Chennai Vs Lucknow: ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్‌

లఖ్‌నవూ చేతిలో చెన్నైకి వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఈసారి సొంత మైదానంలోనే పరాజయం పొందడంతో ఆ జట్టు అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. 

Published : 24 Apr 2024 14:45 IST

ఇంటర్నెట్ డెస్క్: నాలుగు రోజుల వ్యవధిలో చెన్నై జట్టును లఖ్‌నవూ (Chennai Vs Lucknow) రెండుసార్లు ఓడించింది. చెపాక్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లోనూ లఖ్‌నవూ భారీ టార్గెట్‌ను ఛేదించింది. తమ జట్టు కెప్టెన్ రుతురాజ్‌ గైక్వాడ్ సెంచరీ చేసినా.. చివరి ఓవర్‌ వరకూ సాగిన మ్యాచ్‌లో ఓడిపోవడం తీవ్ర నిరాశకు గురి చేసిందని కోచ్‌ స్టీఫెన్ ఫ్లెమింగ్‌ వ్యాఖ్యానించాడు. ఈ మ్యాచ్‌లో అస్త్రాలన్నీ పేలలేదని..  సరైన కాంబినేషన్‌ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించాడు. 

‘‘రుతురాజ్‌ అద్భుతంగా ఆడాడు. ఇదే ఫామ్‌ను టోర్నీ ఆసాంతం కొనసాగిస్తాడని ఆశిస్తున్నా. ఈ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించలేకపోయాం. కానీ, ప్రతిసారీ అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తాం. సీనియర్ బౌలర్ ముస్తాఫిజుర్ స్థానంలో ప్రత్యామ్నాయం చూస్తున్నాం. బ్యాటింగ్‌పరంగానూ మేం సరైన కాంబినేషన్‌ కోసం చూస్తున్నాం. అందుకే, ప్రయోగాలు చేస్తూ పోతున్నాం. ఇప్పటికిప్పుడు కాకుండా భవిష్యత్తు కోసం నిర్ణయం తీసుకుంటాం. లఖ్‌నవూతో మ్యాచ్‌పై మంచు ప్రభావం చూపింది. స్టాయినిస్‌ మాపై ఆధిపత్యం ప్రదర్శించాడు. ఒత్తిడిలో మేం కొన్ని తప్పిదాలకు పాల్పడ్డాం’’ అని ఫ్లెమింగ్‌ తెలిపాడు. 

ధోనీ ఇచ్చిన మెసేజ్‌ ఇదే: స్టాయినిస్‌

గతంలో ఎంఎస్ ధోనీ (MS Dhoni) తనకు ఇచ్చిన సందేశం ఉపయోగపడిందని లఖ్‌నవూ బ్యాటర్ స్టాయినిస్‌ వ్యాఖ్యానించాడు. ఈ వీడియోను ఫ్రాంచైజీ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. అందులో స్టాయినిస్‌ మాట్లాడుతూ.. ‘‘ భారీ లక్ష్యాలను ఛేదించే క్రమంలో ధోనీ ఇచ్చిన సూచనలు అద్భుతం. అలాంటి సమయంలో ఎలా ఆలోచిస్తామనేది చాలా ముఖ్యం. క్రీజ్‌లోకి వచ్చినప్పుడు ప్రతిఒక్కరూ అదనంగా ఏదైనా చేయాలి. విభిన్నంగా ఆడాలి అనుకుంటూ ఉంటారు. కానీ, ధోనీ మాత్రం వేరు. క్లిష్ట సమయాల్లో తనకు తానే సర్దిచెప్పుకొనే విధానం బాగుంది. ‘నిశ్చలంగా క్రీజ్‌లో ఉండాలి. ప్రతిఒక్కరూ మారతారు. నేను మాత్రమే ఇక్కడ ఉంటా. కానీ, అందరికంటే ముందుండాలి’ అని స్టాయినిస్‌ వ్యాఖ్యానించాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని