కింగ్‌ దంచేశాడు..

విరాట్‌ అదుర్స్‌. చిన్నస్వామి స్టేడియంలో కళ్లు చెదిరే షాట్లతో అతడు కనువిందు చేసిన వేళ.. ఐపీఎల్‌-17లో ఆర్సీబీ బోణీ కొట్టింది. ఓ వైపు వికెట్లు పోతున్నా, పెద్దగా సహకారం అందకున్నా సూపర్‌ బ్యాటింగ్‌తో కోహ్లి జట్టును లక్ష్యం దిశగా నడిపిస్తే..

Updated : 26 Mar 2024 06:54 IST

పంజాబ్‌పై బెంగళూరు విజయం
మెరిసిన కార్తీక్‌
బెంగళూరు

విరాట్‌ అదుర్స్‌. చిన్నస్వామి స్టేడియంలో కళ్లు చెదిరే షాట్లతో అతడు కనువిందు చేసిన వేళ.. ఐపీఎల్‌-17లో ఆర్సీబీ బోణీ కొట్టింది. ఓ వైపు వికెట్లు పోతున్నా, పెద్దగా సహకారం అందకున్నా సూపర్‌ బ్యాటింగ్‌తో కోహ్లి జట్టును లక్ష్యం దిశగా నడిపిస్తే.. ఆఖర్లో ఒత్తిడిలో దినేశ్‌ కార్తీక్‌, లొమ్రార్‌ అదిరే ఆటతో జట్టును విజయ తీరాలకు చేర్చారు. టోర్నీలో పంజాబ్‌ తొలి పరాజయం చవిచూసింది.

పీఎల్‌-17లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు తొలి విజయం. విరాట్‌ కోహ్లి (77; 49 బంతుల్లో 11×4, 2×6) చెలరేగడంతో సోమవారం ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో పంజాబ్‌ను ఓడించింది. మొదట పంజాబ్‌ 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ (45; 37 బంతుల్లో 5×4, 1×6) టాప్‌ స్కోరర్‌. జితేశ్‌ శర్మ (27; 20 బంతుల్లో 1×4, 2×6), ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (25; 17 బంతుల్లో 2×4, 2×6), సామ్‌ కరన్‌ (23; 17 బంతుల్లో 3×4) రాణించారు. సిరాజ్‌, మ్యాక్స్‌వెల్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు .కోహ్లి శ్రమను   సద్వినియోగం చేస్తూ ముగింపులో దినేశ్‌ కార్తీక్‌ (28 నాటౌట్‌; 10 బంతుల్లో 3×4, 2×6), లొమ్రార్‌ (17 నాటౌట్‌; 8 బంతుల్లో 2×4, 1×6) అదరగొట్టడంతో లక్ష్యాన్ని బెంగళూరు 19.2  ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. హర్‌ప్రీత్‌ బ్రార్‌ (2/13), రబాడ (2/23) అద్భుతంగా బౌలింగ్‌ చేసినా ఫలితం లేకపోయింది. అర్ష్‌దీప్‌ (3.2 ఓవర్లలో 40), హర్షల్‌ పటేల్‌ (1/45) ధారాళంగా పరుగులిచ్చారు.

కోహ్లి అదరహో..: బెంగళూరు ఛేదనలో విరాట్‌ కోహ్లి ఆటే హైలైట్‌. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయినా ఆ జట్టు రేసులో నిలిచిందంటే కారణం కోహ్లి మాత్రమే. సాధికారిక బ్యాటింగ్‌తో అతడు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.. ఖాతా అయినా తెరవకముందే బెయిర్‌స్టో క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయిన కోహ్లి.. అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. సామ్‌ కరన్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్లో బెయిర్‌స్టో చేజారిన బంతి..బౌండరీకి వెళ్లింది. అదే ఓవర్లో కోహ్లి మరో మూడు ఫోర్లు కొట్టాడు. మరో ఓపెనర్‌ డుప్లెసిస్‌ (3)ను రబాడ త్వరగానే వెనక్కి పంపినా కోహ్లి దూకుడైన బ్యాటింగ్‌ను కొనసాగించాడు. ముచ్చటైన షాట్లతో అలరించిన అతడు.. ఈసారి అర్ష్‌దీప్‌ బౌలింగ్‌లో మూడు బంతులను బౌండరీ దాటించాడు. గ్రీన్‌ (3) ఇలా వచ్చి అలా వెళ్లినా.. రజత్‌ పటీదార్‌తో కలిసి కోహ్లి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. అయితే పటీదార్‌ (18) ధాటిగా ఆడలేకపోయాడు. అదే సమయంలో కోహ్లి దూకుడు కూడా తగ్గింది. పది ఓవర్లకు స్కోరు 85/2. బ్రార్‌ వరుస ఓవర్లలో పటీదార్‌, ప్రమాదకర మ్యాక్స్‌వెల్‌ (3) నిష్క్రమించడం, స్కోరు వేగం తగ్గడంతో మ్యాచ్‌ ఆసక్తికరంగా మారింది. 15 ఓవర్లకు స్కోరు 118/4. కోహ్లి క్రీజులో ఉండడంతో బెంగళూరు భరోసాతోనే ఉంది. అందుకు తగ్గట్లే హర్షల్‌ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లతో అతడు అలరించాడు. కానీ అదే ఓవర్లో కోహ్లి, తర్వాతి ఓవర్లో అనుజ్‌ రావత్‌ (11) ఔట్‌ కావడంతో బెంగళూరుపై ఒత్తిడి పెరిగింది. ఆ జట్టు చివరి 23 బంతుల్లో 47 పరుగులు చేయాల్సిన పరిస్థితి. కానీ ఇంపాక్ట్‌ ప్లేయర్‌ లొమ్రార్‌ నిజంగానే ప్రభావం చూపాడు. అతడి మెరుపులతో ఆఖరి రెండు ఓవర్లలో 23 చేయాల్సిన స్థితిలో నిలిచింది ఆర్సీబీ. ఆ స్థితిలో కార్తీక్‌ చెలరేగిపోయాడు. హర్షల్‌ బౌలింగ్‌లో ఓ ఫోర్‌, సిక్స్‌ దంచిన అతడు.. ఆఖరి ఓవర్లో అర్ష్‌దీప్‌ బౌలింగ్‌లో 6, 4 బాదేసి మరో నాలుగు బంతులుండగానే మ్యాచ్‌ను ముగించాడు.

మెరిసిన ధావన్‌: అంతకుముందు పంజాబ్‌ ఇన్నింగ్స్‌ ఏ దశలోనూ ఎక్కువ జోరందుకోలేదు. కానీ కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ కీలక ఇన్నింగ్స్‌, మిడిల్‌ ఆర్డర్‌ మెరుపులతో  ఆ జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. చిన్నస్వామి స్టేడియం పిచ్‌ బ్యాటింగ్‌కు ఎప్పటంత అనుకూలంగా లేదు. పంజాబ్‌ కింగ్స్‌కు మంచి ఆరంభమేమీ దక్కలేదు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు పవర్‌ ప్లే ముగిసే సరికి వికెట్‌ నష్టానికి చేసింది 40 పరుగులే. బెయిర్‌స్టో (8) మూడో ఓవర్లోనే ఔట్‌ కాగా.. మరో ఓపెనర్‌ ధావన్‌ ఎదుర్కొన్న తొలి 21 బంతుల్లో 21 పరుగులే చేశాడు. ప్రభ్‌సిమ్రన్‌ కూడా తొలి 9 బంతుల్లో 10 పరుగులే సాధించాడు. ఆ తర్వాత ప్రభ్‌సిమ్రన్‌ రెండు సిక్స్‌లు.. ధావన్‌ సిక్స్‌, ఫోర్‌ బాదడంతో ఇన్నింగ్స్‌కు ఊపొచ్చినట్లనిపించింది. కానీ కింగ్స్‌ ఆనందం తాత్కాలికమే. ప్రభ్‌సిమ్రన్‌ దూకుడును ఎంతో సేపు సాగనివ్వలేదు మ్యాక్స్‌వెల్‌. మరోవైపు ఫోర్‌, సిక్స్‌తో ఊపుమీద కనిపించిన విధ్వంసక వీరుడు లివింగ్‌స్టన్‌ (17) ఇన్నింగ్స్‌కు జోసెఫ్‌, ఆ వెంటనే ధావన్‌ను మ్యాక్స్‌వెల్‌ వెనక్కి పంపడంతో పంజాబ్‌ 13 ఓవర్లలో 102/4తో నిలిచింది. కానీ ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడిన జితేశ్‌ శర్మ ఆ జట్టును ఆదుకున్నాడు. సామ్‌ కరన్‌ కూడా బ్యాట్‌ ఝళిపించడంతో పరుగులు వేగంగా వచ్చాయి. ఈ జంట 32 బంతుల్లో 52 పరుగులు జోడించింది. 18వ ఓవర్లో సామ్‌ కరన్‌ను యశ్‌ దయాల్‌ ఔట్‌ చేయడంతో ఈ భాగస్వామ్యం విడిపోయింది. జితేశ్‌ శర్మ తర్వాతి ఓవర్లోనే నిష్క్రమించినా.. ఆఖరి ఓవర్లో (అల్జారి జోసెఫ్‌) శశాంక్‌ సింగ్‌ (21 నాటౌట్‌; 8 బంతుల్లో 1×4, 2×6) రెండు సిక్స్‌లు, ఓ ఫోర్‌ బాదడంతో పంజాబ్‌ స్కోరు 170 దాటింది.

పంజాబ్‌ ఇన్నింగ్స్‌: శిఖర్‌ ధావన్‌ (సి) కోహ్లి (బి) మ్యాక్స్‌వెల్‌ 45; బెయిర్‌స్టో (సి) కోహ్లి (బి) సిరాజ్‌ 8; ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (సి) అనుజ్‌ రావత్‌ (బి) మ్యాక్స్‌వెల్‌ 25; లివింగ్‌స్టన్‌ (సి) అనుజ్‌ రావత్‌ (బి) జోసెఫ్‌ 17;  సామ్‌ కరన్‌ (సి) అనుజ్‌ రావత్‌ (బి) యశ్‌ దయాల్‌ 23; జితేశ్‌ శర్మ (సి) అనుజ్‌ రావత్‌ (బి) సిరాజ్‌ 27; శశాంక్‌ సింగ్‌ నాటౌట్‌ 21; హర్‌ప్రీత్‌ బ్రార్‌ 2; ఎక్స్‌ట్రాలు 8 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 176; వికెట్ల పతనం: 1-17, 2-72, 3-98, 4-98, 5-150, 6-154; బౌలింగ్‌: సిరాజ్‌ 4-0-26-2; యశ్‌ దయాల్‌ 4-0-23-1; అల్జారి జోసెఫ్‌ 4-0-43-1; గ్రీన్‌ 2-0-19-0; మయాంక్‌ దాగర్‌ 3-0-34-0; మ్యాక్స్‌వెల్‌ 3-0-29-2

బెంగళూరు ఇన్నింగ్స్‌: కోహ్లి (సి) హర్‌ప్రీత్‌ (బి) హర్షల్‌ 77; డుప్లెసిస్‌ (సి) కరన్‌ (బి) రబాడ 3; గ్రీన్‌ (సి) జితేశ్‌ (బి) రబాడ 3; పటీదార్‌ (బి) హర్‌ప్రీత్‌ 18; మ్యాక్స్‌వెల్‌ (బి) హర్‌ప్రీత్‌ 3; అనుజ్‌ ఎల్బీ (బి) కరన్‌ 11; కార్తీక్‌ నాటౌట్‌ 28; లొమ్రార్‌ నాటౌట్‌ 17; ఎక్స్‌ట్రాలు 18 మొత్తం: (19.2 ఓవర్లలో 6 వికెట్లకు) 178; వికెట్ల పతనం: 1-26, 2-43, 3-86, 4-103, 5-130, 6-130; బౌలింగ్‌: సామ్‌ కరన్‌ 3-0-30-1; అర్ష్‌దీప్‌ 3.2-0-40-0; రబాడ 4-0-23-2; హర్‌ప్రీత్‌ బ్రార్‌ 4-0-13-2; హర్షల్‌ పటేల్‌ 4-0-45-1; రాహుల్‌ చాహర్‌ 1-0-16-0

ఐపీఎల్‌లో ఈనాడు

చెన్నై × గుజరాత్‌
వేదిక: చెన్నై, రా।। 7.30


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని