Ishan Kishan: వరల్డ్‌ కప్‌లో రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితమైనా.. నేనలా ప్రశ్నించుకొనేవాడిని: ఇషాన్‌ కిషన్‌

టీమ్‌ఇండియా యువ బ్యాటర్ ఇషాన్‌ కిషన్‌ ఆసీస్‌తో తొలి టీ20లో (IND vs AUS) అదరగొట్టేశాడు. సూర్యతోపాటు ఇషాన్‌ కూడా అర్ధశతకం బాదడంతో భారత్‌ 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.

Published : 24 Nov 2023 12:29 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023) ఆరంభంలో శుభ్‌మన్‌ గిల్ గైర్హాజరీలో మ్యాచులను ఆడిన భారత యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఆ తర్వాత రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇప్పుడు ఆసీస్‌తో టీ20 సిరీస్‌లో (IND vs AUS) స్థానం దక్కించుకున్న ఇషాన్‌ తొలి మ్యాచ్‌లోనే కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. వరల్డ్‌ కప్‌లో రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితమైనప్పటికీ నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేయడం మాత్రం ఆపలేదని ఇషాన్‌ (Ishan Kishan) తెలిపాడు. ఇప్పుడదే టీ20 మ్యాచ్‌లో రాణించేందుకు సాయపడిందని పేర్కొన్నాడు. ఆసీస్‌ లెగ్‌ స్పిన్నర్ తన్వీర్ సంఘా బౌలింగ్‌లోనే ఇషాన్‌ పెవిలియన్‌కు చేరినా.. అతడి బౌలింగ్‌లో కేవలం 10 బంతుల్లోనే 30 పరుగులు రాబట్టడం గమనార్హం. 

‘‘వరల్డ్‌ కప్‌ సందర్భంగా నేను తుది జట్టులో లేనప్పుడు కూడా ప్రాక్టీస్‌ చేయడం మాత్రం ఆపలేదు. ‘ఇవాళ నేనేం చేయాలి. ఈ సెషన్‌ నాకు ఎందుకు ముఖ్యం’ అని నాకు నేనుగా ప్రశ్నించుకునేవాడిని. నెట్స్‌లో విపరీతంగా శ్రమిస్తూనే ఉన్నా. కోచింగ్‌ సిబ్బందితో నా ఆట గురించి మాట్లాడుతూనే ఉన్నా. ఏ బౌలర్‌ను టార్గెట్‌ చేయాలి? గేమ్‌ను ఎలా ముందుకు తీసుకెళ్లాలి? ఎడమ చేతివాటం బ్యాటర్‌గా లెగ్‌ స్పిన్నర్‌ వేసే బంతులపై ఓ అంచనా ఉంది.  భారీ లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు 20 ఓవర్లపాటు క్రీజ్‌లో ఉండేందుకు ప్రయత్నించాలి. తప్పకుండా ఎవరో ఒక బౌలర్‌ను లక్ష్యం చేసుకోవాలి. ఇన్నింగ్స్‌పై సూర్యకుమార్‌తో మాట్లాడా. సంఘా బౌలింగ్‌ను ఎటాక్‌ చేయాల్సిన అవసరం ఉందని భావించాం. 

ఆసీస్‌ నిర్దేశించిన 209 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో వీలైనన్ని ఎక్కువ రన్స్‌ టాప్‌ ఆర్డర్‌ చేయాలి. అప్పుడే ఆ తర్వాత వచ్చే బ్యాటర్లపై ఒత్తిడి తక్కువగా ఉంటుంది. ఎందుకంటే చివర్లో భారీ షాట్లు కొట్టడం కష్టం. అందుకే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని భావించా. స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లను కోల్పోయాం. దీంతో సూర్యతో భాగస్వామ్యం నిర్మించడం చాలా కీలకం. అదే సమయంలో రన్‌రేట్‌ పడిపోకుండా చూసుకోవాలి. ఐపీఎల్‌లో మేమిద్దరం కలిసి ఆడిన అనుభవం ఉంది.  నేను ఎలా ఆడతాననేది సూర్యకు తెలుసు. అతడి షాట్లు గురించి నాకు తెలుసు. మా మధ్య కమ్యూనికేషన్‌ అద్భుతం. ఏ బౌలర్‌ను టార్గెట్ చేయాలని మాట్లాడుకుంటూనే ఉన్నాం. 

విశాఖ పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలంగా లేదు. మన బౌలర్లకే కాకుండా ఆసీస్‌ స్పిన్నర్లూ ఇబ్బంది పడ్డారు. రవి బిష్ణోయ్ ఎక్కువగా పరుగులు సమర్పించినా ఇబ్బందేం లేదు. ఇలాంటి వికెట్‌పై బౌలింగ్‌ చేయడం ఎవరికైనా కష్టమే. జోష్ ఇంగ్లిస్‌ ఆడిన తీరును చూశాక బ్యాటింగ్‌కు పిచ్‌ అనుకూలంగానే అనిపించింది. లక్ష్య ఛేదనలోనూ మేం ఎలాంటి ఒత్తిడికి గురికాలేదు. చివర్లో రింకు సింగ్‌ ఫినిషింగ్‌ అద్భుతం. ఐపీఎల్‌లో ఇప్పటికే అతడి ఆటతీరును చూశాం. ఇప్పుడు ఆసీస్‌పైనా అదే దూకుడు కొనసాగించడం అభినందనీయం’’ అని ఇషాన్‌ కిషన్‌ వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని