IND vs PAK: మా జట్టు ఓడిపోవడానికి ప్రధాన కారణం అతడే: పాక్‌ మాజీ కెప్టెన్

స్వల్ప స్కోరును ఛేదించే క్రమంలో తమ జట్టు ఆటగాళ్ల ప్రదర్శనపై పాక్‌ మాజీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Published : 10 Jun 2024 12:39 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌లో (T20 World Cup 2024) వరుసగా రెండో ఓటమితో పాకిస్థాన్‌ కష్టాల్లో పడింది. భారత్‌ నిర్దేశించిన 120 పరుగుల టార్గెట్‌ను ఛేదించడంలో విఫలమైన పాక్‌ 113/7 స్కోరుకే పరిమితమైంది. అయితే, తమ జట్టు ఓటమికి భారత అద్భుతమైన బౌలింగ్‌తోపాటు పాక్‌ బ్యాటర్ల తప్పిదాలే కారణమని మాజీ కెప్టెన్ సలీమ్ మాలిక్‌ వ్యాఖ్యానించాడు. మొత్తం 120 బంతుల్లో 59 బంతులు డాట్స్‌గా పడటం గమనార్హం. కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన వసీమ్‌ ఇమాద్ 23 బంతులు ఎదుర్కొని కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు. ఇదే మా జట్టు ఓటమికి కారణమని మాలిక్ విమర్శించాడు. 

‘‘మీరు ఒకసారి వసీమ్‌ ఇమాద్ ఇన్నింగ్స్‌ను చూడండి. చివర్లో దూకుడుగా ఆడాల్సి ఉన్నా అలా చేయలేదు. బంతులను వృథా చేశాడు. దీంతో లక్ష్య ఛేదన కష్టంగా మారిపోయింది. ఒకవేళ కొన్ని పరుగులు చేసి ఉంటే పాక్‌ గెలిచేందుకు అవకాశం ఉండేది’’ అని మాలిక్‌ ఓ టీవీ కార్యక్రమంలో వ్యాఖ్యానించాడు. ఇదే చర్చలో మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది కూడా ఉన్నాడు. 

బాబర్‌తో వారికి సమస్య ఉన్నట్లుంది: అఫ్రిది

‘‘పాకిస్థాన్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌లో మంచి వాతావరణం ఉన్నట్లు అనిపించడం లేదు. కెప్టెన్ బాబర్ అజామ్‌తో సమస్యలు ఉన్నాయేమో తెలియదు. జట్టులోని ప్రతి ఒక్కరికి సారథి మద్దతుగా నిలవాలి. అంతా అతడి చేతిలోనే ఉంటుంది. జట్టును నాశనం చేయాలన్నా.. నాణ్యమైన టీమ్‌గా మార్చాలన్నా అతడికే సాధ్యం. ఈ వరల్డ్‌ కప్‌ ముగిసిన తర్వాత దీనిపై వివరంగా మాట్లాడతా. ఇప్పుడే చెబితే.. నేను షహీన్‌కు సపోర్ట్‌గా మాట్లాడుతున్నానని అనుకుంటారు. అతడు నా అల్లుడు కాబట్టే బంధుప్రీతి చూపానని వ్యాఖ్యలు చేసేవారూ లేకపోలేదు’’ అని అఫ్రిది వ్యాఖ్యానించాడు. 

మనం దానిని తయారు చేసి పెట్టుకుందాం: అక్తర్

‘‘పాకిస్థాన్‌ మ్యాచ్‌ ఆడేటప్పుడు ఓ టెంప్లేట్‌ను తయారు చేసి పెట్టుకోవడం బెటర్. నిరుత్సాహం - బాధకు గురయ్యా వంటివి పోస్టు చేస్తే సరిపోతుంది. మ్యాచ్‌ ఓడిపోవడం వల్ల అందరూ నిరుత్సాహానికి గురయ్యారు. గెలవాలనే తపనతో ఆడితే ఫర్వాలేదు. పాక్ సూపర్ -8కి అర్హత సాధిస్తుందని చెప్పగలరా? ఆ దేవుడికే తెలియాలి’’ అని ఓ వీడియోను మాజీ పేసర్ షోయబ్ అక్తర్‌ పోస్టు చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు