Mayank Yadav: వచ్చాడో రాకెట్‌ బౌలర్‌

పంజాబ్‌ కింగ్స్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ బ్యాటింగ్‌ చేస్తున్నాడు.. ఒక కుర్రాడు బుల్లెట్‌ వేగంతో వేసిన బంతి సర్రున దూసుకొచ్చి అతడి బ్యాట్‌ను బీట్‌ చేసింది.

Updated : 01 Apr 2024 07:43 IST

పంజాబ్‌ కింగ్స్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ బ్యాటింగ్‌ చేస్తున్నాడు.. ఒక కుర్రాడు బుల్లెట్‌ వేగంతో వేసిన బంతి సర్రున దూసుకొచ్చి అతడి బ్యాట్‌ను బీట్‌ చేసింది. ఆ బంతి వేగం గంటకు 155.8 కి.మీ! ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత వేగంగా విసిరిన బంతుల్లో ఇదొకటి. ఈ ఒక్క బంతే కాదు పంజాబ్‌పై ఆ లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ బౌలర్‌ వేసిన బంతులన్నీ దాదాపు 145 కి.మీ పైనే! వాయు వేగంతో బౌలింగ్‌ చేసి బ్యాటర్లను బోల్తా కొట్టించిన ఆ బౌలరే మయాంక్‌ యాదవ్‌. దిల్లీకి చెందిన 21 ఏళ్ల మయాంక్‌ పంజాబ్‌పై 3 వికెట్లు తీసి జట్టును గెలిపించి రాత్రికి రాత్రే హీరో అయ్యాడు.

మయాంక్‌ నాన్న ప్రభు యాదవ్‌ది చిరు వ్యాపారం. తనయుడి క్రికెట్‌ ఆసక్తిని గుర్తించి చిన్నప్పుడే అతడిని ఈ ఆటలో ప్రోత్సహించాడు. కానీ క్రికెట్‌పై వెచ్చించేంత స్థోమత ఆ కుటుంబానికి లేదు. ఆరంభంలో బూట్లు కూడా లేకుండా ఇబ్బంది పడ్డాడు. ఆరడుగులపైన ఎత్తు.. బక్క పలచని దేహంతో ఉండే మయాంక్‌ బంతిని సరిగా విసరలేకపోయేవాడు. కానీ సోనెపట్‌ క్లబ్‌లో చేరిన తర్వాత ఆహారంలో మార్పులు చేసుకుని శరీర దారుఢ్యాన్ని పెంచుకున్నాడు. పేస్‌ బౌలర్‌గా ఎదిగాడు. గట్టి ఇటుక లాంటి కాంచాస్‌ అనే బంతితో బౌలింగ్‌ చేసి పేస్‌ రాబట్టడం అతడికి బాగా ఉపయోగపడింది. దీంతో సాధారణ బంతులతో మయాంక్‌ మరింత వేగాన్ని సృష్టించగలుగుతున్నాడు. మెరుపు బంతులు విసరడం ఈ కుర్రాడికి కొత్తేం కాదు. దేశవాళీ టోర్నీల్లో వేగవంతమైన బంతులు వేస్తూ అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఇప్పుడంటే ఐపీఎల్‌ ద్వారా అతడి గురించి అందరికి తెలిసింది కానీ.. అంతకంటే ముందే దేవధర్‌ ట్రోఫీలో ఓ బంతిని 155 కి.మీ వేగంతో వేసి ఔరా అనిపించాడు. కాబట్టే 2022లోనే ఐపీఎల్‌ గడప తొక్కాడు. లఖ్‌నవూ రూ.20 లక్షలతో ఈ కుర్రాడిని దక్కించుకుంది.

చీలమండ గాయం మయాంక్‌ ఐపీఎల్‌ అరంగేట్రాన్ని వాయిదా వేసింది. గాయం వల్ల వచ్చిన విరామం తర్వాత లయ అందుకునేందుకు కష్టపడ్డాడు. ఈ క్రమంలోనే ఈ ఏడాది పంజాబ్‌పై లఖ్‌నవూ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. మెరుపు పేస్‌కు తోడు, వైవిధ్యంతో బౌలింగ్‌ చేసి పంజాబ్‌ బ్యాటర్లను కట్టిపడేశాడు. గతంలో ఉమ్రాన్‌ మాలిక్‌ కూడా స్థిరంగా 150 వేగాన్ని అందుకుంటూ భారత జట్టు తలుపు తట్టాడు. అయితే ఉమ్రాన్‌ ఎంత వేగంగా బంతులు వేసినా ధారాళంగా పరుగులు ఇచ్చేవాడు. కానీ మయాంక్‌ వేగానికి, కచ్చితత్వాన్ని జోడిస్తూ తొలి మ్యాచ్‌లో ఆకట్టుకున్నాడు. ఇదే జోరు మున్ముందు కూడా కొనసాగిస్తే త్వరలోనే భారత జట్టులో ఈ కుర్రాడిని చూసే అవకాశాలున్నాయి. ‘‘మయాంక్‌ రనప్‌ చాలా సులభంగా ఉంది. ఇదే అతడికి పేస్‌ను రాబట్టేలా చేస్తోంది. ముఖ్యంగా క్రీజును చేరుకుని బంతిని వదిలే సమయంలో అతడి యాక్షన్‌ చాలా సమతూకంగా కనిపిస్తోంది. అంతేకాదు నాణ్యమైన బ్యాటర్లను సైతం అతడు తన పేస్‌తో బీట్‌ చేస్తున్నాడు. అతడి బౌలింగ్‌ నిజంగా అద్భుతం’’ అని ఇంగ్లాండ్‌ దిగ్గజ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ కొనియాడాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని