ కుర్రాడు భారత క్రికెట్‌ వర్గాల్లో, అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాడు. అతడివయసు 20 ఏళ్లే అయినా.. అంతర్జాతీయ అరంగేట్రం చేసి వారం రోజులే అయినా.. ఇప్పటిదాకా ఆడిన మూడు మ్యాచ్‌లు టీ20లే అయినా.. ప్రపంచకప్‌కు ఆ కుర్రాడిని పరిగణనలోకి తీసుకోవాలన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఆ యువ ఆటగాడే.. తిలక్‌ వర్మ.

ఈనాడు క్రీడావిభాగం

14 మ్యాచ్‌లు.. 397 పరుగులు.. 36.09 సగటు.. 131.02 స్ట్రైక్‌ రేట్‌.. 18 ఏళ్ల వయసులోనే ముంబయి ఇండియన్స్‌ తరఫున ఐపీఎల్‌ అరంగేట్రం చేస్తూ.. అది కూడా మిడిలార్డర్లో  ఆడుతూ హైదరాబాద్‌ కుర్రాడు తిలక్‌ వర్మ నమోదు చేసిన గణాంకాలు ఇవి. రెండో సీజన్లో మరింతగా సత్తా చాటుతూ 11 మ్యాచ్‌ల్లోనే 42.87 సగటుతో 343 పరుగులు సాధించాడు. ఈసారి స్ట్రైక్‌ రేట్‌ ఏకంగా 164.11 కావడం విశేషం. తిలక్‌ ప్రతిభ గురించి చెప్పాలంటే కేవలం గణాంకాలు చూస్తే సరిపోదు. పలు మ్యాచ్‌ల్లో జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా.. అతను   పట్టుదలతో క్రీజులో నిలిచి పరిణతితో బ్యాటింగ్‌ చేసిన తీరు.. తీవ్ర ఒత్తిడి మధ్య మేటి బౌలర్ల బంతులను స్టాండ్స్‌లోకి పంపిన వైనం.. మాజీ, దిగ్గజ క్రికెటర్లను అబ్బురపరిచింది. సునీల్‌ గావస్కర్‌, రవిశాస్త్రి లాంటి దిగ్గజాలు అతడి ప్రతిభను కొనియాడుతూ త్వరగానే టీమ్‌ఇండియాకు ఆడతాడని.. చాన్నాళ్లు జట్టులో ఉంటాడని అంచనా వేశారు. అన్నట్లే వెస్టిండీస్‌తో  టీ20 సిరీస్‌కు జట్టులోకి ఎంపికయ్యాడు తిలక్‌. వచ్చిన అవకాశాలను రెండు చేతులా     అందిపుచ్చుకుంటూ.. వరుసగా 39, 51, 49 నాటౌట్‌ స్కోర్లతో అబ్బురపరిచాడు. మూడు మ్యాచ్‌ల్లోనూ ప్రతికూల పరిస్థితుల్లో అతను చూపిన నిబ్బరం ఆకట్టుకుంది. అలవోకగా భారీ షాట్లు ఆడి అభిమానులను అలరించాడు. ఇంత చిన్న వయసులో అతను చూపిస్తున్న పరిణతి గురించి అందరూ చర్చించుకుంటున్నారు. టీమ్‌ఇండియాకు వివిధ ఫార్మాట్లలో దీర్ఘ కాలం ఆడగల సత్తా ఉందంటూ ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే తిలక్‌.. అక్టోబరులో మొదలయ్యే ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్‌లో ఆడతాడా అన్న చర్చ మొదలైంది.

అవకాశం లేకపోలేదు: తిలక్‌ ప్రపంచకప్‌లో ఆడే అవకాశాలను కొట్టిపారేయలేం.  అతడికి కలిసొచ్చే అంశాలు చాలానే ఉన్నాయి. తిలక్‌ సామర్థ్యమేంటో ఐపీఎల్‌తోనే రుజువైంది. టీ20లు అనగానే అడ్డదిడ్డంగా షాట్లు ఆడే రకం కాదతను. మంచి టెక్నిక్‌ ఉంది. దానికి బలాన్ని జోడించి ఎలాంటి స్థితిలో అయినా షాట్లు ఆడగల సామర్థ్యం అతడి సొంతం. పరిస్థితులకు తగ్గట్లు సంయమనంతోనూ ఆడగలడు. ఎక్కువసేపు క్రీజులో నిలుస్తాడు. ఒత్తిడి అధికంగా ఉండే మిడిలార్డర్లోనే అతను రాణించాడు. మ్యాచ్‌లను  ముగించగల నైపుణ్యాన్ని చాటాడు. ధోని తర్వాత మంచి ఫినిషర్‌ లేని లోటు టీమ్‌ఇండియాను వెంటాడుతోంది. ఆట పరంగా తిలక్‌లో లోపాలేమీ కనిపించట్లేదు. వన్డేలకు కూడా సరిపోయే ఆటే తనది. ఎడమ చేతి వాటం కావడం తిలక్‌కు బాగా కలిసొచ్చే విషయం. ప్రస్తుతం టీమ్‌ఇండియాలో లెఫ్ట్‌హ్యాండర్లు తగ్గిపోయారు. ఇషాన్‌ కిషన్‌ మినహాయిస్తే ప్రధాన బ్యాటర్లలో ఎడమ చేతి వాటం ఆటగాళ్లు లేరు. మరోవైపు వన్డే జట్టులో రెగ్యులర్‌ ఆటగాళ్లుగా ఉన్న కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ గాయాల నుంచి కోలుకునే ప్రయత్నంలో ఉన్నారు. వారి ఫిట్‌నెస్‌ మీద ఇప్పటికీ భరోసా లేదు. కొన్ని నెలల పాటు గాయాలతో మైదానానికి దూరంగా ఉన్న ఆ ఇద్దరినీ ప్రపంచకప్‌కు ఎంపిక చేస్తారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు సూర్యకుమార్‌ యాదవ్‌ వన్డేల్లో సత్తా చాటుకోలేకపోయాడు. ఈ పరిస్థితుల్లో తిలక్‌ నిలకడను కొనసాగిస్తే ప్రపంచకప్‌కు కచ్చితంగా రేసులో ఉంటాడు. ప్రస్తుత టీ20 ప్రదర్శన ఆధారంగా తిలక్‌ను వన్డే ఫార్మాట్లో జరిగే ఆసియా కప్‌కు ఎంపిక చేస్తే.. అందులోనూ అతను సత్తా చాటితే ప్రపంచకప్‌ టికెట్‌ సంపాదించినట్లే.

‘‘వెస్టిండీస్‌తో టీ20ల్లో తిలక్‌ ఆట నన్నెంతో ఆకట్టుకుంది. అలాంటి కుర్రాడు మ్యాచ్‌లను ముగిస్తుంటే చూడటం బాగుంది. ఇప్పుడు వన్డే జట్టు కోసం భారత్‌ పరిశీలించదగ్గ ఆటగాళ్లలో తిలక్‌ వర్మ ఒకడు. టీ20ల్లో తిలక్‌ పరిణతి చూస్తే వన్డేలకూ సరిపోతాడని అనిపిస్తోంది. శ్రేయస్‌, రాహుల్‌ ఇంకా ఆటకు సిద్ధంగా లేరంటున్న నేపథ్యంలో తిలక్‌ వర్మను ఎందుకు ఎంపిక చేయకూడదు? పైగా అతడిది ఎడమచేతి వాటం కూడా’’

 వసీమ్‌ జాఫర్‌, టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని