Punjab Vs Mumbai: ముంబయి గెలవాలంటే.. హార్దిక్‌ ఫామ్‌ అందుకోవడం అత్యవసరం: ఫించ్‌

ముల్లాన్‌పుర్‌ వేదికగా పంజాబ్‌తో తలపడేందుకు ముంబయి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఆ జట్టు విజయం సాధించాలంటే కెప్టెన్ రాణించాలని మాజీ క్రికెటర్ ఫించ్ వ్యాఖ్యానించాడు.

Published : 18 Apr 2024 17:08 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐదుసార్లు ఛాంపియన్‌ ముంబయి జట్టుకు ఐపీఎల్‌ 17వ సీజన్‌ అంతగా కలిసి రావడం లేదు. ఆడిన ఆరు మ్యాచుల్లో కేవలం రెండు విజయాలను మాత్రమే నమోదు చేసింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. ఇవాళ పంజాబ్‌తో ముల్లాన్‌పుర వేదికగా ముంబయి (Punjab vs Mumbai) తలపడనుంది. ఈక్రమంలో ముంబయి మళ్లీ విజయాల బాట పట్టాలంటే ఆ జట్టు కెప్టెన్ హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) ఫామ్‌లోకి రావాల్సిన అవసరం ఉందని ఆసీస్‌ మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ వ్యాఖ్యానించాడు. అభిమానులు హేళన చేస్తున్నా.. జట్టును నడిపించేందుకు పాండ్య పడుతున్న శ్రమ అభినందనీయమని తెలిపాడు. 

‘‘ముంబయి ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలని బలంగా కోరుకుంటే.. కెప్టెన్ పాండ్య ఫామ్‌లోకి రావడం అత్యవసరం. బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్‌లోనూ రాణించాల్సిందే. సారథిగా జట్టును ముందుండి నడిపించాలంటే వ్యక్తిగతంగానూ నాణ్యమైన ఆటతీరు ప్రదర్శించాలి. కొన్ని మ్యాచుల్లో అతడు బౌలింగ్‌ చేస్తాడు. ఇంకొన్నిసార్లు కేవలం బ్యాటింగ్‌కు మాత్రమే వస్తున్నాడు. ఇలాగే కొనసాగితే ముంబయి ఓటమి నుంచి గట్టెక్కడం కష్టమే. బుమ్రా మినహా మిగతా బౌలర్లు నిలకడగా రాణించడం లేదు. అతడికి సరైన సహకారం లభించకపోవడం వల్ల ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తోంది’’ అని ఆరోన్ ఫించ్‌ (Aaron Finch) వెల్లడించాడు. 

పాండ్య మానసికంగా అత్యంత దృఢమైన వ్యక్తి: గోపాల్

తొలి మ్యాచ్‌ నుంచీ హార్దిక్‌ పాండ్యను ప్రేక్షకులు ఘోరంగా అవమానిస్తూ హేళన చేస్తున్నారు. అయినా, పాండ్య వాటినేం పట్టించుకోకుండా ముందుకుసాగుతున్నాడు. అతడు ఎలా వాటిని తట్టుకోగలుగుతున్నాడనే ప్రశ్నకు పాండ్య సహచరుడు శ్రేయస్‌ గోపాల్ సమాధానం ఇచ్చాడు. ‘‘హార్దిక్‌తో స్నేహం పదేళ్ల నుంచి కొనసాగుతోంది. ఇప్పటికీ అతడిలో ఎలాంటి మార్పు లేదు. అతడు మానసికంగా అత్యంత దృఢమైన వ్యక్తి. మాలోనూ ఎంతో స్ఫూర్తినింపుతాడు. రోజూ హేళన చేస్తుంటే తట్టుకోవడం కూడా కష్టమే. కానీ, పాండ్య మాత్రం దానిని వ్యక్తిగతంగా తీసుకోడు. దానిని తలకెక్కించుకోకుండా తన పనేంటో చేసుకుంటూ పోతాడు’’ అని గోపాల్ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని