Hyderabad vs Rajasthan: బౌలర్ల దెబ్బకు బెంబేలెత్తిన రాజస్థాన్‌.. ఫైనల్‌కు దూసుకెళ్లిన హైదరాబాద్‌

క్వాలిఫయర్‌-2లో రాజస్థాన్‌ను హైదరాబాద్‌ 36 పరుగుల తేడాతో చిత్తుచేసి ఫైనల్‌కు దూసుకెళ్లింది. 176 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 139 పరుగులకే పరిమితం అయింది.  

Updated : 24 May 2024 23:55 IST

చెన్నై: గతేడాది పేలవమైన ఆటతో పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పరిమితమైన హైదరాబాద్‌.. ఈ సీజన్‌లో ఆరంభం నుంచే అద్భుతంగా ఆడి ఇప్పుడు ఏకంగా ఫైనల్‌కు చేరుకుంది. క్వాలిఫయర్‌ 2లో రాజస్థాన్‌ను 36 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది సన్‌రైజర్స్‌. చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఈ లక్ష్యఛేదనలో రాజస్థాన్‌ 139/7కు పరిమితమైంది. ఆరంభంలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (42; 21 బంతులలో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడటంతో రాజస్థాన్‌ విజయం సాధించేలా కనిపించింది. కానీ, హైదరాబాద్‌ స్పిన్నర్లు వరుసగా వికెట్లు పడగొట్టి మ్యాచ్‌పై పట్టుబిగించారు. 79 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన రాజస్థాన్‌.. ధ్రువ్ జురెల్ (56*; 35 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) పోరాడటంతో ఆమాత్రం స్కోరైనా చేయగలిగింది. లేకుంటే భారీ తేడాతో చిత్తుగా ఓడిపోయేది. స్నిన్నర్లు (షాబాజ్‌ అహ్మద్ 3/23), అభిషేక్ శర్మ (2/24) అదరగొట్టారు. నటరాజన్, కమిన్స్‌ తలో వికెట్ తీశారు. ఆదివారం కోల్‌కతా, హైదరాబాద్‌ మధ్య టైటిల్‌ పోరు జరగనుంది. 

హైదరాబాద్‌ బ్యాటర్లలో హెన్రిచ్‌ క్లాసెన్‌ (50; 34 బంతుల్లో 4 సిక్స్‌లు) అర్ధశతకం చేయగా.. రాహుల్ త్రిపాఠి (37; 15 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) క్రీజులో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించాడు. ట్రావిస్ హెడ్ (34; 28 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించాడు. అభిషేక్ శర్మ (12), నితీశ్ రెడ్డి (5), మార్‌క్రమ్ (1), అబ్దుల్ సమద్‌ (0) నిరాశపర్చారు. షాబాజ్ అహ్మద్‌ (18) రన్స్ చేశాడు. రాజస్థాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 3, అవేశ్ ఖాన్ 3, సందీప్ శర్మ 2 వికెట్లు పడగొట్టారు. 

  • సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫైనల్ చేరడం ఇది మూడోసారి. 2016 ఛాంపియన్‌గా, 2018లో రన్నరప్‌గా నిలిచింది.   
  • ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి బ్యాటింగ్‌లో 18 పరుగులు చేసి కీలక సమయంలో 3 వికెట్లు పడగొట్టిన షాబాజ్ అహ్మద్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు.
  • తొలి క్వాలిఫయర్‌లో తలపడిన కోల్‌కతాతోనే ఫైనల్‌లో తలపడనుంది హైదరాబాద్‌. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని