IND vs ENG: ఆకాశ్‌కు మూడు వికెట్లు.. రూట్‌ సెంచరీ.. ముగిసిన తొలి రోజు ఆట

నాలుగో టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆటలో భారత్ - ఇంగ్లాండ్‌ జట్లు  సరిసమానంగా నిలిచాయి. ఆతిథ్య జట్టు ఏడు వికెట్లు తీస్తే.. ఇంగ్లాండ్‌ 300+ స్కోరు చేసింది.

Updated : 23 Feb 2024 17:39 IST

ఇంటర్నెట్ డెస్క్‌: రాంచీ వేదికగా ప్రారంభమైన (IND vs ENG) నాలుగో టెస్టు మొదటి రోజు ఆట ముగిసింది. భారత అరంగేట్ర బౌలర్‌ ఆకాశ్ దీప్‌ (3/70) అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అయితే, కష్టాల్లో పడిన ఇంగ్లాండ్‌ను జో రూట్ (106*) సెంచరీతో ఆదుకున్నాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్‌ ఏడు వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. క్రీజ్‌లో జో రూట్‌తోపాటు ఓలీ రాబిన్‌సన్ (31*) ఉన్నాడు. వీరిద్దరూ ఎనిమిదో వికెట్‌కు 57 పరుగులు జోడించారు. అంతకుముందు ఓపెనర్‌ జాక్‌ క్రాలే (42), జానీ బెయిర్‌ స్టో (38), బెన్ ఫోక్స్ (47) విలువైన పరుగులు సాధించారు. భారత బౌలర్లలో ఆకాశ్‌ 3, సిరాజ్‌ 2.. అశ్విన్, రవీంద్ర జడేజా చెరో వికెట్‌ తీశారు.

అదరగొట్టిన కొత్త బౌలర్‌.. 

భారత్‌ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ఆకాశ్‌ దీప్‌ తొలి ఓవర్‌ నుంచే అదరగొట్టాడు. పదునైన బంతులతో ఇంగ్లాండ్‌ బ్యాటర్లను ఇబ్బందికి గురి చేశాడు. ఓవైపు జాక్‌ క్రాలే దూకుడుగా ఆడుతున్నా.. మరోవైపు బెన్‌ డకెట్‌ (11) మాత్రం ఆకాశ్‌ బౌలింగ్‌లో పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డాడు. ఒకే ఓవర్‌లో డకెట్‌తోపాటు ఓలీ పోప్‌ (0)ను ఔట్‌ చేసి భారత్‌కు శుభారంభం అందించాడు. తన రెండో ఓవర్‌లోనే క్రాలేను బౌల్డ్‌ చేశాడు. అయితే, అది నోబాల్‌. దీంతో తనకొచ్చిన ఛాన్స్‌ను క్రాలే సద్వినియోగం చేసుకుని ఎటాకింగ్‌ గేమ్ ఆడాడు. చివరికి ఆకాశ్‌ బౌలింగ్‌లోనే క్రాలే క్లీన్‌బౌల్డ్‌ అయి పెవిలియన్‌కు చేరాడు. 

కాపాడిన రూట్..

గత మూడు టెస్టుల్లో గొప్ప ప్రదర్శన చేయలేకపోయిన జో రూట్‌.. ఈసారి మాత్రం క్రీజ్‌లో పాతుకుపోయాడు. బజ్‌బాల్‌ ఆడొద్దని ఇంగ్లాండ్‌ మాజీలు చేసిన సూచనలను పాటించాడేమో తనదైన ఆటతీరుతో సెంచరీ సాధించాడు.  ఓవైపు వికెట్లు పడుతున్నా అతడు మాత్రం నింపాదిగా ఆడేశాడు. ఈక్రమంలో భారత్‌పై అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. కేవలం 52 ఇన్నింగ్స్‌ల్లోనే 10 శతకాలు చేశాడు. స్టీవ్‌ స్మిత్ (9 సెంచరీలు) పేరిట ఉన్న ఈ రికార్డును అధిగమించాడు. బెన్‌ ఫోక్స్‌తో కలిసి ఆరో వికెట్‌కు 113 పరుగులు, టామ్‌ హార్ట్‌లీతో ఏడో వికెట్‌కు 20 పరుగులు, ఓలీ రాబిన్‌సన్‌తో కలిసి రూట్‌ ఎనిమిదో వికెట్‌కు 57 పరుగులు జోడించాడు. రూట్‌ లేకపోతే ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌ ఎప్పుడో ముగిసేది.

మరికొన్ని విశేషాలు.. 

  • అరంగేట్రం చేసిన టెస్టులోనే ఆకాశ్ దీప్‌ తొలి ముగ్గురు బ్యాటర్లను పెవిలియన్‌కు చేర్చాడు. ఓపెనర్లు జాక్‌ క్రాలే, బెన్‌ డకెట్, ఓలీ పోప్‌ను ఔట్‌ చేశాడు.
  • ఈ మ్యాచ్‌లో ఇప్పటి వరకు ఒక్క వికెట్‌ తీసిన అశ్విన్‌ మరో అరుదైన ఘనత సాధించాడు. ఒక జట్టుపై 1000+ పరుగులు, 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా అవతరించాడు. 
  • జో రూట్‌ అత్యంత నెమ్మదైన సెంచరీ చేయడం ఇది మూడోసారి. ఇప్పుడు 219 బంతుల్లో శతకం చేశాడు. అంతకుముందు న్యూజిలాండ్‌పై హామిల్టన్ (2019) 259 బంతులు, ఆసీస్‌పై లార్డ్స్‌లో (2013) 247 బంతులు తీసుకున్నాడు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని