Team India Head Coach: గంభీర్‌ మంచి ఛాయిసే.. స్టార్లను డీల్‌ చేయగలడు: గంగూలీ

భారత ప్రధాన కోచ్‌గా ఎవరు వస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జులై 1 నుంచి ఈ బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది.

Published : 01 Jun 2024 14:19 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్‌ (Gautam Gambhir) ఎంపిక లాంఛనప్రాయమేనని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్ (Rahul Dravid) పదవీకాలం జూన్ చివరితో ముగుస్తుంది. గంభీర్‌ను ప్రకటించడం ఖాయమనే వార్తలూ వస్తున్నాయి. మరోవైపు బీసీసీఐ నుంచి ఎలాంటి స్పందనా లేదు. మాజీ క్రికెటర్లు మాత్రం తమ శైలిలో విశ్లేషణలు చేస్తున్నారు. తాజాగా టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ (Sourav Ganguly) కూడా గంభీర్‌ వైపు మొగ్గు చూపుతూనే.. కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం గంభీర్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (Kolkata Knight Riders) జట్టు మెంటార్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. 

‘‘గంభీర్‌ దరఖాస్తు చేసుకున్నాడో లేదో తెలియదు. ఒకవేళ అతడిని ఎంపిక చేస్తే మాత్రం మంచి నిర్ణయమే అవుతుంది. చాలా నిజాయతీపరుడు. గేమ్‌ను అర్థం చేసుకోగల నేర్పరి. కోల్‌కతాను విజయవంతంగా నడిపిన మెంటార్. భారత జట్టుకు ప్రధాన కోచ్‌ అవడానికి అన్ని లక్షణాలు అతడిలో ఉన్నాయి. అయితే, ఇక్కడ ఒక్క విషయం చెప్పదల్చుకున్నా.. ఓ ఫ్రాంచైజీ టీమ్‌ను మానిటరింగ్‌ చేయడం, అంతర్జాతీయ జట్టుకు కోచ్‌గా వ్యవహరించడం రెండూ విభిన్నమైన పాత్రలు పోషించాల్సి ఉంటుంది. భారత్‌ వంటి భారీ అంచనాలు కలిగిన టీమ్‌ విషయంలో ఇంకాస్త ఒత్తిడి ఉంటుంది. 

గౌతమ్‌ గంభీర్‌కు ఇలాంటివాటిపై పూర్తి అవగాహన ఉంది. విరాట్, రోహిత్ వంటి స్టార్లను ఎలా డీల్‌ చేయాలనేది తెలుసు. డ్రెస్సింగ్‌ రూమ్‌ పరిస్థితులను త్వరగా అలవర్చుకుని కలిసిపోతాడు. కేవలం అతడి ఉద్దేశాలను మాత్రమే కాకుండా జట్టులోని సభ్యుల ఆలోచనలనూ పరిగణనలోకి తీసుకుంటాడు. తప్పకుండా గొప్ప హెడ్‌ కోచ్‌ అవుతాడనడంలో సందేహం లేదు. అయితే, ఈ పదవిని తీసుకోవడానికి అతడు అంగీకరిస్తాడా? లేదా? అనేది ఆసక్తికరమే. వస్తే మాత్రం.. జట్టులో మంచి మార్పు తీసుకొస్తాడు’’ అని గంగూలీ తెలిపాడు. కొత్తగా బాధ్యతలు చేపట్టే వ్యక్తి 2027 వన్డే ప్రపంచ కప్‌ వరకు కొనసాగుతాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని