భయమేల.. రవిచంద్రుడుండగ!

2011 నవంబరు 6న ఓ యువ స్పిన్నర్‌ టీమ్‌ఇండియా టెస్టు టోపీ అందుకుని మైదానంలోకి అడుగుపెట్టాడు. తర్వాతి పన్నెండేళ్లలో భారత టెస్టు జట్టులోకి ఎందరో స్పిన్నర్లు వచ్చారు. వెళ్లారు. కానీ అతను మాత్రం స్థిరంగా అక్కడే ఉన్నాడు.

Updated : 06 Mar 2024 08:21 IST

ఈనాడు క్రీడావిభాగం

2011 నవంబరు 6న ఓ యువ స్పిన్నర్‌ టీమ్‌ఇండియా టెస్టు టోపీ అందుకుని మైదానంలోకి అడుగుపెట్టాడు. తర్వాతి పన్నెండేళ్లలో భారత టెస్టు జట్టులోకి ఎందరో స్పిన్నర్లు వచ్చారు. వెళ్లారు. కానీ అతను మాత్రం స్థిరంగా అక్కడే ఉన్నాడు. ఉన్నవాడు ఊరికే ఉన్నాడా? అసామాన్యమైన నిలకడతో.. ఎన్నో అద్భుత ప్రదర్శనలతో.. వందల కొద్దీ వికెట్లతో.. లెక్కలేనన్ని రికార్డులతో అబ్బురపరుస్తూనే ఉన్నాడు. ఇప్పుడు వందో టెస్టు మైలురాయి ముంగిట సగర్వంగా నిలబడ్డ ఆ అసాధారణ బౌలరే.. రవిచంద్రన్‌ అశ్విన్‌.

నిల్‌ కుంబ్లే రిటైరైపోయాడు.. హర్భజన్‌ సింగ్‌ కెరీర్‌ చరమాంకంలోకి వచ్చేశాడు.. మరి దశాబ్దాలుగా సగర్వంగా ఎగురుతున్న భారత స్పిన్‌ పతాకాన్ని చేతబూని ముందుకు నడిపించేదెవరు? కుంబ్లే, భజ్జీల స్థాయిని ఇంకెవరైనా అందుకోగలరా? ఇలాంటి ప్రశ్నలు, సందేహాలు రేకెత్తుతున్న సమయంలో భారత జట్టులోకి వచ్చాడు రవిచంద్రన్‌ అశ్విన్‌. ముందు అతను మామూలు బౌలర్‌గానే కనిపించాడు. శైలి సాధారణంగానే అనిపించింది. బంతిని మరీ తిప్పేవాడేమీ కాదు. ఏముంది ఇతనిలో ప్రత్యేకత అనుకుంటుండగానే.. ఒక్కో అస్త్రం బయటికి తీశాడు. మేటి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. ఆరు బంతులను ఆరు రకాలుగా వేయగలిగే అతడి నైపుణ్యం ఎలాంటి బ్యాటర్‌కైనా సవాలు విసురుతుంది. బంతిని మధ్య వేలితో పట్టుకుని అతను సంధించే ‘క్యారమ్‌ బంతి’ చూసేవారికి నయనానందం కలిగిస్తే.. ఆడేవారికి కఠిన పరీక్షే. పిచ్‌ కొంచెం స్పిన్‌కు సహకరించిందంటే చాలు.. అశ్విన్‌ అత్యంత ప్రమాదకరంగా మారిపోతాడు. ప్రత్యర్థులు ఎంత సన్నద్ధమై వచ్చినా.. పరిస్థితులను బట్టి బౌలింగ్‌లో సర్దుబాట్లు చేసుకుని వికెట్లు పడగొట్టడం రవిచంద్రన్‌ ప్రత్యేకత. అశ్విన్‌ ప్రభావం తగ్గుతోందని అనుకున్న ప్రతిసారీ.. బౌలింగ్‌కు మెరుగులు దిద్దుకుని, కొత్త అస్త్రాలు సిద్ధం చేసుకుని దాడికి దిగుతాడు. జట్టుకు వికెట్‌ ఎంతో అవసరమైనపుడల్లా కెప్టెన్‌ చూసేది అశ్విన్‌ వైపే. అశ్విన్‌ ఉన్నాడంటే చాలు.. భారత కెప్టెన్‌కు ఒక భరోసా. ప్రత్యర్థులకు అదొక హెచ్చరిక! దశాబ్ద కాలంగా ఇలా జట్టులో తన ప్రాధాన్యాన్ని నిలుపుకొంటూ వస్తున్నాడు ఈ స్పిన్‌ మేధావి.

అతనొక్కడే..: టీ20ల ప్రభావం పెరిగాక ఆఫ్‌స్పిన్నర్ల ప్రభావం ఎంతగా తగ్గిపోయిందో తెలిసిందే. చాలా ఏళ్లుగా ప్రపంచ క్రికెట్లో మణికట్టు స్పిన్నర్లు, ఎడమచేతి వాటం బౌలర్లదే హవా. బ్యాటర్లలో దూకుడు పెరిగాక ఆఫ్‌స్పిన్నర్లను అలవోకగా ఆడేస్తున్నారు. మిస్టరీ స్పిన్నర్లు అనిపించుకున్న వారి బౌలింగ్‌ను కూడా కొంత కాలానికే బ్యాటర్లు చదివేస్తున్నారు. ఒక్కసారి బలహీనతలు బయటపడ్డాక ఆఫ్‌స్పిన్నర్ల మనుగడ కష్టమవుతోంది. అజంత మెండిస్‌ సహా ఇలా కనుమరుగైపోయిన ఆఫ్‌స్పిన్నర్లు ఎందరో! ఇలాంటి పరిస్థితుల్లో అశ్విన్‌ మాత్రం ఇంకా తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. దిగ్గజ బౌలరైన హర్భజన్‌ సైతం కెరీర్లో ఒక దశ తర్వాత అంతగా ప్రభావం చూపలేకపోయాడు. కానీ అశ్విన్‌ మాత్రం ఉపఖండంలో ఇప్పటికీ గొప్ప ప్రభావం చూపిస్తున్నాడు. ప్రపంచ క్రికెట్లో ప్రస్తుతం అశ్విన్‌లా ప్రత్యర్థులపై ఆధిపత్యం చలాయిస్తున్న ఆఫ్‌స్పిన్నర్‌ మరొకరు లేరు. నిత్య విద్యార్థి అయిన అశ్విన్‌.. ఎప్పటికప్పుడు తన బౌలింగ్‌కు మెరుగులు దిద్దుకోవడం, బ్యాటర్ల ఆలోచనలను చదివి వాళ్ల కంటే ఒక అడుగు ముందుంటూ బంతులు సంధించడం ద్వారానే ఇప్పటికీ నిలకడగా వికెట్లు తీయగలుగుతున్నాడు.


  • వందో టెస్టు ఆడకుండానే 500 వికెట్ల ఘనతను పూర్తి చేశాడు అశ్విన్‌. ప్రస్తుత ఇంగ్లాండ్‌ సిరీస్‌ మూడో టెస్టులో అతనీ మైలురాయిని అందుకున్నాడు. అతడికది 98వ టెస్టు. ముత్తయ్య మురళీధరన్‌ మాత్రమే అశ్విన్‌ కంటే తక్కువ మ్యాచ్‌ల్లో (87) ఈ ఘనత సాధించాడు.
  • సొంతగడ్డపై అశ్విన్‌కు తిరుగులేని   రికార్డుంది. ఇక్కడ 59 మ్యాచ్‌ల్లోనే ఏకంగా 354 వికెట్లు పడగొట్టాడు.
  • అశ్విన్‌ సొంతగడ్డపై ఆడిన 59 మ్యాచ్‌ల్లో భారత్‌ 42 విజయాలు సాధించింది.
  • ఎడమ చేతి వాటం బ్యాటర్లపై అశ్విన్‌కు గొప్ప రికార్డుంది. అతను పడగొట్టిన లెఫ్ట్‌హ్యాండర్ల వికెట్లు 252. టెస్టు చరిత్రలో ఏ బౌలర్‌ కూడా ఇంతమంది ఎడమ చేతి వాటం బ్యాటర్లను ఔట్‌ చేయలేదు.
  • అశ్విన్‌ టెస్టుల్లో పదిసార్లు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు అందుకున్నాడు. అతను ఎనిమిదిసార్లు పది వికెట్ల ప్రదర్శన చేశాడు. 35 ఇన్నింగ్స్‌ల్లో అయిదు చొప్పున వికెట్లు పడగొట్టాడు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని