Gautam Gambhir: క్రికెట్‌లో ‘కష్టమైన బంతి’ అంటూ ఏమీ ఉండదు..: గంభీర్

భారీ మొత్తం వెచ్చించి దక్కించుకున్న క్రికెటర్ ఆరంభంలో ఇబ్బందిపడినా.. జట్టుకు అవసరమైన సమయంలో తమ సత్తా చాటితేనే ‘స్టార్‌’గా మారతాడు. 

Published : 01 Jun 2024 16:33 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2024 సీజన్‌లో కోల్‌కతా పేసర్ మిచెల్ స్టార్క్‌ నాకౌట్‌లో అత్యుత్తమ బౌలింగ్‌తో అదరగొట్టాడు. మరీ ముఖ్యంగా ఫైనల్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మను క్లీన్‌ బౌల్డ్‌ చేసిన బంతిని ఎవర్‌గ్రీన్‌గా క్రికెట్ విశ్లేషకులు ప్రశంసలు కురిపించారు. తొలి క్వాలిఫయర్‌లోనూ కీలక వికెట్లు తీసి కేకేఆర్‌ విజయంలో ముఖ్య భూమిక పోషించాడు. 

‘‘నేను మొదటినుంచి చెబుతున్నమాట ఒక్కటే. మిచెల్ స్టార్క్ మాకు అత్యంత కీలకమైన బౌలర్. ఆరంభంలో ఇక్కడ అలవాటుపడటానికి సమయం తీసుకున్నాడు. కానీ, సరైన సమయంలో లయను అందిపుచ్చుకున్నాడు. ఐపీఎల్‌లో భారీ మ్యాచుల్లో అంటే ఏంటి? తొలి క్వాలిఫయర్‌, ఫైనల్‌. ఇక్కడ రాణిస్తే చాలు కప్ రావడం ఖాయం. మా జట్టు విషయంలో అదే జరిగింది. వీరంతా ఎలా స్టార్లు అయ్యారనే దానికి ఇదొక ఉదాహరణ. ఇక్కడ డబ్బుకు సంబంధం లేదు. జట్టుకు స్టార్క్‌ అందించిన ప్రదర్శన అత్యంత ముఖ్యం. 

చాలామంది అభిషేక్ శర్మను ఔట్ చేసిన బంతిపై స్పందించారు. ఇలాంటి బంతిని సంధించిన బౌలర్‌ను అభినందించకుండా ఉండలేం. క్రికెట్‌లో అతితక్కువ బంతులను మాత్రమే.. అబ్బో దీనిని ఎదుర్కోవడం చాలా కష్టం అనిపిస్తాయి. స్టార్క్‌ వేసిన బంతి ఆ కోవలోకే వస్తుంది. కొందరు ఎందుకు అంత వెచ్చించారని ప్రశ్నలు సంధించారు. కానీ, స్టార్క్‌ మా ‘ఎక్స్‌’ ఫ్యాక్టర్‌’’ అని గంభీర్‌ వెల్లడించాడు. ఈ ఆసీస్‌ స్టార్ పేసర్ ఐపీఎల్ 2024 సీజన్‌లో 17 వికెట్లు తీశాడు. తొలి క్వాలిఫయర్‌లో మూడు, ఫైనల్‌ మ్యాచ్‌లో 2 వికెట్లు పడగొట్టాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని