T20 World Cup: ఇక ప్రపంచమంతా ధనాధన్‌

ఓ అంకం ముగిసింది. రెండు నెలల పాటు ఉర్రూతలూగించిన ఐపీఎల్‌ ముగిసింది. కానీ అభిమానులు చింతించాల్సిన పని లేదు. వినోదానికేమీ కొదువ లేదు.

Updated : 28 May 2024 14:17 IST

మరో 5రోజుల్లో టీ20 ప్రపంచకప్‌
ఈనాడు క్రీడావిభాగం

ఓ అంకం ముగిసింది. రెండు నెలల పాటు ఉర్రూతలూగించిన ఐపీఎల్‌ ముగిసింది. కానీ అభిమానులు చింతించాల్సిన పని లేదు. వినోదానికేమీ కొదువ లేదు. మరింత భారీ స్థాయిలో, మరింత తీవ్రతతో క్రికెట్‌ ప్రేమికులను అలరించడానికి విశ్వవేదిక సిద్ధమైంది. ధనాధన్‌ ఆటను వీక్షించడానికి మరీ ఎక్కువ రోజులు నిరీక్షించాల్సిన అవసరమేమీ లేదు. అమెరికా, వెస్టిండీస్‌ వేదికగా మరో 5 రోజుల్లో టీ20 ప్రపంచకప్‌ ఆరంభం కానుంది. 20 జట్లు 55 మ్యాచ్‌ల్లో క్రికెట్‌ ప్రేమికులను అలరించే ఈ టోర్నీ వివరాలేంటో చూద్దామా!


ఫార్మాట్‌ ఇది

భారత కాలమానం ప్రకారం జూన్‌ 2న టోర్నమెంట్‌ ఆరంభమవుతుంది. మొత్తం 20 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. గ్రూపులో ప్రతి జట్టు ఇంకో జట్టుతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్‌ 8కు అర్హత సాధిస్తాయి. అక్కడ జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. సూపర్‌ 8లో ఒక్కో గ్రూపులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్లో ప్రవేశిస్తాయి.


టై అయితే..

టీ20 ప్రపంచకప్‌లో మ్యాచ్‌ టై అయితే.. ఫలితం కోసం సూపర్‌ ఓవర్‌ను నిర్వహిస్తారు. అది కూడా టైగా ముగిస్తే.. మళ్లీ సూపర్‌ ఓవర్‌ ఆడతారు. మళ్లీ టై అయితే మళ్లీ సూపర్‌ ఓవర్‌. ఇలా ఫలితం తేలే వరకు సూపర్‌ ఓవర్‌ ఆడుతూనే ఉంటారు.


వర్షం పడితే..

గ్రూప్, దశ సూపర్‌ 8 దశలో వర్షం, ప్రతికూల వాతావరణం వల్ల సమయం వృథా అయితే కనీసం 5 ఓవర్ల మ్యాచ్‌ను నిర్వహిస్తారు. సెమీఫైనల్స్, ఫైనల్‌కు మాత్రం జట్లు కనీసం 10 ఓవర్లు ఆడాల్సివుంటుంది. గ్రూప్, సూపర్‌ 8 దశలో కనీస ఓవర్లు సాధ్యం కాకపోతే మ్యాచ్‌ రద్దవుతుంది. తొలి సెమీఫైనల్, ఫైనల్‌కు 190 నిమిషాల అదనపు సమయం, రిజర్వ్‌డేలు ఉన్నాయి. రెండో సెమీఫైనల్‌కు మాత్రం రిజర్వ్‌ డే లేదు. ఆ మ్యాచ్‌కు, ఫైనల్‌కు మధ్య ఒక్క రోజు విరామం మాత్రమే ఉండడం అందుకు కారణం. కానీ రెండో సెమీఫైనల్‌ ఫలితం తేలడం కోసం 250 నిమిషాల అదనపు సమయం కేటాయించారు. భారత్‌ నాకౌట్స్‌ చేరితే గయానాలో రెండో సెమీఫైనల్‌ ఆడుతుంది. ఈ మ్యాచ్‌ వేళలు (రాత్రి 8 గంటలకు ప్రారంభం) భారత ప్రేక్షకులకు అనుకూలంగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అదే ట్రినిడాడ్‌లో జరిగే తొలి సెమీఫైనల్‌ అయితే భారత కాలమానం ప్రకారం ఉదయం 6 గంటలకు మొదలవుతుంది. ఫైనల్‌ మ్యాచ్‌ బార్బడోస్‌ వేదికగా భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మొదలవుతుంది. 


అమెరికాలో తొలిసారి..

ఐసీసీ గత కొన్నేళ్లుగా క్రికెట్‌ ప్రాచుర్యాన్ని పెంచడం కోసం విశేషంగా కృషి చేస్తోంది. ముఖ్యంగా అమెరికాలో క్రికెట్‌ వ్యాప్తికి మంచి అవకాశముందన్న ఉద్దేశంతో ఈసారి ఆ దేశంలో టీ20 ప్రపంచకప్‌ను నిర్వహిస్తోంది. మరి బేస్‌బాల్‌ను అమితంగా ఇష్టపడే అమెరికాలో క్రికెట్‌ ఎంత మేర చొచ్చుకుపోగలదన్నది ప్రశ్న. ఐసీసీ మాత్రం యుఎస్‌ఏ మార్కెట్‌పై ఆశాభావంతో ఉంది. ఆ దేశంలో దాదాపు మూడు కోట్ల మంది క్రికెట్‌ అభిమానులు ఉన్నారన్నది దాని అంచనా. 2028లో లాస్‌ ఏంజిలెస్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ కూడా ఉన్న నేపథ్యంలో ఈ ప్రపంచకప్‌ పెద్ద ముందడుగుగా భావిస్తోంది. అమెరికాలో అభిమానులను ఆకర్షించేందుకు ఐసీసీ అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. దిగ్గజ స్ప్రింటర్‌ ఉసేన్‌ బోల్ట్‌ను ప్రపంచకప్‌ రాయబారిగా నియమించడమే కాకుండా.. మియామిలో జరిగిన ఫార్ములా 1 రేసులో టోర్నీ గురించి ప్రచారం చేసింది. అయితే ఓ సగటు అమెరికా పౌరుడి దృష్టిని బేస్‌బాల్, ఎన్‌ఎఫ్‌ఎల్, ఎన్‌బీఏల నుంచి మరల్చడం అంత తేలిక కాదు. ఆ దేశంలో కింది స్థాయి నుంచి క్రికెట్‌ ఎదగాల్సివుంది. ఈ ప్రపంచకప్‌లో అమెరికా జట్టు కూడా ఆడుతుండడం ఆ దేశంలో ఎంత మేర ఆసక్తిని పెంచుతుందో చూడాలి. భారత్, పాకిస్థాన్‌ మ్యాచ్‌తో పాటు మొత్తం 16 టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లకు యుఎస్‌ఏ ఆతిథ్యమివ్వనుంది.


ఏ గ్రూపులో ఏ జట్టు

గ్రూప్‌-ఎ: భారత్, కెనడా, ఐర్లాండ్, పాకిస్థాన్, అమెరికా

గ్రూప్‌-బి: ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, నమీబియా, ఒమన్, స్కాట్లాండ్‌

గ్రూప్‌-సి: అఫ్గానిస్థాన్, న్యూజిలాండ్, పపువా న్యూ గినియా, ఉగాండా, వెస్టిండీస్‌

గ్రూప్‌-డి: బంగ్లాదేశ్, నేపాల్, నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, శ్రీలంక


9 వేదికల్లో

అమెరికా, వెస్టిండీస్‌లలో మొత్తం 9 వేదికల్లో టీ20 ప్రపంచకప్‌ జరుగుతుంది. అమెరికా ప్రపంచకప్‌కు ఆతిథ్యమివ్వడం ఇదే మొదటిసారి. అమెరికాలో ఫ్లోరిడా, టెక్సాస్, న్యూయార్క్‌లు వేదికలు. మొత్తం 55 ప్రపంచకప్‌ మ్యాచ్‌ల్లో 16 యుఎస్‌ఏలో జరుగుతాయి. మిగతా మ్యాచ్‌లకు వెస్టిండీస్‌లోని అంటిగ్వా-బార్బుడా, బార్బడోస్, గయానా, సెయింట్‌ లూసియా, సెయింట్‌ విన్సెంట్‌-గ్రెనెడైన్స్, ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో ఆతిథ్యమిస్తాయి. గ్రూప్‌-ఎ మ్యాచ్‌లన్నీ అమెరికాలోనే జరుగుతాయి. నాకౌట్‌ మ్యాచ్‌లన్నింటికీ వెస్టిండీసే ఆతిథ్యమిస్తుంది. ఉదయం 5 గంటలు, 6 గంటలు, రాత్రి 8 గంటలు, 10.30.. ఇలా భిన్న సమయాల్లో మ్యాచ్‌లు ఆరంభం కానున్నాయి. అర్ధరాత్రి 12.30కు మొదలయ్యే మ్యాచ్‌లూ ఉన్నాయి. అయితే భారత్‌ మ్యాచ్‌లు ఆరంభమయ్యేది మాత్రం రాత్రి 8 గంటలకే.


భారత్‌ మ్యాచ్‌లు ఎప్పుడంటే..

జూన్‌ 5న న్యూయార్క్‌లో ఐర్లాండ్‌తో పోరుతో టీమ్‌ఇండియా తన ప్రపంచకప్‌ వేటను ఆరంభిస్తుంది. ఆ తర్వాత న్యూయార్క్‌లోనే జూన్‌ 9న పాకిస్థాన్‌తో, జూన్‌ 12న అమెరికాతో తలపడుతుంది. భారత్‌ తన ఆఖరి గ్రూప్‌ మ్యాచ్‌ను జూన్‌ 15న కెనడాతో ఆడుతుంది. ఈ మ్యాచ్‌లన్నీ రాత్రి 8 గంటలకు ఆరంభమవుతాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని