ODI WC 2023: కప్పు ముందు గాయాలు బాబోయ్‌.. జట్లకు ఆటగాళ్ల గాయాల భయాలు!

మెగా సమరం (ODI World Cup 2023) ప్రారంభంకానున్న వేళ అన్ని జట్లకూ గాయాలబెడద ఆందోళనగా మారింది. కొంతమంది తాజాగా గాయపడటం.. మరికొందరికి గాయాలు తిరగబెట్టడం అభిమానులను కంగారుకు గురి చేస్తోంది.

Published : 19 Sep 2023 11:02 IST

ఓ వైపు వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023) ముంచుకొస్తోంది.. అక్టోబర్‌ 5నే భారత్‌లో ఈ మెగా టోర్నీ ఆరంభమవుతుంది. కానీ కప్పు ముందు జట్లకు ఆటగాళ్ల గాయాలు.. భయాలు పుట్టిస్తున్నాయి. శ్రేయస్‌ అయ్యర్, అక్షర్‌ పటేల్‌ (భారత్‌), టిమ్‌ సౌథీ, విలియమ్సన్‌ (న్యూజిలాండ్‌), నోకియా, బవుమా (దక్షిణాఫ్రికా), నజ్మల్‌ శాంటో, ఎబాదత్, తమీమ్‌ ఇక్బాల్‌ (బంగ్లాదేశ్‌), కమిన్స్, స్మిత్, స్టార్క్, మ్యాక్స్‌వెల్, అగర్, ట్రేవిస్‌ హెడ్‌ (ఆస్ట్రేలియా), నసీమ్‌ షా, హారిస్‌ రవూఫ్, సల్మాన్‌ అఘా, ఇమాముల్‌ హక్‌ (పాకిస్థాన్‌), ఆదిల్‌ రషీద్, మార్క్‌వుడ్, జోఫ్రా ఆర్చర్, జేసన్‌ రాయ్‌ (ఇంగ్లాండ్‌), హసరంగ, తీక్షణ, చమీర, మదుశంక (శ్రీలంక).. ఇలా దాదాపు అన్ని జట్లలోనూ ప్రస్తుతం కొంతమంది ఆటగాళ్లు గాయాల బారిన పడ్డారు. వీళ్లలో కొంతమంది ప్రపంచకప్‌ నాటికి కోలుకునే అవకాశముంది. కానీ నసీˆమ్‌ షా, సౌథీ, ఎబాదత్, హెడ్‌ లాంటి ఆటగాళ్లు టోర్నీ మొత్తానికి దూరమయ్యే ప్రమాదం ఉంది. 

అంతలోనే..

స్వదేశంలో వన్డే ప్రపంచకప్‌. జట్టుపై ఎన్నో అంచనాలు. కానీ ఆటగాళ్ల గాయాలు టీమ్‌ఇండియాకు ప్రధాన సమస్యగా ఉండేది. కీలక పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, స్టార్‌ ఆటగాళ్లు కేఎల్‌ రాహుల్, శ్రేయస్‌ అయ్యర్‌.. శస్త్రచికిత్సల నుంచి ఎప్పుడు కోలుకుంటారో? తిరిగి జట్టులో ఎప్పుడు అడుగుపెడతారో? అని జట్టు మేనేజ్‌మెంట్‌తో పాటు అభిమానులూ ఎదురు చూశారు. ఆ ఎదురు చూపులు ఫలించి.. సరిగ్గా ప్రపంచకప్‌కు ముందు ఈ ఆటగాళ్లు జట్టులోకి వచ్చారు. ముందుగా బుమ్రా.. ఆ తర్వాత శ్రేయస్, కేఎల్‌ రాహుల్‌ పునరాగమనం చేశారు. ప్రపంచకప్‌కు జట్టును కూడా ప్రకటించేశారు. అదే జట్టును ఆసియా కప్‌లో దించారు. ఇంకేముంది ఆసియా కప్‌లో జట్టు మంచిగా సన్నద్ధమై.. సొంతగడ్డపై ప్రపంచకప్‌లో రాణిస్తుందని అభిమానులు అనుకున్నారు. కానీ ఇప్పుడు మళ్లీ కథ అడ్డం తిరిగింది. శ్రేయస్‌ను వెన్ను నొప్పి మళ్లీ బాధిస్తోంది. ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో అతను కేవలం 9 బంతులే ఆడి ఔటైపోయాడు. నేపాల్‌తో బ్యాటింగ్‌ చేసే అవకాశమే రాలేదు. కానీ ఇంతలోనే మళ్లీ వెన్ను నొప్పి అని సూపర్‌- 4లో పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లకు అతను దూరమయ్యాడు. శ్రేయస్‌ కోలుకుంటున్నాడు కానీ ఇంకా పూర్తి ఫిట్‌నెస్‌ సాధించలేదని తెలిసింది. ఒకవేళ జట్టులోకి వచ్చినా.. మళ్లీ గాయం పేరుతో బయటకు వెళ్లకూడదనేది అభిమానుల కోరిక.

మరోవైపు అక్షర్‌ పటేల్‌కు తాజాగా గాయాలవడం ఆందోళన కలిగిస్తోంది. బంగ్లాతో మ్యాచ్‌లో అతనికి చిటికెన వేలు, మోచేతి గాయాలతో పాటు తొడ కండరాలు పట్టేశాయి. దీంతో అతని స్థానంలో వాషింగ్టన్‌ సుందర్‌ను పిలిపించారు. అక్షర్‌ ఇప్పటికిప్పుడే కోలుకోవడం కష్టమేనన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మరి ప్రపంచకప్‌ నాటికి అతను ఫిట్‌నెస్‌ సాధిస్తాడా? లేదా అతని స్థానంలో వేరొకరిని ఆడిస్తారా? అన్నది చూడాలి. 

ఈ జట్లకు గట్టిదెబ్బ..

ఆటగాళ్ల గాయాల కారణంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాకు గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంది. శస్త్రచికిత్స నుంచి వేగంగా కోలుకుంటున్న విలియమ్సన్‌ ప్రపంచకప్‌ నాటికి ఫిట్‌నెస్‌ సాధిస్తాడని న్యూజిలాండ్‌ ఆశలు పెట్టుకుంది. అందుకే అతనే కెప్టెన్‌గా ప్రపంచకప్‌ జట్టును ప్రకటించింది. కానీ శస్త్రచికిత్స నుంచి కోలుకోవడం అంటే సుదీర్ఘ ప్రక్రియ. ఒకవేళ విలియమ్సన్‌ ఫిట్‌గా మారిన ప్రపంచకప్‌లో ఆడటంపై అనుమానాలు మాత్రం అలాగే కొనసాగుతాయి. తాజాగా ఇంగ్లాండ్‌తో నాలుగో వన్డేలో క్యాచ్‌ పట్టే క్రమంలో కివీస్‌ సీనియర్‌ పేసర్‌ సౌథీ కుడిచేతి బొటన వేలికి గాయమైంది. గాయం తీవ్రత ఎక్కువగానే ఉందని, అతను ప్రపంచకప్‌ ఆడటంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

మియా వెనుక భయ్యా... సిరాజ్‌ను దిద్దిన విరాట్‌ కోహ్లి

ఇక పాకిస్థాన్‌కు ఆసియా కప్‌ సూపర్‌-4 మ్యాచ్‌లోనే ఎదురు దెబ్బ తగిలింది. జట్టుకు కీలకంగా మారిన పేసర్లు నసీమ్‌ షా, హారిస్‌ రవూఫ్, సల్మాన్‌ అఘా గాయాల పాలయ్యారు. భుజం గాయంతో నసీమ్‌ ప్రపంచకప్‌తో పాటు ఆ తర్వాత కొన్ని నెలలు కూడా ఆటకు దూరంగా ఉండే అవకాశముందని తెలిసింది. బంగ్లాదేశ్‌కు కీలకమైన బౌలర్‌ ఎబాదత్, బ్యాటర్‌ తమీమ్‌ ఇక్బాల్‌ కూడా ఇంకా గాయాల నుంచి కోలుకోలేదు. ఈ కారణంతోనే ఆసియా కప్‌లోనూ ఆడలేదు. నజ్మల్‌ శాంటో కూడా గాయపడ్డాడు. ఇక ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ జట్టులో ప్రస్తుతం గాయాల నుంచి కోలుకుంటున్న ఆటగాళ్ల జాబితా పెద్దగానే ఉంది. కమిన్స్, స్మిత్, స్టార్క్, మ్యాక్స్‌వెల్, అగర్‌ ప్రపంచకప్‌ వరకు ఫిట్‌నెస్‌ సాధించేలా కనిపిస్తున్నారు. కానీ హెడ్‌ మాత్రం ఆ మెగా టోర్నీ ఆడే అవకాశం లేదనే చెప్పాలి. ఆర్చర్‌ మినహా గాయపడ్డ ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు ప్రపంచకప్‌ వరకు కోలుకునే ఆస్కారముంది. తమ ఆటగాళ్లు త్వరగానే కోలుకుంటారని దక్షిణాఫ్రికా, శ్రీలంక ఆశతో ఉన్నాయి. 


- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని