Hardik in ODI WC 2023: హార్దిక్‌.. ఇలాగే రెచ్చిపో!... కప్పు ముంగిట ఆల్‌రౌండర్‌ మెరుపులు

టీమ్‌ఇండియా విజేతగా నిలిచిన ఆసియా కప్‌లో తన ఆటతో అలరించాడీ ఆల్‌రౌండర్‌. మునుపటి జోరు ప్రదర్శిస్తూ సాగుతున్నాడు. వన్డే ప్రపంచకప్‌లో హార్దిక్‌ ఇలాగే రెచ్చిపోతే టీమ్‌ఇండియాకు తిరుగుండదనే క్రికెట్‌ విశ్లేషకుల అంచనా.

Updated : 20 Sep 2023 12:39 IST

2018 ఆసియా కప్‌.. వెన్ను నొప్పితో ఆ ఆల్‌రౌండర్‌ బాధపడ్డాడు. బౌలింగ్, బ్యాటింగ్‌లో తడబడ్డాడు. గాయం కారణంగా ఆటకు దూరమయ్యాడు. కట్‌ చేస్తే.. ఇప్పుడు 2023 ఆసియా కప్‌. ఆ ఆటగాడే ఆల్‌రౌండ్‌ మెరుపులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. వన్డే ప్రపంచకప్‌ ముందు జట్టులో ఉత్సాహాన్ని నింపుతున్నాడు. అతనే.. హార్దిక్‌ పాండ్య. టీమ్‌ఇండియా విజేతగా నిలిచిన ఆసియా కప్‌లో తన ఆటతో అలరించాడీ ఆల్‌రౌండర్‌. మునుపటి జోరు ప్రదర్శిస్తూ సాగుతున్నాడు. వచ్చే నెల 5న భారత్‌లో ఆరంభమయ్యే వన్డే ప్రపంచకప్‌లో హార్దిక్‌ ఇలాగే రెచ్చిపోతే టీమ్‌ఇండియాకు తిరుగుండదనే చెప్పాలి. 

కప్పు ముందు గాయాలు బాబోయ్‌.. జట్లకు ఆటగాళ్ల గాయాల భయాలు!

‘‘సొంతగడ్డపై జరగబోయే వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా ప్రధాన ఆయుధం హార్దిక్‌’’.. ఇవీ పాకిస్థాన్‌ దిగ్గజ పేసర్‌ వసీమ్‌ అక్రమ్‌ చెప్పిన మాటలు. ‘‘హార్దిక్‌ తిరిగి తన అత్యుత్తమ స్థాయికి చేరుకున్నాడు. ప్రపంచకప్‌కు ముందు టీమ్‌ఇండియాకు ఇది శుభసూచకం’’.. ఇవీ ప్రముఖ క్రికెట్‌ వ్యాఖ్యాత హర్ష భోగ్లే చేసిన వ్యాఖ్యలు. ‘‘ప్రపంచకప్‌లో హర్దిక్‌ ఫిట్‌గా ఉంటే టీమ్‌ఇండియా ఫేవరెట్‌గా మారుతుంది’’.. ఇవీ ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ కామెంట్లు. ఈ మాటలు నిజమనడంలో అతిశయోక్తి లేదు. ఆసియా కప్‌లో హార్దిక్‌ పాండ్య ఆటతీరే అందుకు కారణం. గత కొద్దికాలంగా అతను బౌలింగ్, బ్యాటింగ్‌లో నిలకడగా రాణిస్తూ మళ్లీ జట్టుకు వెన్నెముకగా మారాడు. 

మళ్లీ ఆ మెరుపులు..

ఆసియా కప్‌లో హార్దిక్‌ మెరుపులు ప్రపంచకప్‌ ముందు జట్టుకు భరోసాను, అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఈ టోర్నీలో రెండు ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేసిన హార్దిక్‌ 46 సగటుతో 92 పరుగులు చేశాడు. ముఖ్యంగా పాకిస్థాన్‌తో తొలి పోరులో జట్టు కష్టాల్లో పడ్డ సమయంలో 90 బంతుల్లో 87 పరుగులతో జట్టును ఆదుకున్నాడు. వర్షం కారణంగా ఆ మ్యాచ్‌ రద్దయింది కానీ ఇందులో హార్దిక్‌ బ్యాటింగ్‌ మాత్రం గొప్పగా ఆకట్టుకుంది. తీవ్ర ఒత్తిడిలోనూ పట్టుదలగా క్రీజులో నిలబడి, మంచి పరిణతి ప్రదర్శించాడు. ఇక బౌలింగ్‌లో 4 ఇన్నింగ్స్‌లో 11.33 సగటుతో 6 వికెట్లు పడగొట్టాడు. వికెట్లు తీయడంతో పాటు పరుగులూ కట్టడి చేస్తున్నాడు. అతని ఎకానమీ 3.34గా ఉండటమే అందుకు రుజువు. శ్రీలంకతో ఫైనల్లో మూడు వికెట్లతో లోయర్‌ ఆర్డర్‌ పని పట్టాడు. ప్రధాన బ్యాటర్లను వెనక్కి పంపినా తోకను కత్తిరించలేక భారత్‌ ఎన్నో మ్యాచ్‌ల్లో మంచి అవకాశాలను చేజార్చుకుంది. కానీ ఈ సారి హార్దిక్‌ అలాంటి అవకాశమే ఇవ్వలేదు. 

ఆ గాయాన్ని దాటి..

2018 ఆసియా కప్‌ సమయంలోనే హార్దిక్‌ వెన్నెముక గాయం బారిన పడ్డాడు. ఆ నొప్పితోనే 2019 వన్డే ప్రపంచకప్‌లోనూ ఆడాడు. దీంతో పూర్తిస్థాయిలో రాణించలేకపోయాడు. ఆ టోర్నీ తర్వాత అదే ఏడాది అక్టోబర్‌లో వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకున్నాడు. దీని నుంచి కోలుకునేందుకు చాలా సమయం తీసుకున్నాడు. తిరిగి క్రికెట్లో అడుగుపెట్టినా కేవలం బ్యాటర్‌గానే ఆడాడు. దీంతో కెరీర్‌ ఆరంభంలో మరో కపిల్‌ దేవ్‌ అవుతాడంటూ హార్దిక్‌పై పెట్టుకున్న అంచనాలు తప్పా? అతను కేవలం బ్యాటర్‌గానే కొనసాగుతాడా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ 2022 ఐపీఎల్‌తో అవన్నీ పటాపంచలు అయిపోయాయి. ఆ ఏడాదే అరంగేట్రం చేసిన గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌గా బ్యాటింగ్, బౌలింగ్‌లో హార్దిక్‌ సత్తాచాటాడు. కొత్త బంతితో బౌలింగ్‌ వేయడం.. టాప్‌ ఆర్డర్‌లో వచ్చి పరుగులు చేయడంతో తిరిగి పాత లయ అందిపుచ్చుకున్నాడు. 

ఆ ఏడాది తన జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. ఈ సారి కూడా ఫైనల్‌ తీసుకెళ్లాడు. కానీ తుదిపోరులో సీఎస్కే చేతిలో గుజరాత్‌ ఓడింది. ఒకప్పటి హార్దిక్‌లా మారేందుకు ఐపీఎల్‌ను ఉపయోగించుకున్న అతను.. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్లోనూ దూకుడు కొనసాగిస్తున్నాడు. గత రెండేళ్లుగా బౌలింగ్‌ మెరుగుపర్చుకోవడం కోసం ఎంతో కృషి చేశాడు. ఇప్పుడు ఇలా ఉత్తమంగా స్పెల్‌లు వేస్తున్నాడు. పరుగులు సాధిస్తున్నాడు. కఠిన పరిస్థితుల్లో, తీవ్ర ఒత్తిడిలోనూ తనలోని అత్యుత్తమ ప్రదర్శనను బయటకు తీయడం హార్దిక్‌కు అలవాటు. అతని ఫామ్‌ జట్టుకు ఎంతో అవసరం. 2019లో ఇంగ్లాండ్‌కు స్టోక్స్‌ లాగా ఈ సారి భారత్‌కు హార్దిక్‌ కీలకంగా మారతాడనే అంచనాలున్నాయి. ఈ ఏడాది వన్డేల్లో అతని ప్రదర్శన కూడా బాగుంది. 2023లో ఇప్పటివరకూ బ్యాటింగ్‌లో 12 ఇన్నింగ్స్‌లో 372 పరుగులు చేశాడు. 15 ఇన్నింగ్స్‌లో 16 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రపంచకప్‌లో అతను ఫిట్‌గా ఉంటూ.. అయిదారు ఓవర్లు ఉత్తమంగా బౌలింగ్‌ చేయడంతో పాటు టాప్‌-6లో బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరిపిస్తే జట్టుకు ఎంతో మేలవుతుంది. 

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని