Kolkata Vs Hyderabad: ‘హార్ట్‌ బ్రేకింగ్ ఫొటో ఆఫ్‌ ది మ్యాచ్‌’.. దిగాలుగా హైదరాబాద్‌ బ్యాటర్‌

దూకుడుగా ఆడుతూ.. జట్టును కాపాడే ప్రయత్నం చేస్తున్న తరుణంలో రనౌట్‌ కావడం ఏ బ్యాటర్‌కైనా తీవ్ర బాధను కలిగిస్తుంది. ఇదే అనుభవం రాహుల్ త్రిపాఠికి ఎదురైంది.

Updated : 22 May 2024 07:41 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్ 17వ సీజన్‌ తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌కు చుక్కెదురైంది. కోల్‌కతా ఛాంపియన్‌ ఆటతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. టాస్‌ నెగ్గిన ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్లు తక్కువ స్కోరుకే పరిమితమై నిరాశపరిచారు. వన్‌డౌన్‌లో వచ్చిన రాహుల్ త్రిపాఠి (55:35 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్‌) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా దూకుడుగా పరుగులు రాబట్టాడు. గత కొన్ని మ్యాచుల్లో పెద్దగా రాణించని అతడు ఈసారి భారీ స్కోరు చేస్తాడని అంతా భావించారు. అయితే, కోల్‌కతా ఆటగాడు ఆండ్రి రస్సెల్ అద్భుత ఫీల్డింగ్‌తో (13.2వ ఓవర్‌ 121 పరుగుల వద్ద) రనౌట్‌ చేయడంతో త్రిపాఠి (Rahul Tripati) నిరాశగా పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత ఎస్‌ఆర్‌హెచ్‌ స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లను కోల్పోయింది. దీంతో డగౌట్‌కు వెళ్లే మార్గంలోనే మెట్లపై కూర్చుండిపోయిన త్రిపాఠి బాధపడుతున్న ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ‘ఇదే అత్యంత బాధాకరమైన ఫొటో’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు. మ్యాచ్‌ అనంతరం సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ (Pat Cummins) కీలక వ్యాఖ్యలు చేశాడు. 

‘‘మళ్లీ త్వరలోనే ఇలాంటి రోజును మరిచే ప్రదర్శనను చేస్తాం. రెండో క్వాలిఫయర్‌ ఉండటం మాకు కలిసొచ్చే అంశం. తప్పకుండా అక్కడ గెలిచి ముందుకొస్తాం. ప్రతిసారి మనం అనుకున్న ఫలితం రావడం సాధ్యం కాదు. టీ20 క్రికెట్‌లో ఏ క్షణం ఏం జరుగుతుందో అంచనా వేయలేం. బ్యాటింగ్‌లో వెనుకబడిన మేం.. బౌలింగ్‌లోనూ అనుకున్నంత మేర రాణించలేకపోయాం. నాణ్యమైన ఇన్నింగ్స్‌తో త్రిపాఠి, క్లాసెన్‌ మళ్లీ రేసులోకి తెచ్చినా.. దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాం. అదనంగా ఒక బ్యాటర్‌ను తీసుకొని ఉంటే ఇంకా బాగుండేది. కోల్‌కతా బౌలర్లు అద్భుతంగా బంతులేశారు. ఇప్పటి వరకు చాలా క్రికెట్‌ ఆడాం. కొత్త వేదిక (చెపాక్‌) నుంచి మాకు సహకారం లభిస్తుందని భావిస్తున్నాం. ఈ మ్యాచ్‌ ఫలితాన్ని పక్కన పెట్టేసి ముందుకు సాగాల్సిన అవసరం ఉంది’’ అని కమిన్స్‌ వెల్లడించాడు.  హైదరాబాద్‌ నిర్దేశించిన 160 పరుగుల టార్గెట్‌ను కోల్‌కతా 13.4 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి ఛేదించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని