IND vs ENG: ముగిసిన మూడో రోజు ఆట.. భారత్‌కు ఇంకా 152 పరుగులు అవసరం

నాలుగో టెస్టులో భారత్‌ పట్టు బిగించింది. తొలుత ఇంగ్లాండ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేసి.. లక్ష్య ఛేదనలోనూ దూకుడు ప్రదర్శిస్తోంది.

Updated : 25 Feb 2024 17:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో (IND vs ENG) భారత్ పట్టు బిగించింది. పర్యటక జట్టును తక్కువ పరుగులకే కట్టడి చేసిన టీమ్‌ఇండియా.. టార్గెట్‌ వైపు దూసుకుపోతోంది. ఇంగ్లాండ్‌ నిర్దేశించిన 192 పరుగుల లక్ష్యఛేదనలో మూడో రోజు ఆట ముగిసేసమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. క్రీజ్‌లో రోహిత్ శర్మ (24*), యశస్వి జైస్వాల్ (16*) ఉన్నారు. టీమ్‌ఇండియా విజయానికి ఇంకా 152 పరుగులు అవసరం. మరో రెండు రోజుల సమయం ఉన్న నేపథ్యంలో గెలవడం పెద్ద కష్టమేం కాదు. కానీ, నాలుగో రోజు తొలి సెషన్‌లో కాసేపు ఇంగ్లాండ్‌ బౌలర్లను అడ్డుకోగలిగితే విజయం తేలికవుతుంది.

 

అశ్విన్‌కు ఐదు వికెట్లు.. 

భారత స్పిన్నర్లు అదరగొట్టారు. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ను 145 పరుగులకే ఆలౌట్ చేశారు. రవిచంద్రన్ అశ్విన్ (5/51), కుల్‌దీప్‌ యాదవ్ (4/22), రవీంద్ర జడేజా (1/56) వికెట్లు తీశారు. జాక్‌ క్రాలే (60) హాఫ్‌ సెంచరీ సాధించగా.. జానీ బెయిర్‌ స్టో (30), బెన్‌ ఫోక్స్ (17) కాస్త ఫర్వాలేదనిపించారు.  తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం 46 పరుగులతో కలిపి భారత్‌ ఎదుట ఇంగ్లాండ్‌ 206 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. మొదటి ఇన్నింగ్స్‌లో పర్యటక జట్టు 353 పరుగులు చేయగా.. టీమ్‌ఇండియా 307 పరుగులకు ఆలౌటైంది.

కాపాడిన ధ్రువ్‌..

ఓవర్‌నైట్‌ 219/7 స్కోరుతో ఇవాళ ఆటను ప్రారంభించిన భారత్‌ను కుల్‌దీప్ (28) - ధ్రువ్‌ జురెల్ (90) జోడీ ఆదుకుంది. వీరిద్దరూ ఎనిమిదో వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. కుల్‌దీప్‌ ఔటైనప్పటికీ.. ఆకాశ్‌ దీప్‌ (9)తో కలిసి ధ్రువ్‌ టీమ్‌ఇండియా స్కోరు 300+ దాటేసింది. అయితే, సెంచరీకి పది పరుగుల దూరంలో టామ్ హార్ట్‌లీ బౌలింగ్‌లో బౌల్డ్‌ కావడంతో భారత ఇన్నింగ్స్‌ ముగిసింది. యశస్వి జైస్వాల్ (73), శుభ్‌మన్‌ గిల్ (38) ఫర్వాలేదనిపించారు. షోయబ్‌ బషీర్‌ (5/119) ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. టామ్ హార్ట్‌లీ 3, జేమ్స్‌ అండర్సన్ 2 వికెట్లు తీశారు. భారత్ 88 పరుగులు జోడించి ఆఖరి మూడు వికెట్లను కోల్పోయింది. 

మరికొన్ని విశేషాలు..

  • మూడో రోజు టీ బ్రేక్‌ తర్వాత ఇంగ్లాండ్‌ ఐదు వికెట్లను కోల్పోయింది. 120/5 స్కోరుతో మూడో సెషన్‌ను ప్రారంభించిన ఇంగ్లాండ్‌ మరో 25 పరుగులు మాత్రమే జోడించి ఆలౌటైంది. 
  • రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం ఇది 35వసారి. ఈ జాబితాలో కుంబ్లేతో సమంగా నిలిచాడు. అయితే, అశ్విన్‌ 99 మ్యాచుల్లో సాధించగా.. కంబ్లే 132 టెస్టులు తీసుకున్నాడు. ఈ లిస్ట్‌లో ముత్తయ్య మురళీధరన్ 133 టెస్టుల్లో 67 సార్లు, షేన్ వార్న్ 145 టెస్టుల్లో 37 సార్లు ఫైఫర్ తీశారు.
  • బెన్‌ స్టోక్స్ - మెక్‌కల్లమ్‌ సారథ్యంలో ఇంగ్లాండ్‌ 3 రన్‌రేట్‌ కంటే తక్కువగా పరుగులు చేయడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు అత్యల్పంగా 3.13 రన్‌రేట్‌తో చేయగా.. ఈ మ్యాచ్‌లో 2.69 రన్‌రేట్‌తోనే ఆడటం గమనార్హం. 
  • భారత్‌ వేదికగా టెస్టుల్లో పర్యటక జట్టు ఏదీ 200 కంటే తక్కువైన టార్గెట్‌ను కాపాడుని గెలిచిన దాఖలాలు లేవు. ఇప్పటి వరకు 32 సందర్భాల్లో మూడుస్లారు డ్రా కాగా.. 29 మ్యాచుల్లో ఓటములను చవిచూశాయి. 
  •  భారత కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టుల్లో 4000+ పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 58 టెస్టుల్లో ఈ ఘనతను సాధించాడు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని