సీఎస్కేను ఆపగలనని నమ్మా

చెన్నై సూపర్‌ కింగ్స్‌ని చివరి ఓవర్లో 17 పరుగులు చేయకుండా ఆపగలనని నమ్మానని.. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు పేసర్‌ యశ్‌ దయాళ్‌ తెలిపాడు.

Updated : 20 May 2024 07:07 IST

కోల్‌కతా: చెన్నై సూపర్‌ కింగ్స్‌ని చివరి ఓవర్లో 17 పరుగులు చేయకుండా ఆపగలనని నమ్మానని.. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు పేసర్‌ యశ్‌ దయాళ్‌ తెలిపాడు. ఆ ఓవర్‌ తొలి బంతికి ధోని సిక్స్‌ కొట్టినా.. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదని తెలిపాడు. ‘‘చెన్నైతో మ్యాచ్‌లో చివరి ఓవర్‌ వేయాల్సి వచ్చినప్పుడు గతేడాది కోల్‌కతాపై ఎదురైన చేదు అనుభవం గుర్తొచ్చింది. కానీ సీఎస్కే బ్యాటర్లను నిలువరించగలనని విశ్వసించా. ఈసారి అదృష్టం నావైపు ఉంటుందని భావించా. అందుకే తొలి బంతికే ధోని భారీ సిక్స్‌ కొట్టినా తొణకలేదు’’ దయాళ్‌ తెలిపాడు. చివరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్‌ చేసి బెంగళూరుకి సంచలన విజయం అందించిన ఈ యూపీ పేసర్‌.. గెలిచిన తర్వాత సంబరాల్లో మునిగిపోయాడు. అమ్మ రాధ దయాళ్‌కి వీడియో కాల్‌ చేసి మాట్లాడాడు. 2023 సీజన్లో గుజరాత్‌ టైటాన్స్‌కు ఆడిన యశ్‌కు కోల్‌కతాతో మ్యాచ్‌ పీడకలగా మిగిలిపోయింది. చివరి ఓవర్లో 29 పరుగులను కాపాడాల్సి ఉండగా.. రింకూ సింగ్‌ దెబ్బకు దయాళ్‌ వరుసగా 5 సిక్స్‌లు ఇచ్చుకుని ఓటమికి కారకుడయ్యాడు. ఆ తర్వాత జట్టులో స్థానాన్ని కూడా కోల్పోయాడు. ఈ ఏడాది బెంగళూరు అతడిని దక్కించుకోగా.. అత్యంత కీలక సమయంలో సత్తా చాటి జట్టును ప్లేఆఫ్స్‌ చేర్చాడు. ‘ఇది దేవుడి ప్రణాళిక’ అని రింకూ కూడా యశ్‌ ప్రదర్శనను ఉద్దేశించి ఇన్‌స్టాలో పోస్టు పెట్టాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని