Bengaluru X Hyderabad: 277 పోయె.. 287 వచ్చె!

2024 మార్చి 27.. ఐపీఎల్‌ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుందనుకున్న తేదీ. కానీ ఆ తేదీకి తాను ఆపాదించిన ప్రత్యేకతను తనే తుడిచేసింది సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌. ఆ రోజు ముంబయి బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ ఏకంగా 277 పరుగులు చేసి, పదకొండేళ్ల పాటు నిలిచిన ఐపీఎల్‌ అత్యధిక స్కోరు రికార్డును తిరగరాసిన హైదరాబాద్‌.

Updated : 16 Apr 2024 06:57 IST

మళ్లీ రెచ్చిపోయిన సన్‌రైజర్స్‌
ఐపీఎల్‌ అత్యధిక స్కోరు రికార్డు బద్దలు
హెడ్‌ విధ్వంసక శతకం
కార్తీక్‌ చెలరేగినా.. ఆర్సీబీకి ఓటమే
బెంగళూరు

2024 మార్చి 27.. ఐపీఎల్‌ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుందనుకున్న తేదీ. కానీ ఆ తేదీకి తాను ఆపాదించిన ప్రత్యేకతను తనే తుడిచేసింది సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌. ఆ రోజు ముంబయి బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ ఏకంగా 277 పరుగులు చేసి, పదకొండేళ్ల పాటు నిలిచిన ఐపీఎల్‌ అత్యధిక స్కోరు రికార్డును తిరగరాసిన హైదరాబాద్‌.. కొత్త రికార్డును 20 రోజులైనా నిలవనీయలేదు. ఈసారి హైదరాబాదుడుకు బలైన జట్టు.. బెంగళూరు. సన్‌రైజర్స్‌ బ్యాటర్ల సిక్సర్ల వర్షంలో తడిసి ముద్దయిన స్టేడియం.. చిన్నస్వామి. ఆర్సీబీ బౌలింగ్‌ను ట్రావిస్‌ హెడ్‌ ఊచకోత కోస్తే.. మిగతా బ్యాటర్లూ సిక్సర్ల ముచ్చట తీర్చుకున్నారు. తర్వాత బెంగళూరు బ్యాటర్లేమీ తక్కువ తినలేదు. డుప్లెసిస్‌, కోహ్లి అదిరే ఆరంభాన్నిస్తే.. దినేశ్‌ కార్తీక్‌ సంచలన ఇన్నింగ్స్‌ ఆడాడు. లక్ష్యం 288 పరుగులైనా 25 పరుగుల తేడాతోనే ఓడింది ఆర్సీబీ.

తాక స్థాయి విధ్వంసంతో రికార్డులకు పాతరేయడమే పనిగా పెట్టుకున్న సన్‌రైజర్స్‌.. గత నెల తనే నెలకొల్పిన ఐపీఎల్‌ అత్యధిక స్కోరు రికార్డును బద్దలు కొట్టింది. సోమవారం చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరుతో మ్యాచ్‌లో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఏకంగా 287 పరుగులు చేసింది. ట్రావిస్‌ హెడ్‌ (102; 41 బంతుల్లో 9×4, 8×6) విధ్వంసక శతకం సాధిస్తే.. క్లాసెన్‌ (67; 31 బంతుల్లో 2×4, 7×6), సమద్‌ (37 నాటౌట్‌; 10 బంతుల్లో 4×4, 3×6), అభిషేక్‌ శర్మ (34; 22 బంతుల్లో 2×4, 2×6) మార్‌క్రమ్‌ (32 నాటౌట్‌; 17 బంతుల్లో 2×4, 2×6) కూడా రెచ్చిపోయారు. అనంతరం ఆర్సీబీ 20 ఓవర్లలో 7 వికెట్లకు 262 పరుగులు చేసింది. డుప్లెసిస్‌ (62; 28 బంతుల్లో 7×4, 4×6), కోహ్లి (42; 20 బంతుల్లో 6×4, 2×6) ఆర్సీబీకి మెరుపు ఆరంభాన్నిచ్చినా.. ఆ తర్వాత ఆ జట్టు గాడి తప్పింది. దినేశ్‌ కార్తీక్‌ (83; 35 బంతుల్లో 5×4, 7×6) సంచలన ఇన్నింగ్స్‌ ఆడి ఆర్సీబీకి గౌరవప్రదమైన ఓటమిని మిగిల్చాడు. కమిన్స్‌ (3/43), మార్కండే (2/46) ఆ జట్టును దెబ్బ తీశారు.

ఇంకాస్త పోరాడుంటే..: 288 పరుగుల లక్ష్యం.. తొలి ఓవర్‌ నుంచే దాదాపు 14.5 రన్‌రేట్‌తో పరుగులు చేయాలి. విజయం గురించి ఆలోచించలేని పరిస్థితి. కానీ పోరాడితే పోయేదేముంది అన్నట్లు ఆర్సీబీ బ్యాటర్లు తెగించే ఆడారు. కోహ్లి, డుప్లెసిస్‌ పోటీపడి ఫోర్లు, సిక్సర్లు బాదడంతో పవర్‌ప్లేలో ఆర్సీబీ దూసుకెళ్లింది. భువనేశ్వర్‌ బౌలింగ్‌లో లెగ్‌ ఫ్లిక్‌తో కొట్టిన సిక్సర్‌ సహా ఉన్నంతసేపు కళ్లు చెదిరే షాట్లు ఆడాడు కోహ్లి. అయితే పవర్‌ప్లే ముగిసిందో లేదో అతడి మెరుపులకు తెరపడింది. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ మయాంక్‌ మార్కండే.. కోహ్లిని బౌల్డ్‌ చేశాడు. తొలి వికెట్‌ పడగానే ఇన్నింగ్స్‌కు కుదుపులకు లోనైంది. విల్‌ జాక్స్‌ (7) దురదృష్టవశాత్తూ రనౌటైతే.. రజత్‌ పటిదార్‌ (9), సౌరభ్‌ చౌహాన్‌ (0) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. మరో ఎండ్‌లో డుప్లెసిస్‌ వీరోచిత బ్యాటింగ్‌ కొనసాగడంతో ఆర్సీబీ 7.5 ఓవర్లకే 100 దాటేసింది. 23 బంతుల్లోనే డుప్లెసిస్‌ అర్ధశతకం పూర్తి చేశాడు. అయితే ఫాఫ్‌ను పదో ఓవర్లో కమిన్స్‌ పెవిలియన్‌ చేర్చడంతో ఆర్సీబీ భారీ తేడాతో ఓడుతుందనిపించింది. కానీ కార్తీక్‌ ఇక్కడ్నుంచి అనూహ్యంగా చెలరేగిపోయాడు. అసాధారణ షాట్లతో సన్‌రైజర్స్‌ బౌలర్ల గణాంకాలన్నీ చెల్లాచెదురయ్యేలా చేశాడు. లొమ్రార్‌ (19), అనుజ్‌ రావత్‌ (25 నాటౌట్‌) అతడికి సహకరించారు. కార్తీక్‌ ధాటికి బెంగళూరు 12.4 ఓవర్లలోనే 150, 16.1 ఓవర్లకే 200 చేరుకుని సన్‌రైజర్స్‌కు దీటుగా నిలిచింది. 3 ఓవర్లలో 72 పరుగులు చేయాల్సి రావడంతో కార్తీక్‌ ఏమైనా అద్భుతం చేస్తాడా అనిపించింది. కానీ తర్వాతి 2 ఓవర్లలో 37 పరుగులే వచ్చాయి. కార్తీక్‌ కూడా ఔటైపోయాడు. ఆర్సీబీ ఓటమి ఖాయమైపోయాక చివరి ఓవర్లో (భువనేశ్వర్‌) రావత్‌ 4 ఫోర్లు కొట్టాడు. తొలి వికెట్‌ భాగస్వామ్యం తర్వాత.. ఇన్నింగ్స్‌ మధ్యలో ఆర్సీబీ ఇంకాస్త పోరాడుంటే.. రికార్డు స్కోరును ఛేదించి సంచలనం రేపేదేమో!

హెడ్‌ మొదలుపెడితే..: మొదట టాస్‌ ఓడినపుడు చిన్నస్వామి స్టేడియంలో పిచ్‌ను చూసి ఇక్కడ 240 స్కోరు చేస్తేనే గెలుస్తామని చెప్పాడు సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ కమిన్స్‌. అప్పటికి ఆ మాట అతిశయోక్తిలా అనిపించింది కానీ.. సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌ ఆరంభమైన కాసేపటికే ఆ జట్టు నిజంగా ఆ మార్కును అందుకుంటుందనిపించింది. ఇన్నింగ్స్‌ ముందుకు సాగేకొద్దీ ఈ సీజన్లో హైదరాబాద్‌ బద్దలుకొట్టిన ఐపీఎల్‌ అత్యధిక స్కోరు రికార్డు నిలిచే అవకాశం లేదని స్పష్టమైపోయింది. ధారాళంగా పరుగులిచ్చే సిరాజ్‌ను తప్పించినా.. వరుసగా విఫలమవుతున్న ఆల్‌రౌండర్‌ మ్యాక్స్‌వెల్‌ స్థానంలో న్యూజిలాండ్‌ ఫాస్ట్‌బౌలర్‌ ఫెర్గూసన్‌ను జట్టులోకి తెచ్చినా బెంగళూరు బౌలింగ్‌ అవస్థల్లో ఏ మార్పూ లేదు. జీవం లేని పిచ్‌, బంతి రయ్యిన దూసుకెళ్తున్న ఔట్‌ఫీల్డ్‌.. అన్నింటికీ మించి పసలేని ఆర్సీబీ బౌలింగ్‌ను పూర్తిగా ఉపయోగించుకుంటూ సన్‌రైజర్స్‌ బ్యాటర్లు చెలరేగిపోయారు. ముఖ్యంగా ట్రావిస్‌ హెడ్‌ అయితే.. బంతి మీద దీర్ఘ కాల పగ ఉన్నట్లుగా పదే పదే దాన్ని బౌండరీ అవతలకి పంపించేశాడు. హెడ్‌ బ్యాట్‌లో స్ప్రింగ్‌లేమైనా ఉన్నాయా అన్నట్లుగా బంతి తాకడం ఆలస్యం.. రయ్యిమని బౌండరీ బాట పట్టింది. విరామం లేని విధ్వంసంతో హెడ్‌ చిన్నస్వామి స్టేడియాన్ని పరుగుల వర్షంలో ముంచెత్తాడు. మరో ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ కూడా ఉన్నంతసేపు భారీ షాట్లు ఆడాడు. పవర్‌ప్లే ముగిసేసరికే వికెట్‌ నష్టపోకుండా సన్‌రైజర్స్‌ 76 పరుగులు చేసింది. 9వ ఓవర్లో (టాప్లీ) అభిషేక్‌ ఔటయ్యేసరికే స్కోరు 108. తొలి వికెట్‌ తీసినందుకు ఆర్సీబీ సంతోషించడానికి ఏమీ లేకపోయింది. ఓ ఎండ్‌లో పూనకం వచ్చినట్లు హెడ్‌ విరుచుకుపడుతుంటే.. మూడో స్థానంలోనే బ్యాటింగ్‌కు వచ్చిన క్లాసెన్‌ సైతం తనదైన శైలిలో విధ్వంసానికి దిగాడు. ఫెర్గూసన్‌ బౌలింగ్‌లో అతను కొట్టిన ఓ సిక్సర్‌ ఏకంగా 106 మీటర్లు ప్రయాణించింది. 12వ ఓవర్లోనే హైదరాబాద్‌ 150 మార్కును అందుకోగా.. హెడ్‌ కూడా సెంచరీ (39 బంతుల్లో) పూర్తి చేశాడు. తర్వాతి ఓవర్లో హెడ్‌ ఔటైనా.. పరుగుల జోరేమీ తగ్గలేదు. క్లాసెన్‌ టాప్‌ గేర్‌ అందుకోవడంతో 15వ ఓవర్లోనే స్కోరు 200 దాటేసింది. మరో ఎండ్‌లో మార్‌క్రమ్‌ ఓ మోస్తరు వేగంతో ఆడాడు. 23 బంతుల్లోనే అర్ధశతకం అందుకున్న క్లాసెన్‌.. ఆ తర్వాత కూడా దూకుడు కొనసాగించాడు. అయితే 17వ చివరి బంతికి అతను ఔటైపోయాడు. అప్పటికి స్కోరు 231. ఈ స్థితిలో క్రీజులోకి వచ్చిన సమద్‌.. బాదుడును మరో స్థాయికి తీసుకెళ్లాడు. టాప్లీ వేసిన 19వ ఓవర్లో అతను వరుసగా 4, 4, 6, 6, 4 కొట్టడంతో ఒక ఓవర్‌ మిగిలుండగా సన్‌రైజర్స్‌ 266/3తో రికార్డు స్కోరుకు చేరువైంది. వైశాఖ్‌ వేసిన చివరి ఓవర్లోనూ 21 పరుగులు వచ్చాయి.


హెడ్‌ పిడుగల్లే..

2021 ఐపీఎల్‌ సీజన్‌ వరకూ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఓపెనింగ్‌తో ఇబ్బంది లేదు. అప్పుడు వార్నర్‌, బెయిర్‌స్టో ఓపెనర్లుగా జట్టుకు ధనాధన్‌ ఆరంభాలను ఇచ్చేవాళ్లు. కానీ 2022 నుంచి కథ మారింది. వార్నర్‌ను వదిలేసుకోవడంతో సరైన ఓపెనింగ్‌ కూర్పు సమస్యగా మారింది. మార్‌క్రమ్‌, మయాంక్‌ అగర్వాల్‌, అభిషేక్‌, హ్యారీ బ్రూక్‌ ఇలా వేర్వేరు జోడీలను ప్రయత్నించింది. కానీ అనుకున్న ఫలితం రాలేదు. కానీ ఇప్పుడా ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇన్నింగ్స్‌ మొదటి నుంచే ప్రత్యర్థి బౌలర్లపై పిడుగల్లే పడేందుకు ట్రావిస్‌ హెడ్‌ ఉన్నాడు. ముంబయితో పోరుతో ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ తరపున తొలి మ్యాచ్‌ ఆడిన హెడ్‌.. 24 బంతుల్లోనే 62 పరుగులతో అదరగొట్టాడు. జట్టు రికార్డు స్కోరు 277/3 చేయడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఆ తర్వాత వరుసగా 19, 31, 21 పరుగులు సాధించాడు. ఇప్పుడేమో ఆర్సీబీతో మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 39 బంతుల్లోనే శతకం చేసి.. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ తరపున వేగవంతమైన సెంచరీ చేసిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. మొత్తంగా ఐపీఎల్‌లో ఇది నాలుగో వేగవంతమైన శతకం. మెరుపు ఇన్నింగ్స్‌లతో జట్టుకు బలమైన పునాది వేస్తూ భారీ స్కోర్లు చేయడంలో హెడ్‌ ఇప్పుడు కీలకంగా మారాడు. ఐపీఎల్‌లోనే అత్యధిక స్కోరు చేసిన జట్టుగా తన రికార్డునే సన్‌రైజర్స్‌ బద్దలుకొట్టిందంటే ప్రధాన కారణం హెడ్‌ సెంచరీ. ఇతనిదే జోరు కొనసాగిస్తే సన్‌రైజర్స్‌కు తిరుగుండదు.

హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: అభిషేక్‌ శర్మ (సి) ఫెర్గూసన్‌ (బి) టాప్లీ 34; హెడ్‌ (సి) డుప్లెసిస్‌ (బి) ఫెర్గూసన్‌ 102; క్లాసెన్‌ (సి) వైశాఖ్‌ (బి) ఫెర్గూసన్‌ 67; మార్‌క్రమ్‌ నాటౌట్‌ 32; సమద్‌ నాటౌట్‌ 37; ఎక్స్‌ట్రాలు 15

మొత్తం: (20 ఓవర్లలో 3 వికెట్లకు) 287;

వికెట్ల పతనం: 1-108, 2-165, 3-231;

బౌలింగ్‌: విల్‌ జాక్స్‌ 3-0-32-0; టాప్లీ 4-0-68-1; యశ్‌ దయాళ్‌ 4-0-51-0; ఫెర్గూసన్‌ 4-0-52-2; వైశాఖ్‌ 4-0-64-0; లొమ్రార్‌ 1-0-18-0

బెంగళూరు ఇన్నింగ్స్‌: కోహ్లి (బి) మార్కండే 42; డుప్లెసిస్‌ (సి) క్లాసెన్‌ (బి) కమిన్స్‌ 62; జాక్స్‌ రనౌట్‌ 7; పటీదార్‌ (సి) నితీశ్‌ (బి) మార్కండే 9; సౌరభ్‌ చౌహాన్‌ ఎల్బీ (బి) కమిన్స్‌ 0; దినేశ్‌ కార్తీక్‌ (సి) క్లాసెన్‌ (బి) నటరాజన్‌ 83; లొమ్రార్‌ (బి) కమిన్స్‌ 19; అనుజ్‌ నాటౌట్‌ 25; విజయ్‌కుమార్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 14

మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 262;

వికెట్ల పతనం: 1-80, 2-100, 3-111, 4-121, 5-122, 6-181, 7-244;

బౌలింగ్‌: అభిషేక్‌శర్మ 1-0-10-0; భువనేశ్వర్‌ 4-0-60-0; షాబాజ్‌ అహ్మద్‌ 1-0-18-0; నటరాజన్‌ 4-0-47-1; కమిన్స్‌ 4-0-43-3; మార్కండే 4-0-46-2; జైదేవ్‌ ఉనద్కత్‌ 2-0-37-0

4

సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌లో 50కి పైగా పరుగులు సమర్పించుకున్న బౌలర్లు. ఐపీఎల్‌లోనే కాదు పురుషుల టీ20లోనే ఇలా జరగడం ఇదే తొలిసారి. టాప్లీ 68, యశ్‌ దయాల్‌ 51, ఫెర్గూసన్‌ 52, వైశాఖ్‌ 64 పరుగుల చొప్పున ఇచ్చుకున్నారు. ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు ఇచ్చుకున్న ఆర్సీబీ బౌలర్‌గా టాప్లీ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు.


22

సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌లో నమోదైన సిక్సర్లు. ఐపీఎల్‌లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డులో ఆర్సీబీ (21)ని సన్‌రైజర్స్‌ దాటేసింది.


38

ఈ మ్యాచ్‌లో సిక్సర్లు. ప్రపంచ టీ20ల్లో ఓ మ్యాచ్‌లో నమోదైన అత్యధిక సిక్సర్లు ఇవే. గత రికార్డు 37.


549

రెండు ఇన్నింగ్స్‌లు కలిపి ఈ మ్యాచ్‌లో నమోదైన పరుగులు. ఓ టీ20 మ్యాచ్‌లో సాధించిన పరుగుల పరంగా ఇదే ప్రపంచ రికార్డు. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌, ముంబయి మ్యాచ్‌లో 523 పరుగులు వచ్చాయి.


39

శతకానికి హెడ్‌ ఆడిన బంతులు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ తరపున ఇదే వేగవంతమైన సెంచరీ. వార్నర్‌ (2017లో కేకేఆర్‌పై 43 బంతుల్లో) రికార్డును హెడ్‌ తిరగరాశాడు. ఐపీఎల్‌లో ఇది నాలుగో వేగవంతమైన సెంచరీ.


287/3

బెంగళూరుపై సన్‌రైజర్స్‌ స్కోరు. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక స్కోరు ఇదే. ఈ సీజన్‌లో ముంబయిపై 277 (3 వికెట్లకు) పరుగులు చేసిన సన్‌రైజర్స్‌ ఇప్పుడా రికార్డును మెరుగుపర్చుకుంది. ప్రపంచ టీ20ల్లో నేపాల్‌దే (మంగోలియాపై 314/3) రికార్డు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని