Virat Kohli: టీ20 ప్రమోషన్‌కు ఇంకా నా పేరే.. వారికి స్పష్టమైన సమాధానమిచ్చిన కోహ్లి!

Virat Kohli: ఐపీఎల్‌లో పంజాబ్‌ టీమ్‌పై గెలిచిన బెంగళూరు జట్టు సోమవారం తొలి విజయాన్ని నమోదు చేసింది. దీంట్లో విరాట్‌ కోహ్లి కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్‌ అనంతరం అతడు కీలక వ్యాఖ్యలు చేశాడు.

Updated : 26 Mar 2024 09:47 IST

బెంగళూరు: ఐపీఎల్‌లో బెంగళూరు తొలి విజయంలో ప్రధాన పాత్ర పోషించిన విరాట్ కోహ్లి (Virat Kohli) మ్యాచ్‌ అనంతరం కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా టీ20 క్రికెట్‌ను ప్రమోట్‌ చేయడానికి తన పేరునే వాడుకుంటున్నారని తెలిపాడు. రాబోయే టీ20 వరల్డ్‌ కప్‌ జట్టులో అతని స్థానంపై అనుమానాలున్న వారికి స్పష్టమైన సమాధానమిచ్చారు. టీ20 ఫార్మాట్‌పై తానింకా పట్టు కోల్పోలేదని చెప్పకనే చెప్పాడు.

విరాట్‌ కోహ్లి (77; 49 బంతుల్లో 11×4, 2×6) చెలరేగడంతో సోమవారం ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో బెంగళూరు 4 వికెట్ల తేడాతో పంజాబ్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో విరాట్‌ ఆరెంజ్‌ క్యాప్‌ అందుకున్నాడు. తాను ఇంకా ఇలాంటి ప్రోత్సాహకాల కోసం ఆడడం లేదని.. ఎప్పుడూ అత్యుత్తమ ఆట ఇవ్వడానికే ప్రయత్నిస్తానని తెలిపాడు. అయితే, మ్యాచ్‌ స్వయంగా తానే ముగించలేకపోవడంపై నిరాశ వ్యక్తం చేశాడు. ‘‘జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని అందించడానికి ప్రయత్నిస్తాను. అయితే, వికెట్లు పడితే మాత్రం పరిస్థితులను అంచనా వేసుకోవాల్సి ఉంటుంది. ఇది సాధారణ ఫ్లాట్ పిచ్ కాదు. గేమ్‌ను ముగించలేకపోవడం నిరాశపర్చింది. స్లాట్‌లో ఉన్న బంతిని డీప్‌ పాయింట్‌లోకి మళ్లించటంతో దొరికిపోయాను. నేను కవర్‌ డ్రైవ్‌ బాగా ఆడతానని వారికి తెలుసు. అందుకే గ్యాప్‌లో కొట్టకుండా నన్ను నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో ఎప్పటికప్పుడు వ్యూహాన్ని మార్చాల్సి వచ్చింది’’ అని విరాట్‌ అన్నాడు.

కింగ్‌ దంచేశాడు..

బెంగళూరు ఫ్యాన్స్‌ నుంచి లభిస్తున్న మద్దతుకు ఈ సందర్భంగా కోహ్లి (Virat Kohli) సంతోషం వ్యక్తం చేశాడు. చిన్నస్వామి స్టేడియంలో తనకు, అభిమానులకు మధ్య ఏళ్లుగా ప్రేమాయణం కొనసాగుతోందని సరదాగా వ్యాఖ్యానించాడు. మరోవైపు రెండు నెలల విరామం వల్ల కుటుంబంతో గడిపేందుకు అవకాశం లభించిందని తెలిపాడు. తమ ఫ్యామిలీ ఇది అద్భుతమైన సమయమని చెప్పాడు. ముఖ్యంగా తన కూతురు వామికతో ఆనందంగా గడిపినట్లు వెల్లడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు