ఐపీఎల్‌ 2024: ముంబయికి షాక్‌.. ఉత్కంఠ పోరులో గుజరాత్‌ విజయం

ముంబయితో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ 6 పరుగుల తేడాతో విజయం సాధించి బోణీ కొట్టింది. 

Updated : 24 Mar 2024 23:53 IST

అహ్మదాబాద్‌: ఐపీఎల్‌ 2024లో గుజరాత్‌ బోణీ కొట్టింది. ముంబయితో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 6 పరుగుల తేడాతో నెగ్గింది. 169 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన ముంబయి 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (43; 29 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌), డెవాల్డ్ బ్రెవిస్ (46; 38 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించడంతో ముంబయి 15 ఓవర్లకు 126/3 స్కోరుతో నిలిచింది. దీంతో ముంబయి సునాయసంగా విజయం సాధిస్తుందని అంతా భావించారు. కానీ, చివరి ఐదు ఓవర్లలో గుజరాత్ బౌలర్లు పుంజుకుని వరుసగా వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ని చేజిక్కించుకున్నారు. గుజరాత్‌ బౌలర్లలో ఒమర్జాయ్‌, ఉమేశ్‌ యాదవ్‌, స్పెన్సర్‌ జాన్సన్‌, మోహిత్‌ శర్మ తలో రెండు వికెట్లు తీశారు. 

హార్దిక్‌ దూకుడుతో ఆశలు..

ముంబయి విజయానికి చివరి రెండు ఓవర్లలో 27 పరుగులు అవసరం కాగా.. స్పెన్సర్‌ జాన్సన్‌ వేసిన 19 ఓవర్‌లో తొలి బంతికి సిక్స్ బాదిన తిలక్ వర్మ (25).. తర్వాతి బంతికే అభినవ్ మనోహర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ఇదే ఓవర్‌లో చివరి బంతికి కొయెట్జీ (1) జాన్సన్‌కు రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చాడు. చివరి ఓవర్లో ముంబయి విజయ సమీకరణం 19 పరుగులు కాగా.. తొలి రెండు బంతులకు హార్దిక్ పాండ్య (11) వరుసగా సిక్స్, ఫోర్ బాదాడు. దీంతో ముంబయి శిబిరం ఆనందంలో ముగినితేలింది. కానీ, వరుస బంతుల్లో పాండ్య, పీయూష్ చావ్లా (0) ఔటయ్యారు. దీంతో ముంబయి ఓటమి ఖాయమైంది. 

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. సాయి సుదర్శన్‌ (45: 39 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (31: 22 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించాడు. సాహా(19), రాహుల్‌ తివాతియా (22) పరుగులు చేశారు. మిగతావారు విఫలం కావడంతో గుజరాత్‌ భారీ స్కోర్‌ చేయలేకపోయింది. ముంబయి బౌలర్లలో బుమ్రా మూడు, గెరాల్డ్‌ కొయెట్జి రెండు వికెట్లు పడగొట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని