Hardik Pandya: జీవితమంటే అదే.. అలాంటివాటికి దూరంగా పారిపోను: హార్దిక్‌ పాండ్య

ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని ముందుకు సాగడమే తనకు తెలుసునని టీమ్‌ఇండియా వైస్ కెప్టెన్ హార్దిక్‌ పాండ్య వ్యాఖ్యానించాడు.

Published : 02 Jun 2024 13:23 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్‌లో కెప్టెన్సీ గోల.. అది ముగిశాక విడాకులు తీసుకున్నట్లు రూమర్లు.. వరల్డ్‌ కప్‌ జట్టులోకి ఎందుకు ఎంపిక చేశారనే విమర్శలు.. ఇలా భారత క్రికెటర్ హార్దిక్‌ పాండ్యను (Harik Pandya) ఉక్కిరిబిక్కిరి చేసేశాయి. తాజాగా వార్మప్ మ్యాచ్‌లో బంగ్లాపై దూకుడుగా ఆడి 40 పరుగులు చేయడంతోపాటు ఒక వికెట్ తీశాడు. గత కొన్ని నెలలుగా క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నట్లు స్వయంగా పాండ్య వెల్లడించాడు. వాటన్నింటినీ మనో ధైర్యంతో ఎదుర్కోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. 

‘‘ ఎప్పుడూ జీవితమనే యుద్ధంలో నిరంతరం పోరాడుతూనే ఉండాలి. కొన్నిసార్లు క్లిష్టమైన పరిస్థితులు ఎదురవుతాయి. జీవితం లేదా మైదానం ఏదైనా సరే వదిలేస్తే..  అనుకున్న ఫలితాన్ని సాధించడంలో వెనుకబడిపోతామని బలంగా నమ్ముతా. ఇలాంటివి ఎదుర్కోవడం కష్టమని తెలుసు. కానీ, వాటన్నింటిని దాటుకొని ముందుకు సాగడంపైనే దృష్టిపెడతా. గతంలో నాకు  ఇలాంటి పరిస్థితే ఎదురైనప్పుడు ఎలాంటి విధానం అనుసరించానో.. ఇప్పుడూ అలాగే కొనసాగేందుకు ప్రయత్నిస్తా. 

పోరాడుతూ ఉంటే తప్పకుండా పరిస్థితుల్లో మార్పు వస్తుంది. అలాగని జీవితం మొత్తం చెడు రోజులే ఉండవు. మంచి రోజులూ ఉంటాయి. ఇలాంటి దశలను మనం దాటి ముందుకు వెళ్తుండాలి. నా జీవితంలో ఇలాంటి ఫేజ్‌లను ఎన్నోసార్లు అనుభవించా. వాటి నుంచి బయటకు వచ్చా. విజయం సాధించినప్పుడు కూడా ఎక్కువ సీరియస్‌గా తీసుకోను. ఆ తర్వాత ఏం చేయాలనేదానిపైనే దృష్టిపెడతా. కష్టసమయాల్లోనూ ఇలానే ఆలోచిస్తా. నేనెప్పుడూ వాటి నుంచి పారిపోవాలని అనుకోను. చివరి వరకూ పోరాడేందుకే ప్రయత్నిస్తా’’ అని పాండ్య తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని