Punjab vs Gujarat: స్వల్ప లక్ష్యాన్ని కష్టంగా ఛేదించిన గుజరాత్‌

పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ 3 వికెట్ల తేడాతో నెగ్గింది. 143 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు 19.1 ఓవర్లో ఛేదించింది. 

Updated : 22 Apr 2024 01:56 IST

ముల్లాన్‌పుర్‌: ఐపీఎల్‌ 2024లో పంజాబ్‌ కింగ్స్‌పై గుజరాత్‌ 3 వికెట్ల తేడాతో నెగ్గింది. 143 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ 19.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి కష్టంగా నెగ్గింది. రాహుల్‌ తెవాతియా (36*: 18 బంతుల్లో 7 ఫోర్లు) చెలరేగి ఆడాడు. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌(35: 29 బంతుల్లో 5 ఫోర్లు), సాయి సుదర్శన్‌ (31: 34 బంతుల్లో 3 ఫోర్లు) రాణించారు. సాహా(13), మిల్లర్‌ (4), ఒమర్జాయ్‌ (13), షారుఖ్‌ ఖాన్‌(8), రషీద్‌ ఖాన్‌ (3) తీవ్ర నిరాశపరిచారు. పంజాబ్‌ బౌలర్లలో హర్షల్‌ పటేల్‌ మూడు వికెట్లు తీయగా, లివింగ్‌ స్టోన్‌ 2, అర్ష్‌దీప్‌ సింగ్‌, సామ్‌ కరన్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు.

తెవాతియా సంచలన ఇన్నింగ్స్‌..

143 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేపట్టిన గుజరాత్‌కు మంచి శుభారంభం దక్కలేదు. 25 పరుగుల వద్ద అర్ష్‌దీప్‌ బౌలింగ్‌లో సాహా ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సాయి సుదర్శన్‌తో జట్టు కట్టిన గిల్‌ నెమ్మదిగా ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. తొమ్మిది ఓవర్లకు 65 పరుగులతో నిలిచిన గుజరాత్‌ మరుసటి ఓవర్లో గిల్‌ను కోల్పోయింది. లివింగ్‌స్టన్‌ వేసిన బంతిని గిల్‌ గాల్లోకి లేపడంతో రబాడ క్యాచ్‌ అందుకున్నాడు. స్వల్ప తేడాతో 12 ఓవర్‌ ఐదో బంతికి మిల్లర్‌ను లివింగ్‌స్టన్‌ బౌల్డ్‌ చేశాడు. క్రీజులో కుదురుకుంటున్న సాయి సుదర్శన్‌ను 14.4 ఓవర్ల వద్ద ఔటయ్యాడు. సామ్‌కరన్‌ వేసిన ఓ చక్కటి బంతికి అతడు క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 16వ ఓవర్లో ఒమర్జాయ్‌ ఔటయ్యాడు. 16 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు 105 పరుగులతో నిలిచింది. సాధించాల్సిన లక్ష్యం తక్కువే ఉన్నప్పటికీ వరుసగా వికెట్లు కోల్పోవడంతో గుజరాత్‌ శిబిరంలో ఒకింత ఆందోళన నెలకొంది. అయితే సుదర్శన్‌ ఔట్‌తో క్రీజులోకి వచ్చిన రాహుల్‌ తెవాతియా పంజాబ్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 17వ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన అతడు.. 18 ఓవర్లో విశ్వరూపం చూపాడు. ఈ ఓవర్లో మరో బ్యాటర్‌ షారుఖ్‌ ఖాన్‌ ఓ సిక్స్‌ కొట్టగా, తెవాతియా 3 ఫోర్లు బాదాడు. దీంతో ఈ ఓవర్లో మొత్తం 20 పరుగులు వచ్చాయి. అప్పటికే గుజరాత్‌ విజయం ఖాయమైనప్పటికీ 19 ఓవర్లో ఆ జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. చివరికి తెవాతియా చివరి ఓవర్‌ తొలి బంతిని ఫోర్‌ బాది జట్టును విజయతీరాలకు చేర్చాడు.    

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 20 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌట్‌ అయింది. ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (35) టాప్‌ స్కోరర్‌. హర్‌ప్రీత్‌ బ్రార్‌ (29), సామ్‌ కరన్‌ (20) పరుగులు చేశాడు. గుజరాత్‌ బౌలర్లలో సాయి కిశోర్‌ 4, మోహిత్‌ శర్మ 2, నూర్‌ అహ్మద్‌ 2, రషీద్‌ ఖాన్‌ ఒక వికెట్‌ పడగొట్టారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని