తెలుగమ్మాయి.. ఓ సాహసం

హిమాలయాలు.. ఈ పేరు వినగానే మంచు పర్వతాలు, ప్రకృతి సోయగాలు, అందమైన సరస్సులు స్పురిస్తాయి. ఎంచక్కా మంచు కొండల్లో తిరుగుతూ ప్రకృతి అందాల్ని ఆస్వాదించాలన్న ఆలోచన వస్తుంది.

Updated : 25 Aug 2023 09:18 IST

ఈనాడు - హైదరాబాద్‌

హిమాలయాలు.. ఈ పేరు వినగానే మంచు పర్వతాలు, ప్రకృతి సోయగాలు, అందమైన సరస్సులు స్పురిస్తాయి. ఎంచక్కా మంచు కొండల్లో తిరుగుతూ ప్రకృతి అందాల్ని ఆస్వాదించాలన్న ఆలోచన వస్తుంది. కాని ఆ అమ్మాయి మాత్రం హిమాలయాల్ని తన ఆశయ సాధనకు మార్గంగా ఎంచుకుంది. ఎముకలు కొరికే చలిలో ‘ద గ్రేట్‌ హిమాలయన్‌ అల్ట్రా రేసు’ను దిగ్విజయంగా పూర్తిచేసి యువతకు స్ఫూర్తిగా నిలవాలని భావిస్తోంది తెలుగమ్మాయి మారపరెడ్డి నిహారిక రెడ్డి.

న్‌స్పైర్‌ ఇండియా నిర్వహిస్తున్న హిమాలయన్‌ అల్ట్రా రేసుకు సైక్లిస్ట్‌ నిహారిక సిద్ధమైంది. లేహ్‌ నుంచి ద్రాస్‌ వరకు.. మళ్లీ ద్రాస్‌ నుంచి లేహ్‌ చేరుకునే అల్ట్రా రేసు శనివారం తెల్లవారుజామున ప్రారంభమై ఆదివారం సాయంత్రం ముగుస్తుంది. లేహ్‌ నుంచి ద్రాస్‌ మధ్యలో కార్గిల్‌ ఉంటుంది. మొత్తం 600 కిలోమీటర్ల యాత్ర. ఆరంభం నుంచి ముగింపు వరకు ఆగకుండా యాత్ర కొనసాగించడమే అల్ట్రా రేసు ఉద్దేశం. 34 గంటల్లో రేసును ముగించాలని నిహారిక లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఆమె వయసు 17 ఏళ్లే కావడంతో మెంటార్‌ కం కోచ్‌ సుధాకర్‌రెడ్డితో కలిసి జట్టుగా రేసుకు శ్రీకారం చుట్టనుంది. వేడి వాతావరణం నుంచి రక్తం గడ్డకట్టే చలి ఉండే ప్రదేశానికి చేరుకోవడమే ఈ రేసులో అతిపెద్ద సవాల్‌. రేసు మొత్తంలో నిహారిక సముద్ర మట్టానికి 10380 మీటర్ల ఎత్తును అధిగమించాల్సి ఉండటం మరో పరీక్ష. ఈ వాతావరణంలో శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది. కొన్ని రోజులు అక్కడ ఉంటేనే ఈ పరిస్థితులకు అలవాటు పడొచ్చు. కానీ కొన్ని గంటల వ్యవధిలో అత్యధిక ఎత్తుకు సైక్లింగ్‌ చేయడం సాహసంతో కూడుకున్నదే.

అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తిమ్మంపేట గ్రామానికి చెందిన నిహారిక.. యాదృచ్ఛికంగా అల్ట్రా రేసింగ్‌లో అడుగుపెట్టింది. వ్యాపారరీత్యా తల్లిదండ్రులు భాస్కర్‌రెడ్డి, వాణిరెడ్డి ముంబయిలో ఉంటున్నారు. చిన్నప్పటి నుంచి సైక్లింగ్‌పై ఆసక్తి కలిగిన నిహారిక.. మూడేళ్ల క్రితం సైక్లింగ్‌ చేసుకుంటూ వచ్చి హైదరాబాద్‌లో కోచ్‌ సుధాకర్‌ రెడ్డిని కలిసింది. ఎలాంటి అనుభవం లేకపోయినా 700 కిమీ పైచిలుకు దూరం ఆమె సైక్లింగ్‌ చేయడం అందరినీ అబ్బురపరిచింది. అలా దూరపు రేసులపై ఆమె ఆసక్తి రోజురోజుకు పెరుగుతూ వెళ్లింది. నిరుడు పుణె నుంచి గోవా వరకు 643 కిమీ ‘డెక్కన్‌ క్లిఫ్‌ హ్యాంగర్‌’ రేసును విజయవంతంగా పూర్తిచేసింది. హిమాలయన్‌ రేసు తర్వాత మరోసారి డెక్కన్‌ క్లిప్‌ హ్యాంగర్‌ యాత్ర చేపట్టాలని నిహారిక భావిస్తోంది. తద్వారా ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మక ‘రేస్‌ ఎక్రాస్‌ అమెరికా (ఆర్‌ఏఏఎం)’ అల్ట్రా రేసుకు అర్హత సాధించి తన స్వప్నాన్ని సాకారం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. అమెరికా వెస్ట్‌ కోస్ట్‌ నుంచి ఈస్ట్‌ కోస్ట్‌ వరకు సుమారు 4500 కిమీ దూరం రేసు ఉంటుంది. డెక్కన్‌, హిమాలయ్‌న్‌ రేసులు ఆర్‌ఏఏఎంకు అర్హత ఈవెంట్లు. ఈ రేసుల్ని విజయవతంగా ముగించిన సైక్లిస్టులకు అమెరికా ఈవెంట్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ప్రతి రోజూ 50 కిమీ ఔట్‌ డోర్‌, ఇండోర్‌ సైక్లింగ్‌ చేస్తూ ఫిట్‌నెస్‌ కాపాడుకుంటూ తీవ్రంగా శ్రమిస్తున్న నిహారిక ఆశయ సాధన కోసం వడివడిగా అడుగులు వేస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని